Telugu Global
Sports

సింగపూర్ వేదికగా ప్రపంచ చెస్ టైటిల్ సమరం!

2024 ప్రపంచ పురుషుల చదరంగ టైటిల్ సమరానికి వేదికగా సింగపూర్ నిలిచింది. ఢిల్లీ, చెన్నై నగరాలతో పోటీ పడి మరీ ఆతిథ్యనగరంగా ఎంపికయ్యింది.

సింగపూర్ వేదికగా ప్రపంచ చెస్ టైటిల్ సమరం!
X

2024 ప్రపంచ పురుషుల చదరంగ టైటిల్ సమరానికి వేదికగా సింగపూర్ నిలిచింది. ఢిల్లీ, చెన్నై నగరాలతో పోటీ పడి మరీ ఆతిథ్యనగరంగా ఎంపికయ్యింది..

భారత యువగ్రాండ్ మాస్టర్ గుకేశ్ తలపడే ప్రపంచ చదరంగ టైటిల్ పోరుకు ఆతిథ్యమివ్వాలన్న భారత ఆశల్ని సింగపూర్ అడియాసలు చేసింది. చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ కమ్ డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్- భారత సంచలనం గుకేశ్ ల నడుమ జరిగే టైటిల్ సమరానికి ఆతిథ్యమిస్తామంటూ భారత్ లోని న్యూఢిల్లీ, చెన్నై నగరాలతో సింగపూర్ సిటీ పోటీ పడింది.

ఈ మూడు వేదికలను అంతర్జాతీయ చదరంగ సమాఖ్య నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి..వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని సింగపూర్ సిటీని వేదికగా ఎంపిక చేశాయి.

న్యూఢిల్లీ, చెన్నై నగరాలతో పోల్చిచూస్తే..సింగపూర్ నగరానికి ఉన్న ఖ్యాతి, అక్కడి పరిస్థితులు, వాతావరణం, ఏర్పాట్లు అత్యుత్తమస్థాయిలో ఉన్నాయని, ప్రశాంతంగా సాగే ప్రపంచ చదరంగ టైటిల్ సమరానికి సింగపూర్ ను మించిన వేదిక తమకు మరొకటి కనిపించలేదని అంతర్జాతీయ చదరంగ సమాఖ్య అధ్యక్షుడు అర్కాడీ డ్వోర్ కోవిచ్ ప్రకటించారు.

20 కోట్ల ప్రైజ్ మనీతో ప్రపంచ చెస్ ఫైనల్స్...

ప్రపంచ పురుషుల చదరంగలో విజేత ఎవరో తేల్చడానికి జరిగే టైటిల్ పోరును 20 కోట్ల 70 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో సింగపూర్ సిటీ ఆతిథ్యమిస్తోంది. చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ తో భారత యువసంచలనం గ్రాండ్ మాస్టర్ గుకేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

కెనడాలోని టొరాంటో వేదికగా ముగిసిన ప్రపంచ క్యాండిడేట్స్ చదరంగ సమరంలో విజేతగా నిలవడం ద్వారా 18 సంవత్సరాల గుకేశ్ తొలిసారిగా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.

ప్రపంచ మేటి అత్యుత్తమ గ్రాండ్ మాస్టర్లతో తలపడిన గుకేశ్ అనూహ్యంగా క్యాండిడేట్స్ టైటిల్ దక్కించుకోడం ద్వారా చాలెంజర్ గా నిలిచాడు.

నవంబర్ 20 నుంచి టైటిల్ పోరు..

ప్రపంచ చదరంగ ఫైనల్స్ ను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకూ సింగపూర్ సిటీ వేదికగా నిర్వహించడానికి అంతర్జాతీయ చదరంగ సమాఖ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రపంచ మేటి పర్యాటక నగరంగా, కీలక కేంద్రంగా ఉన్న సింగపూర్ ఓ అంతర్జాతీయ చదరంగ టోర్నీకి ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి.

ప్రపంచ చెస్ సమాఖ్య నిబంధనల ప్రకారం..డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న ఆటగాడు టైటిల్ నిలుపుకోడానికి అర్హత పోటీలలో పాల్గొనాల్సిన పనిలేదు. నేరుగా టైటిల్ పోరులో చాలెంజర్ తో తలపడతాడు.

ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ కు సవాలు విసిరే చాలెంజర్ కమ్ ప్రపంచ క్యాండిడేట్స్ సమరంలో భారత్ కు చెందిన ముగ్గురు ( ప్రజ్ఞానంద్, సంతోష్ గుజరాతీ, గుకేశ్ ) గ్రాండ్ మాస్టర్లతో పాటు అమెరికా, రష్యా, అజర్ బెజాన్ గ్రాండ్మాస్టర్లతో సహా మొత్తం ఎనిమిది 14 గేమ్ ల్లో ఢీ కొంటే చివరకు గుకేశ్ అగ్రస్థానంలో నిలువగలిగాడు.

నాడు ఆనంద్...నేడు గుకేశ్...

ప్రపంచ క్యాండిడేట్స్ చదరంగ పోరులో విజేతగా నిలిచిన భారత రెండో గ్రాండ్మాస్టర్ గా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ టైటిల్ రౌండ్ కు అర్హత సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

17 సంవత్సరాల వయసులో..తనకంటే రెట్టింపు వయసు, అపారఅనుభవం ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, అజర్ బైజాన్ గ్రాండ్మాస్టర్లను ఎదుర్కొని ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ సాధించడం ద్వారా దొమ్మరాజు గుకేశ్ తనకుతానే సాటిగా నిలిచాడు.

ప్రపంచ రికార్డుతో టైటిల్....

కెనడాలోని టొరాంటో వేదికగా రెండువారాలు పాటు సాగిన 14 రౌండ్ల క్యాండిటేట్స్ పోరులో అమెరికన్ గ్రాండ్ మాస్టర్ల జోడీ ఫేబియన్ కరూనా, హికారు నకామురా, రష్యన్ సూపర్ గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమినిచ్, ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అలీరెజా ఫిరోజా, అజర్ బైజాన్ గ్రాండ్ మాస్టర్ అబ్సోవ్ లతో పాటు భారతజోడీ విదిత్ సంతోశ్ గుజరాతీ, ప్రజ్ఞానంద్ లతో తలపడిన గుకేశ్ వయసుకు మించిన పరిణతి ప్రదర్శించాడు. ఎత్తుల యుద్దంలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అసలు సిసలు విజేత తానేనని చాటుకొన్నాడు.

చైనా దిగ్గజ ఆటగాడు డింగ్ లిరెన్ కే సవాలు విసురుతున్న గుకేశ్ సింగపూర్ వేదికగా జరిగే ప్రపంచ టైటిల్ పోరులో నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత చదరంగ అభిమానులు కోరుకొంటున్నారు.

First Published:  2 July 2024 11:50 AM IST
Next Story