Telugu Global
Sports

విఖ్యాత వస్తాదు వినేశ్ క్రీడాపురస్కారాలు వెనక్కి !

అంతర్జాతీయ పతక విజేత వినేశ్ పోగట్ తనకు కేంద్రప్రభుత్వం అందచేసిన క్రీడాపురస్కారాలను వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించింది.

విఖ్యాత వస్తాదు వినేశ్ క్రీడాపురస్కారాలు వెనక్కి !
X

భారత కుస్తీ సమాఖ్యకు పట్టిన గ్రహణం ఇప్పట్లో వీడేలా ఏమాత్రం కనిపించడం లేదు. అంతర్జాతీయ పతక విజేత వినేశ్ పోగట్ తనకు కేంద్రప్రభుత్వం అందచేసిన క్రీడాపురస్కారాలను వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించింది.

అంతర్జాతీయ పోటీలలో దేశానికి ఎన్నో పతకాలు సంపాదించి పెట్టిన జాతీయ కుస్తీ సమాఖ్యను రోజుకో వివాదం కదిపికుదిపేస్తోంది. బీజెపీ ఎంపీ, కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రూపంలో పట్టిన గ్రహణం ఇప్పట్లో వీడేలా ఏమాత్రం కనిపించడం లేదు.

దేశానికి అంతర్జాతీయంగా పేరుతెచ్చిన ఏడుగురు మహిళా వస్తాదులను కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఆయన అనుచరులు లైంగికంగా వేధించారంటూ మొదలైన ఆరోపణలు చిలికిచిలికి గాలివానలా మారాయి. చివరకు కుస్తీ సమాఖ్యనే బజారున పడేశాయి..

దోషులపై చర్యలు నాస్తి....

తమను లైంగికంగా వేధించారంటూ ఏడుగురు మహిళా వస్తాదులు రోడ్డెక్కి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టినా కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ, భారత ఒలింపిక్ సంఘం మిన్నకుండిపోయాయి.

ఆరోపణలు ఎదుర్కొంటున్న కుస్తీ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమ పార్టీకి చెందిన ఎంపీనే కావడంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రసర్కార్ రక్షించుకొనే పనిలో పడిపోయింది. వస్తాదుల మొరవినడానికి ప్రధాని ఏమాత్రం ఆసక్తి చూపకపోడం వివాదాస్పదమయ్యింది.

ఇటీవలే జరిగిన కుస్తీ సమాఖ్య ఎన్నికలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ తన జేబుబొమ్మ సంజయ్ సింగ్ ను అధ్యక్షుడుగా ఎన్నిక చేసుకోడం ద్వారా తమ గుప్పిట్లోనే ఉంచుకోగలిగారు.

కుస్తీ సమాఖ్య ఎన్నికలలో మొత్తం 47 ఓట్లకు గాను 40 ఓట్లు తమకు పడేలా చేసుకోడం ద్వారా బ్రిజ్ భూషణ్ తన సహచరుడినే ఎంపిక చేసుకొన్న తీరు తీవ్రవిమర్శలకు తావిచ్చింది.

దీంతో..పలువురు విఖ్యాత వస్తాదులు తమ అసంతృప్తిని, ఆందోళనను పలు విధాలుగా బయట పెట్టారు. చివరకు కుస్తీ సమాఖ్య ఎన్నికను రద్దు చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం ప్రకటించినా నిరసనకు దిగిన వస్తాదులు శాంతించలేదు.

భజరంగ్ పూనియా పద్మశ్రీ వెనక్కి...

తనకు లభించిన ప్రభుత్య పౌర పురస్కారం పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్లు ఒలింపిక్స్ పతక విజేత భజరంగ్ పూనియా ప్రకటించాడు. ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మాలిక్ మాత్రం తాను కుస్తీ క్రీడ నుంచే వైదొలగుతున్నట్లు ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించింది.

కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, ప్రపంచ కుస్తీ పతక విజేత వినేశ్ పోగట్ మరో అడుగు ముందుకేసి..తనకు ప్రభుత్వం నుంచి లభించిన దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ఖేల్ రత్నతో పాటు అర్జున అవార్డును సైతం వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖను పంపింది.

కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడి నుంచి తమకు జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని, తగిన చర్యలు తీసుకోవాలంటూ హిందీలో ప్రధానికి విన్నవించుకొంది. గత ఏడాదికాలంగా బ్రిజ్ భూషణ్, ఆయన అనుచర గణం నుంచి తాము లైంగికంగా ఎదుర్కొన్న వేధింపులను తన లేఖలో ఏకరువు పెట్టింది.

కుస్తీ సమాఖ్యకు సరికొత్తగా ఎంపికైన కార్యవర్గాన్ని తాము గుర్తించబోమని నిరసనకు దిగిన వస్తాదులు ప్రకటించారు.

కుస్తీ వద్దు..రాజకీయాలే ప్రధానం- బ్రిజ్ భూషణ్...

కుస్తీ సమాఖ్యను వీధులపాలు చేసి, వివాదానికి కేంద్రబిందువుగా మారిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం..తనకు కుస్తీ సమాఖ్యకు ఇక ఏవిధమైన సంబంధం లేదని, తాను కుస్తీ రంగం నుంచి ఉపసంహరించుకొని...రాజకీయాలకే పరిమితమవుతానని ప్రకటించాడు. కుస్తీ సంఘానికి, తనకు ఇకముందు ఎలాంటి సంబంధం ఉండబోదని తేల్చి చెప్పాడు.

మరోవైపు....కుస్తీ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ మాత్రం..గత 12 సంవత్సరాల కాలంగా తనకు భారత కుస్తీ సమాఖ్యతో అనుబంధం ఉందని, ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలను, అవార్డులను వెనక్కు తిరిగి ఇచ్చివేస్తామనటం ఏమాత్రం సబబుకాదని, కుస్తీతో రాజకీయాలు చేయవద్దంటూ ఆందోళనకు దిగిన వస్తాదులకు హితవు పలికారు.

దేశానికి కచ్చితంగా పతకాలు సాధించిపెట్టగల వినేశ్ పోగట్, భజరంగ్ పూనియా, సాక్షీ మాలిక్ లాంటి అంతర్జాతీయ వస్తాదులు తమకు న్యాయం జరగకపోడంతో మీడియాముందుకు వచ్చి కన్నీరుమున్నీరు కావటాన్ని క్రీడాభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

First Published:  28 Dec 2023 1:15 PM IST
Next Story