అప్పుడు కెసీఆర్..ఇప్పుడు రేవంత్..పంటపండిన నిఖత్ జరీన్!
తెలంగాణా బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ పంట పండింది.ప్రభుత్వాలు మారినా నిఖత్ పైన కానుకల వర్షం కురుస్తూనే ఉంది.
తెలంగాణా బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ పంట పండింది.ప్రభుత్వాలు మారినా నిఖత్ పైన కానుకల వర్షం కురుస్తూనే ఉంది...
తెలుగు రాష్ట్ర్రాల బాక్సింగ్ స్టార్, భారత బాక్సింగ్ క్వీన్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ పైన కానుకల వర్షం కురుస్తూనే ఉంది. తెలంగాణా రాష్ట్ర్రంలో ప్రభుత్వం మారినా నిఖత్ ను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో నిన్నటి, నేటి ప్రభుత్వాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.
రేవంత్ నజరానా 2 కోట్లు...
కొద్దిరోజుల క్రితమే తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిజామాబాద్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ ను 2 కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతితో వెన్నుతట్టి ప్రోత్సహించారు.
సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలలో భాగంగా కొత్త ప్రభుత్వం నిర్వహించిన పలు కార్యక్రమాలలో భాగంగా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 కోట్ల రూపాయల చెక్కును అందచేశారు.
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం...
హాంగ్జు వేదికగా కొద్దినెలల క్రితం ముగిసిన ఆసియాక్రీడల్లో కాంస్య పతకం మాత్రమే సాధించిన నిఖత్ జరీన్ వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉంది. తనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 కోట్ల రూపాయలను పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలు, శిక్షణ కోసం వినియోగించుకొంటానని నిఖత్ జరీన్ ప్రకటించింది.
కెసీఆర్ ప్రభుత్వ కానుకగా 600 గజాల ఇంటి స్థలం!
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కెసీఆర్ చేతుల మీదుగా నిఖత్ జరీన్ 2కోట్ల రూపాయల చెక్కుతో పాటు 600 గజాల ఇంటిస్థలం పత్రాలు అందుకొంది.
టర్కీ వేదికగా ముగిసిన ప్రపంచ బాక్సింగ్ పోటీలతో పాటు బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు బంగారు పతకాలు అందించడం ద్వారా నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ లోకి తారాజువ్వలా దూసుకొచ్చింది.
కుటుంబసభ్యుల ప్రోత్సాహం,ప్రభుత్వం ఆర్థిక సాయం, శిక్షకుల మార్గదర్శనం నడుమ గత రెండేళ్లుగా నిఖత్ జరీన్ పడిన కష్టానికి , ఆమె కుటుంబం త్యాగానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. 25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ బాక్సింగ్ లో బంగారు పతకం నెగ్గిన తొలి తెలుగు మహిళగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది.
టర్కీలోని అంటాలియా నగరంలో ముగిసిన 2022 ప్రపంచ మహిళా బాక్సింగ్ 52 కిలోల విభాగం టైటిల్ సమరంలో నిఖత్ జరీన్ 5-0తో థాయ్ లాండ్ బాక్సర్ జిట్ పాంగ్ జుటామాస్ ను చిత్తు చేయడం ద్వారా విశ్వవిజేతగా బంగారు పతకం అందుకొంది. 2022ప్రపంచ టోర్నీలో భారత్ సాధించిన ఒకేఒక బంగారు పతకం నిఖత్ సాధించినదే కావడం విశేషం. 2018 ప్రపంచ బాక్సింగ్ లో మేరీకోమ్ బంగారు పతకం నెగ్గిన తరువాత భారత్ కు మరో ప్రపంచ బాక్సింగ్ స్వర్ణ పతకం అందించిన ఘనతను నిఖత్ జరీన్ సొంతం చేసుకొంది.
అంతేకాదు..బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో సైతం నిఖత్ జరీన్ బంగారు పతకం గెలుచుకోడంతో కేంద్రప్రభుత్వం ఇచ్చే నజరానాకు తోడు..తెలంగాణా ప్రభుత్వం సైతం తనవంతుగా 2 కోట్ల రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా అందచేసింది.
తెలుగు తొలి మహిళా బాక్సర్ నిఖత్..
ప్రపంచ సీనియర్ బాక్సింగ్ లో స్వర్ణపతకం సాధించిన భారత ఐదవ మహిళగా, తెలుగు రాష్ట్ర్రాల తొలి యువతిగా నిఖత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ టోర్నీలలో మేరీకోమ్ మాత్రమే 2002,2005,06, 08, 10, 18) ఆరుసార్లు బంగారు పతకాలు గెలుచుకొంది.
2006 ప్రపంచకప్ లో సరితాదేవి, జెన్నీ ,లేఖ కేసీ బంగారు పతకాలు నెగ్గగా..2022 టోర్నీ ద్వారా నిఖత్ జరీన్ వారి సరసన నిలువగలిగింది.
ప్రస్తుతం విశ్వవిఖ్యాత క్రీడాపరికరాల సంస్థ ‘అడిడాస్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా 2018 నుంచి వ్యవహరిస్తున్న నిఖత్ జరీన్ కు ప్రస్తుత ప్రపంచ టైటిల్ తో వివిధ రూపాలలో కాసులవర్షం కురుస్తూనే ఉంది.
ప్రపంచ చాంపియన్ హోదాలో ..మరో ఏడాదిలో పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా నిఖత్ జరీన్..50 కేజీలు లేదా 54 కేజీల విభాగాలలో..ఏదో ఒక తరగతిలో తలపడాల్సి ఉంది.
తెలంగాణా రాష్ట్ర్రానికే గర్వకారణంగా నిలిచిన యువ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రపంచ బాక్సింగ్ టైటిల్ గెలిచినందుకు ప్రోత్సాహకంగా 600 గజాల ఇంటిస్థలాన్ని కేటాయించింది.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ కు తెలంగాణా క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ 600 గజాల ఇంటిస్థలం కేటాయించిన పత్రాలను అందచేశారు.
త్వరలోనే డీఎస్పీ ఉద్యోగ నియామకం?..
గతంలో నిఖత్ జరీన్ కు ముఖ్యమంత్రి కెసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రెండు కోట్ల నగదు బహుమతి, 600 గజాల ఇంటిస్థలం పత్రాలు అందచేశామని, త్వరలోనే గ్రూపు-1 పోస్ట్ అయిన డీఎస్పీ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని అందచేయనున్నట్లు గత ప్రభుత్వ క్రీడామంత్రి ప్రకటించారు.
‘నిఖత్ ప్రతిభను గుర్తిస్తూ సీఎం కేసీఆర్ తన నివాసానికి పిలిచి మరీ భోజనం పెట్టి ఆదరించడం తాము జీవితాంతం గుర్తుంచుకొంటామని, 2 కోట్ల రూపాయల చెక్కు, 600 గజాల ఇంటిస్థలం పత్రాలు ఇవ్వటం, డీఎస్పీ ఉద్యోగపత్రాలు త్వరలో ఇస్తామనటం తమ అదృష్టమని నిఖత్ తండ్రి పొంగిపోతూ చెప్పారు.
రాజకీయపార్టీలకు అతీతంగా నిఖత్ జరీన్ ను గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రోత్సహించడం అభినందనీయం.