Telugu Global
Sports

యూరోలో అగ్రశ్రేణిజట్ల జోరు..క్వార్టర్స్ లో ఫ్రాన్స్,పోర్చుగల్!

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రీడాసంరభం 2024 యూరోకప్ నాకౌట్ పోటీలు జోరుగా సాగిపోతున్నాయి. మాజీ చాంపియన్ జట్లు ఫ్రాన్స్, పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్ చేరాయి.

యూరోలో అగ్రశ్రేణిజట్ల జోరు..క్వార్టర్స్ లో ఫ్రాన్స్,పోర్చుగల్!
X

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రీడాసంరభం 2024 యూరోకప్ నాకౌట్ పోటీలు జోరుగా సాగిపోతున్నాయి. మాజీ చాంపియన్ జట్లు ఫ్రాన్స్, పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్ చేరాయి.

ఫుట్ బాల్ చరిత్రలో రెండో అతిపెద్ద, అత్యంత జనాదరణ పొందుతున్న యూరోపియన్ కప్ సాకర్ సమరం హోరాహోరీగా సాగుతోంది. జర్మనీలోని పలు ప్రధాన నగరాలు వేదికగా జరుగుతున్న ఈ పోరు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో మాజీ చాంపియన్ జట్లు జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ కీలక విజయాలు సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించాయి.

షూటౌట్లో పోర్చుగల్ హిట్......

ఫ్రాంక్ ఫర్ట్ ఎరీనా స్టేడియం వేదికగా స్లొవేనియాతో జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో 2016 చాంపియన్ పోర్చుగల్ గట్టి పోటీ ఎదుర్కొని పెనాల్టీ షూటౌట్ లో 3-0 గోల్స్ తో విజేతగా నిలువగలిగింది.

ఆట నిర్ణితసమయంలో ఏ జట్టు గోలు చేయలేకపోడంతో అదనపు సమయానికి పొడిగించారు. స్లొవేనియా కట్టుదిట్టమైన డిఫెన్స్ తో పవర్ ఫుల్ పోర్చుగల్ ను నిలువరించినా... ఎక్స్ ట్రా టైమ్ మొదటి భాగంలో పెనాల్టీని సమర్పించుకోక తప్పలేదు. అయితే..పోర్చుగీసు సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పెనాల్టీని గోలుగా మలచడంలో విఫలమయ్యాడు.

పెనాల్టీల ద్వారా మంచినీళ్లప్రాయంలో గోల్స్ సాధించడంలో మొనగాడిగా పేరుపొందిన రొనాల్డో కొట్టిన కిక్ ను స్లొవేనియా గోల్ కీపర్ గాల్లోకి ఎగిరి మరి అడ్డుకొన్నాడు.

దీంతో కంగుతిన్న క్రి్స్టియానో రొనాల్డో కన్నీరుమున్నీరయ్యాడు. తనజట్టుకు వచ్చిన అవకాశం చేజారిపోడంతో రొనాల్డో తీవ్రనిరాశకు గురికావడంతో సహఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం అండగా నిలిచి తిరిగి ఆటపై దృష్టి నిలపడంలో తమవంతు పాత్ర నిర్వర్తించారు.

ఆట అదనపు సమయంలోనూ స్కోరు 0-0 కావడంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ పాటించారు.

షూటౌట్ లో పోర్చుగల్ గీల్ కీపర్ రికార్డు...

పెనాల్టీ షూటౌట్ లో పోర్చుగల్ తరపున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండేజ్, బెర్నార్డో సిల్వా గోల్స్ సాధించడం ద్వారా తమజట్టుకు 3-0 ఆధిక్యం అందించారు. అయితే స్లొవేనియా ఆటగాళ్ల మూడు పెనాల్టీలను పోర్చుగల్ గోల్ కీపర్ కోస్టా వమ్ము చేసి తనజట్టును 3-0తో విజేతగా నిలిపాడు.

యూరోకప్ సాకర్ చరిత్రలో పెనాల్టీ షూటౌట్ రౌండ్లో మూడుకు మూడు పెనాల్టీలను అడ్డుకొన్న గోల్ కీపర్ గా పోర్చుగల్ గోల్ కీపర్ రికార్డు నెలకొల్పితే..షూటౌట్లో మూడుకు మూడు పెనాల్టీలలోనూ విఫలమైన జట్టుగా స్లొవేనియా నిలిచింది.

2016 యూరోకప్ టైటిల్ పోరులో ఫ్రెంచ్ జట్టును ఓడించడం ద్వారా విజేతగా నిలిచిన పోర్చుగల్...హాంబర్గ్ వేదికగా జరిగే క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది.

బెల్జియం పై చచ్చీచెడి నెగ్గిన ఫ్రాన్స్...

డ్యూసెల్ డోర్ఫ్ వేదికగా జరిగిన మరో ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ సమరంలో విజయం సాధించడానికి ప్రపంచ మాజీ చాంపియన్ ఫ్రాన్స్ పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. చివరకు 1-0 తేడాతో బెల్జియంను అధిగమించగలిగింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో పవర్ ఫుల్ ఫ్రాన్స్ కు బెల్జియం గట్టిపోటీనే ఇచ్చింది. ఆట నిర్ణితసమయంలో స్కోరు 0-0 కావడంతో..ఎక్స్ట్ ట్రా టైమ్ కు పొడిగించారు. అదనపు సమయం ముగియటానికి 5 నిముషాలు మిగిలి ఉండగా.. జాన్ వెర్టాగెన్ సాధించిన గోలుతో ఫ్రాన్స్ విజేతగా నిలువగలిగింది.

2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ రన్నరప్ గా నిలిచిన ఫ్రాన్స్..మూడో యూరో టైటిల్ కు గురిపెట్టింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్ సమరంలో పోర్చుగల్ పరీక్షను ఎదుర్కోనుంది.

ఆతిథ్య జర్మనీ, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ జట్లు సైతం తమతమ ప్రీ- క్వార్టర్ ఫైనల్స్ లో కీలక విజయాలు సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి. ఇటలీ పైన స్విట్జర్లాండ్, స్లవాకియా పైన ఇంగ్లండ్, డెన్మార్క్ పైన జర్మనీజట్లు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ విజయాలు సాధించాయి.

ఒలింపిక్స్ తరువాత అతిపెద్ద క్రీడాసమరంగా ప్రపంచ ఫుట్ బాల్ పోటీలు నిలిస్తే..యూరోపియన్ కప్ పోటీలను మూడో అతిపెద్ద క్రీడాసంరంభంగా పరిగణిస్తున్నారు. యూరోప్ ఖండ దేశాలన్నీ యూరోకప్ ను ఓ తిరునాళలా, పండుగలా జరుపుకోడం ఆనవాయితీగా వస్తోంది.

First Published:  2 July 2024 12:18 PM IST
Next Story