Telugu Global
Sports

ఇద్దరు మొనగాళ్లకు ఇదే ఆఖరి చాన్స్!

భారత్ ను విశ్వవిజేతగా నిలపటానికి ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ దిగ్గజ ఆటగాళ్లు విరాట్, రోహిత్ లకు ఆఖరి అవకాశంగా కనిపిస్తోంది.

ఇద్దరు మొనగాళ్లకు ఇదే ఆఖరి చాన్స్!
X

భారత్ ను విశ్వవిజేతగా నిలపటానికి ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ దిగ్గజ ఆటగాళ్లు విరాట్, రోహిత్ లకు ఆఖరి అవకాశంగా కనిపిస్తోంది.

భారత క్రికెట్ కు గత 17 సంవత్సరాలుగా అసమాన సేవలు అందిస్తున్న మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్ శర్మ గత 13 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారి కూడా తమ జట్టుకు ప్రపంచకప్ ను అందించలేకపోయారు. అయితే..మరికొద్దిరోజుల్లో అమెరికా గడ్డపైన ప్రారంభంకానున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఈ ఇద్దరి మొనగాళ్లకు ఆఖరి అవకాశంగా కనిపిస్తోంది.

ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు....

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ ఓ ఐసీసీ ట్రోఫీ సాధించి 13 సంవత్సరాలయ్యింది. చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్ ను మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో సాధించింది. ఆ తర్వాత నుంచి జరిగిన వన్డే, టీ-20 ప్రపంచకప్ టోర్నీలతో పాటు..ఐసీసీ టెస్టు లీగ్ టోర్నీలలో పాల్గొంటూ వచ్చినా..కనీసం ఒక్కసారీ విజేతగా నిలువలేకపోయింది.

రికార్డుల మొనగాడు విరాట్ కొహ్లీ కెప్టెన్ గా పలు వన్డే, టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్నా..టెస్టులీగ్ ఫైనల్స్ చేరినా సఫలం కాలేకపోయింది. ఆ తర్వాత భారతజట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ సైతం కెప్టెన్ గా సక్సెస్ సాధించలేకపోయాడు.

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ అదరగొట్టిన భారతజట్టు ఫైనల్లో ఘోరంగా విఫలమయ్యింది. అంతేకాదు..ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ రెండోసారి చేరినా ట్రోఫీ అందుకోలేకపోయింది. రోహిత్ కెప్టెన్ గా ప్రపంచకప్ సాధించే అవకాశం భారత్ కు రెండుసార్లు చిక్కినట్లే చిక్కి ఉసూరుమనిపించింది. అయితే..జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

విరాట్ పైనే భారీగా ఆశలు...

కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్-17 టోర్నీలో 700కు పైగా పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ అందుకొన్న విరాట్ కొహ్లీ పైనే భారత బ్యాటింగ్ ప్రస్తుత ప్రపంచకప్ లో ప్రధానంగా ఆధారపడి ఉంది. గతంలో వన్ డౌన్ లేదా రెండోడౌన్లో బ్యాటింగ్ చేస్తూ వచ్చిన విరాట్..ప్రస్తుత ప్రపంచకప్ లో ఓపెనర్ గా పరుగుల వేటకు దిగనున్నాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ పలు అరుదైన ప్రపంచ రికార్డులు నెలకొల్పిన విరాట్ తన కెరియర్ లో ఆడుతున్న ఆఖరి ప్రపంచకప్ లో భారతజట్టును విశ్వవిజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు.

2007లో డంబుల్లా వేదికగా శ్రీలంక ప్రత్యర్థిగా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విరాట్ తనజట్టుకు టీ-20 ప్రపంచకప్ అందించాలన్న లక్ష్యంతో అమెరికాలో అడుగుపెట్టాడు. వచ్చే ప్రపంచకప్ నాటికి విరాట్ వయసు 38 సంవత్సరాలుగా ఉంటుంది. కనుక ఇదే ఆఖరి టీ-20 ప్రపంచకప్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

రోహిత్ శర్మ కెప్టెన్సీకి సవాల్...

వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ రన్నరప్ గా నిలిచినా..రోహిత్ నాయకత్వంలో వరుసగా 10 విజయాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. డాషింగ్ ఓపెనర్ గా మాత్రమే కాదు...కెప్టెన్ గా కూడా రోహిత్ మంచిపేరు సంపాదించుకొన్నాడు. జట్టు ప్రయోజనాలే ప్రధానంగా ఆడే నాయకుడుగా పేరుతెచ్చుకొన్న రోహిత్ ..అందివచ్చిన ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ ద్వారా తనజట్టును విశ్వవిజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు.

2007 ప్రారంభం టీ-20 ప్రపంచకప్ నుంచి గత ఎనిమిది టోర్నీలలోనూ పాల్గొన్న రోహిత్..వరుసగా తొమ్మిదో టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నాడు.

2007లో ఓ ఆటగాడిగా టీ-20 ప్రపంచకప్ అందుకొన్న రోహిత్...ప్రస్తుత 2024 టోర్నీలో కెప్టెన్ గా ప్రపంచకప్ అందుకోవాలన్న కసితో ఉన్నాడు.2026 టీ-20 ప్రపంచకప్ నాటికి రోహిత్ వయసు 40 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే..రోహిత్ కెరియర్ లో ఇదే ఆఖరి టీ-20 ప్రపంచకప్ అని చెప్పక తప్పదు.

భారత ఉపఖండం పిచ్ లనే పోలిన అమెరికా, కరీబియన్ పిచ్ లపైన జరుగనున్న ప్రపంచకప్ పై ఆడటం రోహిత్, విరాట్ లతో పాటు భారతజట్టు సభ్యులకు ఓ వరం లాంటిది.

ప్రస్తుత ఈ ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలువకుంటే..మరెప్పుడూ చాంపియన్ గా నిలిచే అవకాశమే లేదు. అంతేకాదు..చీఫ్ కో్చ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు సీనియర్ స్టార్లు రోహిత్, విరాట్, రవీంద్ర జడేజాలకు సైతం ప్రపంచకప్ సాధించడానికి ఇదే ఆఖరి చాన్స్ అనడంలో ఏమాత్రం సందేహంలేదు.

First Published:  30 May 2024 9:24 AM GMT
Next Story