Telugu Global
Sports

75 వసంతాల భారత క్రికెట్ లిటిల్ మాస్టర్!

భారత క్రికెట్ తొలి సూపర్ స్టార్ సునీల్ మనోహర్ గవాస్కర్ 75వ పడిలో ప్రవేశించారు. నేటితో 54 సంవత్సరాల క్రికెట్ జీవితాన్ని పూర్తి చేశారు.

75 వసంతాల భారత క్రికెట్ లిటిల్ మాస్టర్!
X

భారత క్రికెట్ తొలి సూపర్ స్టార్ సునీల్ మనోహర్ గవాస్కర్ 75వ పడిలో ప్రవేశించారు. నేటితో 54 సంవత్సరాల క్రికెట్ జీవితాన్ని పూర్తి చేశారు...

సునీల్ మనోహర్ గవాస్కర్...భారత, ప్రపంచ క్రికెట్ నాటి,నేటితరం అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. గత 54సంవత్సరాలుగా భారత క్రికెట్ ను తనదైన శైలిలో ఓలలాడిస్తున్న భారత క్రికెట్ తొలి లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఈరోజు తన 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంటున్నారు.

1971 నుంచి 2024 వరకూ....

భారత క్రికెట్ అడ్డా ముంబై నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన దిగ్గజాలలో 1970 దశకం సూపర్ హీరో సునీల్ మనోహర్ గవాస్కర్ మాత్రమే. ఓపెనర్ గా భారత క్రికెట్ కు అసమానసేవలు అందించిన గవాస్కర్ తనదైన ఆటతీరుతో పలు అరుదైన ఘనతలు సాధించారు.

విశ్వవిద్యాలయ క్రికెట్ నుంచి జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన గవాస్కర్ 1971 కరీబియన్ టూర్ తరువాత మరి వెనుదిరిగి చూసింది లేదు. వెస్టిండీస్ తో జరిగిన ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ద్వారా 1971 మార్చి 6న అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన గవాస్కర్ పలు అరుదైన రికార్డులు నెలకొల్పారు.

1971 మార్చి 6న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా తొలిటెస్టుమ్యాచ్ ఆడిన గవాస్కర్ తొలిఇన్నింగ్స్ లో 65, రెండో ఇన్నింగ్స్ లో 67 నాటౌట్ స్కోర్లు సాధించారు. అంతేకాదు..సిరీస్ మొత్తంలో 774 పరుగులతో 154.80 సగటు సాధించి రికార్డుల మోత మోగించారు.

టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గవాస్కర్ మాత్రమే. అంతేకాదు ఆయన 125 టెస్టులు ఆడి 34 సెంచ‌రీలు, 45 హాఫ్ సెంచ‌రీలు సైతం సాధించారు.

అసాధారణ ప్రతిభ, అరుదైన సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ టన్నుల కొద్ది పరుగులు సాధించారు. టెస్టు చరిత్రలో 10వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా, 29 శతకాలు బాదిన తొలి ఓపెనర్ గా, 125 టెస్టులు ఆడిన భారత తొలి ఆటగాడిగా రికార్డులు నెలకొల్పడం ద్వారా గవాస్కర్ క్రికెట్ పుస్తకంలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకోగలిగారు.

క్రికెటర్ టు కామెంటీటర్....

లిటిల్ మాస్టర్ గా, చిట్టిపొట్టిగట్టి ఓపెనర్ గా రెండుదశాబ్దాల పాటు భారత క్రికెట్ కు అసమాన సేవలు అందించిన గవాస్కర్ 1983లో వన్డే ప్రపంచకప్ సాధించిన భారతజట్టులో సభ్యుడు కూడా.

సునీల్‌ గావస్కర్‌ భారత్ తరుపున 108 వన్డేల్లో 3092 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 125 టెస్టు మ్యాచ్‌ల్లో 10,122 పరుగులు చేసిన గావస్కర్‌ ఖాతాలో 34 సెంచరీలు, 45 అర్థసెంచరీలు ఉన్నాయి.

వన్డే క్రికెట్లో ఒకే ఒక్క శతకం బాదిన గవాస్కర్ రిటైర్మెంట్ తరువాత క్రికెట్ వ్యాఖ్యాతగా క్రికెట్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ వ్యాఖ్యాతలలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకొన్నారు. 75వ పడిలో సైతం కామెంటీటర్ గా సేవలు అందించగలుగుతున్నారు.

క్రికెట్ తో 54 సంవత్సరాల అనుబంధం...

గవాస్కర్ గత 54 సంవత్సరాలుగా క్రికెట్ తో మమేకమైపోయారు. తన అనుబంధాన్ని కొనసాగిస్తూ..భారత, అంతర్జాతీయ క్రికెట్ కు అసమాన సేవలు అందిస్తూ వస్తున్నారు. 1971లో కరీబియన్ గడ్డపై వెస్టిండీస్ ప్రత్యర్థిగా 20 సంవత్సరాల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన గవాస్కర్ ఆ తర్వాత అంతైఇంతై అన్నట్లుగా ఎదిగిపోయారు.

1970 దశకంలో భారత క్రికెట్ తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన 75 సంవత్సరాల గవాస్కర్ గౌరవార్థం ముంబై క్రికెట్ సంఘం..వాంఖెడీ స్టేడియంలో ఓ ప్రత్యేక బాక్స్ ను ఏర్పాటు చేసింది.

ముంబై, భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచిన సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ తర్వాత చక్కటి క్రికెట్ వ్యాఖ్యాతగా స్థిరపడిపోయారు.

ఇంగ్లండ్‌లో క్రికెట్‌ గ్రౌండ్‌కు గవాస్కర్ పేరు...

ఇంగ్లండ్‌లోని లీస్టర్‌షైర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌కు 'గవాస్కర్‌ గ్రౌండ్‌'గా నామకరణం చేశారు. ఇంగ్లండ్‌ లేదా యూరప్‌ గడ్డపై ఉన్న క్రికెట్‌ గ్రౌండ్‌కు ఒక భారత క్రికెటర్‌ పేరు పెట్టడం ఇదే తొలిసారి. సునీల్‌ గవాస్కర్‌ తొలి ఆటగాడిగా ఈ అరుదైన ఘనత సాధించి చరిత్రలో నిలిచాడు. లీస్టర్‌షైర్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని గవాస్కర్‌ సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌కు గవాస్కర్ చేసిన సేవలకు గానూ లీస్టర్‌షైర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తమ గ్రౌండ్‌కు 'గవాస్కర్‌ గ్రౌండ్‌' అని పేరు పెట్టింది.

ఇప్పటికే లీస్టర్‌షైర్‌ గ్రౌండ్‌లోని ఒక పెవిలియన్‌ ఎండ్‌ గోడపై సునీల్‌ గావస్కర్‌ పెయింటింగ్‌ పెద్ద ఎత్తున గీశారు. సన్నీ యువ క్రికెటర్‌గా చేతిలోని బ్యాట్‌ భుజంపై పెట్టుకొని ఫోజు ఇచ్చిన ఫోటోను పెయింటింగ్‌గా వేశారు. కాగా గావస్కర్‌ పేరిట టాంజానియా, అమెరికాల్లోనూ క్రికెట్‌ గ్రౌండ్‌లు ఉన్నాయి. లీస్టర్‌షైర్‌ గ్రౌండ్‌కు తనపేరు పెట్టడంపై 75 ఏళ్ల దిగ్గజ క్రికెటర్‌ స్పందించాడు. ''లీస్టర్‌షైర్‌ సిటీలో క్రికెట్‌ వాతావరణం ఎక్కువగా ఉంటుందని. ప్రధానంగా అక్కడ భారత మూలాలున్న క్రికెటర్లు ఎక్కువగా ఉంటారు. అందుకే ఆ గ్రౌండ్‌కు తన పేరు పెట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గవాస్కర్ తెలిపాడు.

వందలాది మంది చిన్నారులకు గవాస్కర్ జీవనదానం!

సునీల్ గవాస్కర్ తన 72వ పుట్టిన రోజు నాటినుంచే సేవాకార్యక్రమాలలో పాల్గొంటూ తన పెద్దమనసును చాటుకొన్నారు. 200 మంది బాలల ప్రాణాలకు ఆలంబనగా నిలిచారు. హృద్రోగసమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తం అందిస్తూ వస్తున్నారు.

క్రికెటర్ గా కంటే క్రికెట్ వ్యాఖ్యాతగానే ఎక్కువగా ఆర్జిస్తున్న గవాస్కర్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు. ప్రధానంగా..పుట్టుకతో చిన్నారులకు వచ్చే గుండెసంబంధిత లోపాలు, వ్యాధుల చికిత్సకు తనవంతుగా సాయం అందిస్తున్నారు.

భారత్ లో జన్మిస్తున్న ప్రతి వెయ్యిమంది బాలలలో ఎనిమిదిమంది గుండె సంబంధిత లోపాలు, వ్యాధులతోనే జన్మిస్తున్నారు. భారత్ లో 2 లక్షల 40వేల మంది బాలలు పుట్టుకతో వచ్చిన గుండెసంబంధిత లోపాలతో బాధపడుతున్నట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ గణాంకాలే చెబుతున్నాయి.

2021లో తన 72వ జన్మదిన వేడుకలు జరుపుకొన్ననాటినుంచి ఇప్పటి వరకూ 200 మందికి పైగా బాలల చికిత్సకు గవాస్కర్ సాయం అందించారు. పుట్టుకతోనే గుండెసంబంధిత లోపాలతో జన్మించిన బాలలకు అత్యాధునిక చికిత్స అందచేస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

బెంగళూరులోని శ్రీ సాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా గవాస్కర్ సేవలు అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు ఇప్పటి వరకూ 28వేల గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించారు. చిన్నారులకు చేసిన శస్త్రచికిత్సల ఖర్చును సునీల్ గవాస్కర్ భరిస్తున్నారు.

గుండె సంబంధిత లోపాలు, వ్యాధులతో బాధపడుతున్న బాలలకు సేవచేయటంలో ఎంతో ఆనందం ఉందని, అందుకు తనవంతుగా సాయం చేయటం నిజంగా అదృష్టమని గవాస్కర్ మురిసిపోతున్నారు.

గవాస్కర్ లాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడైన క్రికెట్ మేధావి భారత్ లో జన్మించడం మనం చేసుకొన్న అదృష్టం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  10 July 2024 6:00 PM IST
Next Story