Telugu Global
Sports

స్మృతి,ప్రతీకా సెంచరీలు.. భారత్‌ రికార్డు స్కోరు

ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 రన్స్‌ చేసింది

స్మృతి,ప్రతీకా సెంచరీలు.. భారత్‌ రికార్డు స్కోరు
X

భారత్‌-ఐర్లాండ్‌ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే రికార్డులకు వేదికగా మారింది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నది. టీమిండియా మొదటిసారి వన్డేల్లో 400కిపైగా రన్స్‌ చేసింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (135: 80 బాల్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), మరో ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ (154: 129 బాల్స్‌లో 20 ఫోర్లు ఒక సిక్స్‌) సెంచరీలతో చెలరేగారు. వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్‌ (59) దూకుడుగా ఆడింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 రన్స్‌ చేసింది. ఇప్పటివరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఐర్లాండ్‌పైనే జనవరి 12న చేయడం గమనార్హం. ఇప్పుడు మరోసారి ఆ రికార్డును అధిగమించింది.

మొదటి బాల్‌ నుంచే దూకుడుగా ఆడిన స్మృతి మంధాన కెరీర్‌లో పదో సెంచరీని పూర్తి చేసింది. ఈ క్రమంలో భారత్‌ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచింది. 70 బాల్స్‌లోనే ఈ మార్క్‌ను అందుకున్నది. మంధానకు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. రెండో వన్డేలోనూ ఆమె సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతీకా రావల్‌ తొలి సెంచరీని 100 బాల్స్‌లో సాధించింది. తొలి వికెట్‌కు మంధాన-ప్రతీకా రావల్‌ జోడి 233 రన్స్‌ రాబట్టారు. మహిళల వన్డే చరిత్రలో ఆరో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా నిలిచింది.

First Published:  15 Jan 2025 3:23 PM IST
Next Story