రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమి... సిరీస్ న్యూజిలాండ్ కైవసం
చరిత్ర సృష్టించిన కివీస్ జట్టు.. రెండో టెస్టులో టీమిండియా 113 రన్స్ తేడాతో ఓటమి
టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 2-0తో కివీస్ జట్టు సిరీస్ కైవసం చేసుకున్నది. 198/5 మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ 255 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 103 రన్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్‌కు 359 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ను శాంట్నర్ (6 వికెట్లు తీసి) గట్టి దెబ్బకొట్టాడు. దీంతో రెండో ఇన్సింగ్స్‌లో భారత్ 245 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 34 రన్స్ వద్ద రోహిత్ శర్మ (8) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ తో కలిసి యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడటంతో లంచ్ విరామ సమయానికి భారత్ 81/1 స్కోర్‌తో మెరుగైన స్థితిలో కనిపించింది. కానీ రెండో సెషన్‌లో ఆరు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి అక్కడే ఖాయమైపోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ యశస్వి, గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ లను ఔట్ చేసి టీమిండియాను కోలుకోని దెబ్బతీశాడు. యశస్వి జైస్వాల్ (77) , రవీంద్ర జడేజా (42) మినహా బ్యాటర్లెవరూ రాణించలేదు. రిషబ్ పంత్ కూడా అనవసరంగా రనౌటయ్యాడు. పటేల్ 2, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ 259, భారత్ 156 రన్స్ చేశాయి.