సిరీస్ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్‌గా నాదే
తన కెరీర్‌లో ఇదే అథమ దశ అని వ్యాఖ్యానించిన రోహిత్ వర్మ
న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. ముంబాయిలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 147 పరుగుల స్వల్ప టార్గెట్‌నూ ఛేదించడంలో చేతులెత్తేయడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. సిరీస్ ఓటమి, పంత్ ఔట్, ఆసీస్ పర్యటనపై స్పందించాడు. టెస్ట్ సిరీస్ వైట్‌వాష్ కావడానికి కెప్టెన్‌గా తానే బాధ్యత వహిస్తానని..తన కెరీర్‌లో ఇదే అథమ దశ అని వ్యాఖ్యానించాడు.
సిరీస్ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా గెలుస్తామనుకున్న ఇలాంటి మ్యాచ్‌ను కోల్పోవడం బాధిస్తున్నది. మా స్థాయి క్రికెట్ ఆడలేదన్నది మాత్రం సుస్పష్టం. ఇలాంటి పిచ్‌పై ఎలా ఆడాలన్నది పంత్, వాషింగ్టన్ సుందర్ చూపెట్టారు. ఇంకా కొంత యాక్టివ్‌గా ఉండాల్సింది. గత నాలుగైదు ఏళ్లగా దీనిపై చర్చిస్తూనే ఉన్నాం. కెప్టెన్‌గా, ఆటగాడిగా నా బెస్ట్ పర్‌ఫార్మెన్స్ లేదనుకుంటా. టీమ్‌ను సరైన మార్గంలో నడిపించలేదు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్‌గా నాదే. సిరీస్‌ను కోల్పోయినా కొన్ని సానుకూలతలు ఉన్నాయి. మా బౌలర్లు బౌలింగ్ బాగా చేశారు. కానీ టీమ్‌గా మేం విజయవంతం కాలేకపోయామని రోహిత్ వెల్లడించాడు.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండోస్థానికి భారత్
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ కావడంతో భారత్ మూడోసారి ఫైనల్‌కు చేరుకుందామనే ఆశలకు గండికొట్టేలా ఉన్నది. ఈ సిరీస్ ముందువరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఇప్పుడు 0-3 తేడాతో సిరీస్ కోల్పోవడంతో రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో మొదటి స్థానానికి ఎగబాకింది. భారత్ 58.33 శాతంతో, శ్రీలంక 55.56 శాతం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గడంతో న్యూజిలాండ్ 54.55 శాతంతో నాలుగో స్థానానికి, తర్వాత సౌతాఫ్రికా 54.17 శాతంతో ఐదో స్థానంలో నిలిచాయి.