విరాట్ కు వంద వందల రికార్డు అసాధ్యమే- లారా!
విరాట్ కొహ్లీ ఎన్నిరికార్డులు సాధించినా..100 సెంచరీల రికార్డు అధిగమించడం అసాధ్యమని కరీబియన్ క్రికెట్ గ్రేట్ లారా తేల్చి చెప్పాడు...
విరాట్ కొహ్లీ ఎన్నిరికార్డులు సాధించినా..100 సెంచరీల రికార్డు అధిగమించడం అసాధ్యమని కరీబియన్ క్రికెట్ గ్రేట్ లారా తేల్చి చెప్పాడు...
మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న పలు ప్రపంచ రికార్డులను అధిగమిస్తూ వస్తున్న నయామాస్టర్ విరాట్ కొహ్లీకి..వంద అంతర్జాతీయ శతకాల రికార్డును తిరగరాయటం అంత తేలికకాదని.. క్రికెట్ కోణంలో చూస్తే అది సాధ్యమయ్యే పనికాదని కరీబియన్ బ్యాటింగ్ గ్రేట్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రయన్ లారా చెప్పారు.
కొహ్లీకి విరాభిమానినే...అయినా...?
భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీకి తాను వీరాభిమానినని, కొహ్లీ శతకాలు బాదుతూ ఉంటే సంతోషించేవారిలో తాను ముందుంటానని..అయితే ..మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న వంద వందల రికార్డును అధిగమించడం కొహ్లీకి అంత తేలికాదని, అసలు సాధ్యపడే విషయమే కాదని లారా అభిప్రాయపడ్డారు.
ఓ క్రికెటర్ గా, క్రికెట్ విశ్లేషకుడిగా చూస్తే..తన దృష్టిలో సచిన్ పేరుతో ఉన్న వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును విరాట్ కొహ్లీ అధిగమించే అవకాశమే కనిపించడం లేదని ఓ ఇంటర్వ్యూలో లారా విశ్లేషించారు.
క్రికెట్లో ఏదీ అసాధ్యం కాదన్న నానుడి ఉందని..అయితే..వయసు మీరిన, మీరుతున్న ఆటగాళ్ల విషయంలో మాత్రం అది వర్తించదని లారా వివరించారు.
వచ్చే 4 సంవత్సరాలలో 20 శతకాలు?
విరాట్ కొహ్లీ వయసు 35 సంవత్సరాలని, ఇప్పటికే 80 శతకాలు బాదిన రికార్డును సొంతం చేసుకొన్నాడని, కేవలం వన్డే క్రికెట్లోనే 50 శతకాలు బాదిన తొలి క్రికెటర్ విరాట్ మాత్రమేనని లారా గుర్తు చేశారు.
క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించడం, ఫిట్ నెస్ ను కాపాడుకోడంలో విరాట్ కు విరాట్ మాత్రమే సాటని...అయితే..2019 నుంచి 2022 మధ్యకాలంలో విరాట్ గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడని, శతకాలు సాధించడమే గగనమైపోయిందని లారా గుర్తు చేశారు. దీంతో సెంచరీల రేస్ లో విరాట్ వెనుకబడి పోవాల్సి వచ్చిందని అన్నారు.
ఇటీవలే ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో 3 సెంచరీలతో సహా 765 పరుగులతో టాపర్ గా నిలిచిన విరాట్ 50 వన్డే శతకాల ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు. ప్రపంచకప్ అత్యుత్తమ బ్యాటర్ గా కూడా నిలిచాడు. వన్డే క్రికెట్ ఫార్మాట్లో మాత్రమే భారీగా శతకాలు బాదే విరాట్ వచ్చే ఏడాదికాలంలో ఐదు వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉందని లారా వివరించారు.
అయోమయంగా టీ-20 కెరియర్..
మరో వైపు..టీ-20 ఫార్మాట్లో విరాట్ కెరియర్ గాల్లో దీపంలా మారింది. 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో విరాట్ కొహ్లీకి అవకాశమే లేదన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కెప్టెన్ కమ్ ఎటాకింగ్ ఓపెనర్ గా రోహిత్ శర్మకు మరో అవకాశం ఉన్నా..విరాట్ విషయంలో మాత్రం అది కనిపించడం లేదు.
సాంప్రదాయ టెస్టు ఫార్మాట్లో నిలకడలేమితో ఉన్న విరాట్ కు ఇప్పటి వరకూ 50 వన్డే , 29 టెస్టు, ఒకే ఒక్క టీ-20 శతకం బాదిన రికార్డు ఉంది. మొత్తం 80 సెంచరీలు సాధించిన విరాట్ మరో 21 శతకాలు సాధించగలిగితే కానీ మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న శతశతకాల ప్రపంచ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
ఇప్పటికే 35 సంవత్సరాల వయసులో ఉన్న విరాట్ వందవ శతకం బాదే నాటికి 39 లేదా 40 సంవత్సరాల వయసు వచ్చినా ఆశ్చర్యం లేదని లారా తెలిపారు.
ఏడాదికి ఐదు శతకాల చొప్పున వచ్చే నాలుగేళ్లపాటు నిలకడగా రాణించడం ద్వారా 21 సెంచరీలు చేయగలిగితేనే 101 సెంచరీల ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంటుందని..క్రికెట్లోని పరిమితులు, సాధ్యాసాధ్యాల దృష్ట్యా ఆలోచిస్తే వందసెంచరీల మైలురాయిని విరాట్ చేరే అవకాశమే లేదని లారా తేల్చి చెప్పారు.
తన ప్రియమైన స్నేహితుడు మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును విరాట్ అధిగమించగలిగితే తనకంటే సంతోషించేవారు మరొకరు లేరని లారా వివరించారు.
వచ్చే నాలుగు సంవత్సరాలపాటు ఫిట్ నెస్ తో పాటు ఫామ్ ను కాపాడుకోటం, ఏడాదికి ఐదు సెంచరీల చొప్పున బాదగలిగితేనే విరాట్..వంద శతకాల శిఖరాన్ని అధిరోహించ గలుగుతాడు.