Telugu Global
Sports

రెండోవన్డేలో భారత్ బొక్కబోర్లా!

వన్డే క్రికెట్లో శ్రీలంక ప్రత్యర్థిగా రోహిత్ సేనకు కు ప్రస్తుత సిరీస్ లో తొలిషాక్ తగిలింది. గత 27 సంవత్సరాలలో సిరీస్ విజయానికి భారతజట్టు దూరమయ్యింది.

రెండోవన్డేలో భారత్ బొక్కబోర్లా!
X

వన్డే క్రికెట్లో శ్రీలంక ప్రత్యర్థిగా రోహిత్ సేనకు కు ప్రస్తుత సిరీస్ లో తొలిషాక్ తగిలింది. గత 27 సంవత్సరాలలో సిరీస్ విజయానికి భారతజట్టు దూరమయ్యింది.

స్వదేశీ స్పిన్ పిచ్ లపై శ్రీలంక ఎంత ప్రమాదకరమైనజట్టో రోహిత్ శర్మ నాయకత్వంలోని ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ కు అనుభవమయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన కీలక రెండోవన్డేలో భారత్ 241 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక బొక్కబోర్లా పడింది.

పదును లేని బౌలింగ్- పసలేని బ్యాటింగ్..

50 ఓవర్ల వన్డే క్రికెట్లో ప్రపంచకప్ రన్నరప్, టాప్ ర్యాంక్ జట్టుగా ఉన్న భారత జట్టు శ్రీలంకగడ్డపై విలవిలలాడుతోంది. లంక స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనలేక ఉక్కిరిబిక్కిరవుతోంది.

ధూమ్ ధామ్ టీ-20 సిరీస్ లో శ్రీలంకపై క్లీన్ స్వీప్ విజయం సాధించిన భారత్..వన్డే సిరీస్ లో మాత్రం ఆపసోపాలు పడుతోంది. స్పిన్ బౌలర్ల అడ్డా ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలివన్డేను టైగా ముగించిన భారత్ కు ..కీలక రెండోవన్డేలో మాత్రం ఘోరపరాజయం తప్పలేదు. విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ లాంటి బ్యాటర్లున్నా భారత్ దారుణంగా విఫలమయ్యింది.

ఫలించిన శ్రీలంక వ్యూహం....

తొలి టీ-20 అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొన్న లంకజట్టు..రెండో వన్డే లో వ్యూహం మార్చింది. జట్టులోకి అదనపు స్పిన్నర్ తో పాటు..బ్యాటర్ ను చేర్చుకోడం ద్వారా సమతూకం సాధించగలిగింది.

ప్రస్తుత సిరీస్ లో వరుసగా రెండోసారి టాస్ నెగ్గిన లంకజట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొంది. 50 ఓవర్లలో 240 పరుగుల మ్యాచ్ విన్నింగ్ స్కోరు సాధించింది.తొలివన్డేలో సాధించిన 230 పరుగుల స్కోరు కంటే రెండోవన్డేలో 10 పరుగులు అదనంగా సాధించడం ద్వారా భారత్ కు సవాలు విసిరింది.

ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 40, వన్ డౌన్ కుశల్ మెండిస్ 30, కెప్టెన్ అసలంక 25, ఆల్ రౌండర్ కమిందు మెండిస్ 40 పరుగులు సాధించడంతో శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది.

భారత బౌలర్లు ఆఖరి 10 ఓవర్లలో శ్రీలంకను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. స్పిన్నరు వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ 2, అక్షర్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

రోహిత్ దూకుడు వృధా!

మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 241 పరుగులు చేయాల్సిన భారత్ కు ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యంతో తిరుగులేని ఆరంభాన్ని ఇచ్చారు.

కెప్టెన్ రోహిత్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 35 పరుగులతో 13.3 ఓవర్లలోనే 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.

శుభ్ మన్ 35, కొహ్లీ 14 పరుగుల స్కోర్లకు అవుటైన వెంటనే..మిడిల్ ఓవర్లలో భారత్ పతనం ప్రారంభమయ్యింది.

వికెట్ల ముందు దొరికిన 5గురు బ్యాటర్లు...

116 పరుగులకు 2 వికెట్లు నష్టపోయిన భారత్ ఆ తరువాత ఎదురీత మొదలు పెట్టింది. ప్రధానంగా లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సేను దీటుగా ఎదుర్కోడంలో భారత టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు.

వాండర్సే తన కోటా 10 ఓవర్లలో 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడంతో భారత్...42.2 ఓవర్లలో 208 పరుగుల స్కోరుకే కుప్పకూలింది. ఆల్ రౌండర్ శివం దూబే 0, శ్రేయస్ అయ్యర్ 7, రాహుల్ 0, కుల్దీప్ 7, సిరాజ్ 4, అర్షదీప్ 3 పరుగులకు అవుటయ్యారు. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగుల తో రెండో అతిపెద్ద స్కోరర్ గా నిలిచాడు.

భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఐదుగురు ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యుగా వికెట్ల ముందు దొరికిపోడం వన్డే చరిత్రలో ఇది మూడోసారి కాగా..కొలంబో ప్రేమదాస స్టేడియంలో రెండోసారి.

2014లో మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో తొలిసారిగా ఐదుగురు భారత బ్యాటర్లు ఎల్బీగా అవుటయ్యారు. ఆ తరువాత ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు వన్డేలలోను ఐదుగురు చొప్పున వికెట్ల ముందు దొరికిపోడం ఓ అరుదైన రికార్డు మిగిలిపోతుంది.

స్పిన్నర్లకు భారత బ్యాటర్ల దాసోహం...

స్పిన్ పిచ్ లపైన స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనలేని భారత బలహీనత మరోసారి బయటపడింది. ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డేలో9, రెండోవన్డేలో 9 వికెట్లను శ్రీలంక స్పిన్నర్లకే భారత్ అప్పచెప్పింది. 2023 సిరీస్ లో ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 10 కి 10 వికెట్లను భారత్ ప్రత్యర్థి శ్రీలంక స్పిన్నర్లకే కోల్పోయింది.

27 ఏళ్ల విజయపరంపరకు తెర...

శ్రీలంక ప్రత్యర్థిగా ద్వైపాక్షిక సిరీస్ లను గత 27 సంవత్సరాలుగా గెలుచుకొంటూ వచ్చిన భారత్..తొలిసారిగా సిరీస్ విజయం లేకుండా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ ను టైగా ముగించిన శ్రీలంక..రెండోవన్డే నెగ్గడం ద్వారా పట్టు బిగించింది. భారత్ కు సిరీస్ విజేతగా నిలిచే అవకాశం లేకుండా చేసింది. సిరీస్ ను సమం చేయాలంటే భారత్ ఈనెల 7న జరిగే ఆఖరి వన్డేలో ఆరునూరైనా నెగ్గితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండోవన్డేలో శ్రీలంక 32 పరుగుల విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించిన లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

First Published:  5 Aug 2024 3:40 PM IST
Next Story