హార్థిక్ పాండ్యాకు ఝలక్..టీ-20 కెప్టెన్ గా సూర్య!
భారత సరికొత్త శిక్షకుడు గౌతం గంభీర్ వచ్చీరావటంతోనే మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు షాకిచ్చాడు. భారత టీ-20 కెప్టెన్ కావాలన్న పాండ్యా ఆశలపై నీళ్లు చల్లాడు.
భారత సరికొత్త శిక్షకుడు గౌతం గంభీర్ వచ్చీరావటంతోనే మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు షాకిచ్చాడు. భారత టీ-20 కెప్టెన్ కావాలన్న పాండ్యా ఆశలపై నీళ్లు చల్లాడు.
భారత స్టార్ ఆల్ రౌండర్, ప్రపంచకప్ టీ-20 విజేత జట్టు వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు అనుకోని షాక్ తగిలింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో భారత టీ-20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ కాగలననుకొన్న పాండ్యా ఆశలపై భారత నయాకోచ్ గౌతం గంభీర్ నీళ్లు చల్లారు.
మిస్టర్ టీ-20కే భారతజట్టు పగ్గాలు...
శ్రీలంకతో ఈనెల ఆఖరివారంలో ప్రారంభం కానున్న తీన్నార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారత టీ-20 జట్టు పగ్గాలను మిస్టర్ టీ-20, ప్రపంచ రెండోర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చేపట్టడం ఖాయమైపోయింది.
చీఫ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కలసి ఈ విషయాన్ని హార్థిక్ పాండ్యాతో చర్చించారు. ప్రస్తుత వైస్ కెప్టెన్ పాండ్యాకు కాకుండా.. సూర్యకుమార్ యాదవ్ కే జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించారు.
యువకిశోరాలతో నవయువజట్టు..
భారత్ కు 17 సంవత్సరాల విరామం తరువాత మరో టీ-20 ప్రపంచకప్ సాధించి పెట్టిన అనంతరం ముగ్గురు సీనియర్ స్టార్లు ( రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా ) రిటైర్మెంట్ ప్రకటించడంతో..ఏర్పడిన మూడు ఖాళీలను పలువురు యువఆటగాళ్లతో భర్తీ చేయనున్నారు.
జింబాబ్వేతో ముగిసిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో 4-1తో విజేతగా నిలిచిన భారతజట్టుకు ఓపెనర్ శుభ్ మన్ గిల్ నాయకత్వం వహిస్తే...శ్రీలంకతో మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న టీ-20 సిరీస్ లో పాల్గొనే జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. టీ-20 జట్టు వివరాలను సైతం కొద్దిగంటల్లో బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించనుంది.
వర్క్ లోడ్ కారణంగానే....
రానున్నరోజుల్లో భారత టీ-20 జట్టు బాధ్యతల్ని హార్థిక్ పాండ్యాకు అప్పజెప్పే అవకాశం లేకపోలేదు. ఫిట్ నెస్, గాయాల సమస్య కారణంగా పాండ్యాకు తగిన విశ్రాంతి ఇవ్వడం కోసమే సూర్యకుమార్ ను కెప్టెన్ గా ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే టీ-20 ప్రపంచకప్ నాటికి భారత టీ-20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ ను నియమించడం ద్వారా స్థిరత్వం చేకూర్చాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.
అయితే..మినీ ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా శ్రీలంతో జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు వ్యక్తిగత కారణాలతో హార్థిక్ పాండ్యా దూరంగా ఉండాలని నిర్ణయించాడు.
జులై 27 నుంచి టీ-20 సిరీస్...
శ్రీలంక - భారత్ జట్ల నడుమ జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ కు జులై 27న పల్లెకెలీలో తెరలేవనుంది. జులై 30న జరిగే ఆఖరి మ్యాచ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ కు తెరపడనుంది.
ఆగస్టు 2 నుంచి 7 వరకూ జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో సైతం ఈ రెండు మాజీ చాంపియన్ జట్లు తలపడనున్నాయి. భారతజట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు.
సీనియర్ స్టార్లు రోహిత్, విరాట్, జడేజా సైతం శ్రీలంక సిరీస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
భారతజట్టు టీ-20 ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు ముగిసిపోడంతో...సరికొత్త కోచ్ గా బాధ్యతలు తీసుకొన్న గంభీర్ నేతృత్వంలో భారత్ తీన్మార్ టీ-20, వన్డే సిరీస్ ల్లో శ్రీలంకతో పోటీపడబోతోంది.