Telugu Global
Sports

ముంబయి జట్టును బెంబేలెత్తించిన ఉమర్‌ నజీర్‌ మిర్

రోహిత్‌ సహా ఆ జట్టు టాప్‌ బ్యాటర్లను హడలెత్తించిన జమ్ముకశ్మీర్‌ బౌలర్‌

ముంబయి జట్టును బెంబేలెత్తించిన ఉమర్‌ నజీర్‌ మిర్
X

రోహిత్‌ శర్మ క్రీజులోకి వచ్చాడంటే ఇంటర్నేషనల్‌ బౌలర్లే భయపడుతారు. బాల్‌ ఏ మాత్రం గతి తప్పినా అది బౌండరీ లైన్‌ దాటాల్సిందే. మరి అలాంటి డేంజరస్‌ బ్యాటర్‌ ఫామ్‌ అందుకోవడానికి రంజీ మ్యాచ్‌ బరిలోకి దిగాడు. అయితే రోహిత్‌ సహా ఆ జట్టు టాప్‌ బ్యాటర్లను ఓ దేశవాలీ బౌలర్‌ హడలెత్తించాడు. అతనే జమ్ముకశ్మీర్‌ జట్టుకు చెందిన ఉమర్‌ నజీర్‌ మిర్. 31 ఏళ్ల ఈ పేసర్‌ తన స్పెల్‌లో కీలకమైన రోహిత్‌తో పాటు ముంబయి సారథి అజింక్య రహానెను ఔట్‌ చేశాడు. యువ సంచలనం దూబెను మొదటి బాల్‌కే పెవిలియన్‌ పంపాడు. మిగతా బౌలర్లూ రాణించడంతో ముంబయి 120 రన్స్‌కే ఆలౌటైంది. శార్దూల్‌ ఠాకూర్‌ (51నౌటౌట్‌) ఒక్కడే రాణించాడు.

ముంబయి ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్‌ (4), రోహిత్‌ శర్మ (3) ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈపిచ్‌పై జమ్ముకశ్మీర్‌ బౌలర్లు చెలరేగారు. ముంబయి బ్యాటర్లు ఏ మాత్రం కుదురుకోనీయలేదు. మొదట నబీ వికెట్ల వేటను ప్రారంభించాడు. యశస్విని ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఉమర్‌ నజీర్‌ వేట ప్రారంభమైంది. ఓ షార్ట్‌ పిచ్‌ బాల్‌తో రోహిత్‌ను ఊరించి.. వికెట్‌ తీశాడు. ఆ తర్వాత హార్దిక్‌ తామోరె (7) ను కూడా పెవిలియన్‌కు పంపాడు. దేశవాళీలో మంచి ఫామ్‌ కనబరిచి ముంబయి సారథి అజింక్య రహానె (12) ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. శివమ్‌ దూబె డకౌట్‌ కావడానికి కారణమూ ఉమర్‌. చక్కటి పేస్‌తో పాటు బౌన్స్‌ రాబట్టడం అతని ప్రత్యేకత. పిచ్‌ నుంచి కొద్దిగా సహకారం దొరికితే ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తిస్తాడు.

జమ్ముకశ్మీర్‌కు చెందిన నజీర్‌ 6 అడుగుల నాలుగు అంగుళాల పొడగరి. బాల్‌ను ఎలా సంధించాలంటే అలా ఈజీగా వేసేస్తాడు. హైట్‌ కూడా అతనికి కలిసి వచ్చే అంశం. 2013లో ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ను ప్రారంభించిన అతను ఇప్పటివరకు 57 మ్యాచ్‌లు ఆడాడు. 138 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌ లో 54, టీ 20ల్లో 32 వికెట్లు తీశాడు. పుల్వామాకు చెందిన ఉమర్‌ కు 2018-19 దేవధర్‌ ట్రోఫికి భారత్‌ సీ స్క్వాడ్‌లో చోటు లభించింది. నేషనల్‌ టీమ్‌లో మాత్రం ప్లేస్‌ దక్కించుకోలేకపోయాడు

First Published:  23 Jan 2025 2:34 PM IST
Next Story