Telugu Global
Sports

మహిళా తొలి టీ-20 లో భారత్ కు సఫారీ షాక్!

మహిళా టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలను భారత్ ఓటమితో ప్రారంభించింది. దక్షిణాఫ్రికా చేతిలో 12 పరుగుల పరాజయం చవిచూసింది.

మహిళా తొలి టీ-20 లో భారత్ కు సఫారీ షాక్!
X

మహిళా టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలను భారత్ ఓటమితో ప్రారంభించింది. దక్షిణాఫ్రికా చేతిలో 12 పరుగుల పరాజయం చవిచూసింది.

2024 మహిళా ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు భారత సన్నాహాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో తీన్మార్ టీ-20 సిరీస్ ను ఓటమితో మొదలు పెట్టింది.

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన సింగిల్ టెస్టు మ్యాచ్ లో సఫారీజట్టును చిత్తు చేసిన ఆనందంలో తేలిపోయిన భారత్ కు టీ-20 సిరీస్ ప్రారంభమ్యాచ్ లోనే గట్టి దెబ్బ తగిలింది.

గతి తప్పిన భారత బౌలర్లు....

స్లో బౌలర్లకు అనువుగా ఉండే చెన్నై చెపాక్ పిచ్ పైన జరిగిన తొలి టీ-20 పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగుల భారీస్కోరు సాధించింది.

భారత బౌలర్లు..ప్రధానంగా స్పిన్నర్లు గతి తప్పడంతో సఫారీ బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకొన్నారు. స్వీప్ షాట్లతో భారత స్పిన్నర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టారు.

టాజ్మిన్ బ్రిట్స్ 56 బంతుల్లో 81 పరుగులు, మార్జానా కాప్ 33 బంతుల్లో 57 పరుగులతో 2వ వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో సఫారీజట్టు 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 189 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో పూజా వస్త్రకర్ 23 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది.

177 పరుగులతోనే భారత్ బ్యాటింగ్ సరి...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 190 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ 4 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ ఏ దశలోనూ విజయలక్ష్యాన్ని సాధించేలా కనిపించలేదు.

ఓపెనర్ స్మృతి మందన 46 పరుగులకు అవుట్ కాగా..జెమీమా రోడ్రిగేజ్ 30 బంతుల్లో 53 పరుగులతో అజేయంగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది. దీంతో భారత్ 12 పరుగుల ఓటమి చవిచూడక తప్పలేదు.

సఫారీ బౌలర్లలో నాడైన్ డి క్లెర్క్ 30 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టింది.తమ బౌలర్లు నియంత్రణతో బౌల్ చేయలేకపోయారని, వికెట్ కు అనుగుణంగా బౌల్ చేయలేకపోయారని ఓటమి అనంతరం భారత స్పిన్నర్ రాధా యాదవ్ వాపోయింది. తమ బౌలర్ల వైఫల్యంతో సఫారీ బ్యాటర్లు 10 నుంచి 15 పరుగులు అదనంగా సాధించగలిగారని, తమ పరాజయానికి అదే ప్రధాన కారణమని వివరించింది.

ఫీల్డింగ్ లోనూ భారత్ ఫ్లాప్...

దీనికి తోడు ఫీల్డింగ్ లోనూ భారత్ దారుణంగా విఫలమయ్యింది. మూడుక్యాచ్ లు జారవిడిచి భారత్ చేజేతులా ఓటమి కొని తెచ్చుకొంది.

ఈ విజయం తమజట్టులో ఆత్మవిశ్వాసం పెంచినట్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' టాజ్మిన్ బ్రిట్స్ చెప్పింది. బంగ్లాదేశ్ వేదికగా త్వరలో జరిగే టీ-20 ప్రపంచకప్ కు తమ జట్టు సన్నాహాలకు ఈ గెలుపు శుభసంకేతమని వివరించింది.

ఆదివారం చెపాక్ వేదికగానే జరిగే రెండో టీ-20 ఆతిథ్య భారత్ కు డూ ఆర్ డైగా మారింది. రెండో టీ-20లో నెగ్గితేనే సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలుగుతుంది.

అదే దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం సాధించగలిగితే..2-0తో సిరీస్ సొంతం చేసుకోగలుగుతుంది.

First Published:  6 July 2024 12:07 PM GMT
Next Story