10 గంటల్లో నాలుగున్నర కిలోల బరువు తగ్గిన భారత యువవస్తాదు!
దశాబ్దాల చరిత్ర కలిగిన భారత ఒలింపిక్స్ చరిత్రలో యువ వస్తాదు అమన్ సెహ్రావాత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
దశాబ్దాల చరిత్ర కలిగిన భారత ఒలింపిక్స్ చరిత్రలో యువ వస్తాదు అమన్ సెహ్రావాత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. కాంస్య పతకం పోరుకు ముందు కొద్ది గంటల వ్యవధిలోనే 4.5 కిలోల బరువు తగ్గినట్లు తెలిపాడు..
పారిస్ ఒలింపిక్స్ 14వరోజు పోటీలలో భారత్ ఖాతాలో మరో కంచు పతకం వచ్చి చేరింది. పురుషుల 57 కిలోల కుస్తీలో భారత యువవస్తాదు అమన్ సెహ్రావత్ ఓ అసాధారణ రికార్డు నెలకొల్పాడు.
సింధును మించిన అమన్....
గత 12 దశాబ్దాలుగా ఒలింపిక్స్ లో పాల్గొటున్న భారత్ తరపున కుర్రవస్తాదు అమన్ సెహ్రావత్ అత్యంత చిన్నవయసులోనే పతకం సాధించిన అథ్లెట్ గా నిలిచాడు. పురుషుల 57 కిలోల విభాగంలో పోర్టోరికో వస్తాదును భారీతేడాతో ఓడించడం ద్వారా కేవలం 21 సంవత్సరాల వయసులోనే కాంస్య పతకం కైవసం చేసుకొన్నాడు.
ఇప్పటి వరకూ బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు పేరుతో ఉన్న అత్యంత పిన్నవయసులో ఒలింపిక్స్ పతకం నెగ్గి భారత అథ్లెట్ రికార్డును అమన్ అధిగమించాడు. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించడం ద్వారా సింధు నెలకొల్పిన రికార్డును అమన్ తెరమరుగు చేశాడు.
తొలి ఒలింపిక్స్ లోనే అమన్ కు పతకం...
హర్యానాకు చెందిన అమన్ తన అరంగేట్రం ఒలింపిక్స్ లోనే అంచనాలకు మించి రాణించడం ద్వారా కాంస్య విజేతగా నిలిచాడు. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ వస్తాదు చేతిలో ఓటమి పొందిన అమన్..ఆ మరుసటి రోజు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పోర్టో రికో వస్తాదు డారియన్ క్రూజ్ ను చిత్తు చేశాడు. ప్రస్తుత క్రీడల కుస్తీలో భారత్ కు తొలి పతకం అందించిన వస్తాదుగా నిలిచాడు.
57 కిలోల విభాగం కుస్తీ సెమీఫైనల్స్ ముగిసిన రోజున తాను ఐదుకిలోల బరువు అదనంగా పెరిగానని, కాంస్య పతకం పోరుకు ముందురోజు రాత్రి తనకు కంటిమీద కునుకే లేదని, నాలుగున్నర కిలలో అదనపు బరువు తగ్గించుకోడానికి తాను, తన శిక్షకుల బృందం పడరాని పాట్లు పడ్డామని, కాంస్య పోరుకు ముందు నిర్వహించిన తూకం కార్యక్రమంలో తాను 4.5 కిలోల బరువు తగ్గి 57 కిలోల బరువుతోనే బరిలో నిలిచానని తెలిపాడు. రెండుగంటల పాటు సాధన చేసి..మరో రెండు గంటల పాటు కసరత్తులు చేస్తూ జిమ్ లో గడిపానని, తెల్లవార్లూ నిదురపోకుండా గడపడం ద్వారా అనుకొన్న స్థాయిలో బరువు తగ్గగలిగానని తెలిపాడు.
వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణమేలక్ష్యం...
తనకు పదేళ్ల వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని ఓ అనాధలా బంధువుల పర్యవేక్షణలో పెరిగిన అమన్ 11 సంత్సరాలకే మాదకద్రవ్యాలకు అలవాటు పడి మత్తులో గడిపాడు. అయితే..కుస్తీ క్రీడ పట్ల ఆకర్షితుడు కావడంతో మత్తుపధార్థాల ఊబినించి బయటపడగలిగాడు. ప్రపంచ జూనియర్ కుస్తీలో సత్తా చాటుకోడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ అర్హత పోటీల బరిలో నిలిచి టికెట్ సాధించాడు.
అయితే..ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతోనే తాను స్వర్ణపతకం సాధించాలని భావించానని..అయితే..అనుభవం లేమితో తాను విఫలమయ్యానని, కాంస్య పతకం గెలుచుకోడం తనకు ఓ కలలా అనిపించిందని, 2028 ఒలింపిక్స్ నాటికి పక్కావ్యూహంతో సాధనచేయడం ద్వారా స్వర్ణపతకం సాధించి తీరుతానని అమన్ ప్రకటించాడు.
జరిగేదంతా మనమంచికేనని అనుకోడం మినహా మనం చేయగలిగింది ఏమీలేదంటూ వేదాంత ధోరణిలో చెప్పాడు.