Telugu Global
Sports

విరాట్ రికార్డుకు శుభ్ మన్ గిల్ ఎసరు!

భారత యువబ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 17 సీజన్ల ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రన్ మెషీన్ విరాట్ కొహ్లీ రికార్డును తెరమరుగు చేశాడు.

విరాట్ రికార్డుకు శుభ్ మన్ గిల్ ఎసరు!
X

భారత యువబ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 17 సీజన్ల ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రన్ మెషీన్ విరాట్ కొహ్లీ రికార్డును తెరమరుగు చేశాడు.

ఐపీఎల్ లో గతేడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ నయా కెప్టెన్ శుభ్ మన్ గిల్ నిలకడగా రాణిస్తూ తనజట్టు విజయాలలో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు.

ప్రసుత సీజన్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కు పగ్గాలు వేయడంలో గుజరాత్ టైటాన్స్ సఫలమయ్యింది.

జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన 5వ రౌండ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లతో సంచలన విజయం సాధించింది.

ఈ హైస్కోరింగ్ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగుల స్కోరు సాధించింది.

సమాధానంగా 197 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆఖరు బంతి విజయం నమోదు చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులతో విజేతగా నిలిచింది.

కెప్టెన్ కమ్ స్టార్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ గుజరాత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే..ఆల్ రౌండ్ షోతో టైటాన్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించిన రషీద్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అత్యంత చిన్నవయసులో 3వేల పరుగులు...

ఓపెనర్ గా తనజట్టు చేజింగ్ కోసం క్రీజులోకి దిగిన శుభ్ మన్ గిల్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవడంతో పాటు..ఐపీఎల్ చరి్త్రలోనే అత్యంత చిన్నవయసులో 3వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి బ్యాటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటి వరకూ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న ఈ రికార్డును శుభ్ మన్ సవరించాడు. శుభ్ మన్ గిల్ 24 సంవత్సరాల 215 రోజుల వయసులో 3వేల ఐపీఎల్ పరుగులు సాధించడం ద్వారా రికార్డుల్లో చేరాడు.

శుభ్ మన్ గిల్ 94 ఇన్నింగ్స్ లోనే మూడువేల పరుగులు సాధించడం ద్వారా గత 17 సీజన్ల చరిత్రలో నాలుగో అత్యంత వేగంగా రికార్డు నెలకొల్పిన బ్యాటర్ గా నిలిచాడు.

విరాట్ కొహ్లీ 26 ఏళ్ల 186 రోజుల వయసులో 3వేల పరుగుల రికార్డు నెలకొల్పితే...సంజు శాంసన్ 26 సంవత్సరాల 320 రోజుల వయసులోనూ, సురేశ్ రైనా 27 ఏళ్ల 161 రోజుల వయసులోనూ, రోహిత్ శర్మ 27 సంవత్సరాల 343 రోజుల వయసులోనూ 3వేల పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్లుగా ఉన్నారు.

ముగ్గురు దిగ్గజాల సరసన గిల్..

ఐపీఎల్ చరిత్రలో అతితక్కువ ఇన్నింగ్స్ లో 3వేల పరుగులు సాధించిన దిగ్గజ బ్యాటర్లు క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, జోస్ బట్లర్ ల సరసన శుభ్ మన్ గిల్ చేరాడు.

అంతేకాదు..టీ-20 ఫార్మాట్లో 4వేల పరుగుల రికార్డును సైతం శుభ్ మన్ పూర్తి చేయగలిగాడు.

2022 సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ కు ఆడుతూ వచ్చిన శుభ్ మన్ గిల్ 1500కు పైగా పరుగులు సాధించడం విశేషం.

టైటాన్స్ కు మూడోసారి ఆఖరి బంతి విజయం..

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఆఖరు బంతి విజయం సాధించడం ఇది మూడోసారి. 2022 సీజన్లో వాంఖడే వేదికగా సన్ రైజర్స్ పైన 196, బ్రబోర్న్ వేదికగా పంజాబ్ కింగ్స్ పైన 190 పరుగుల లక్ష్యాలను ఆఖరి బంతి ద్వారా సాధించిన గుజరాత్ టైటాన్స్..జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై 197 పరుగుల లక్ష్యాన్ని సాధించడం విశేషం.

ఐపీఎల్ లో ఆఖరి బంతిలో పరాజయం పొందటం రాజస్థాన్ రాయల్స్ కు ఇది నాలుగోసారి. 2023లో సన్ రైజర్స్ చేతిలో 215, 2012లో డెక్కన్ చార్జర్స్ చేతిలో 197, 2019లో డెక్కన్ చార్జర్స్ ప్రత్యర్థిగా 192 పరుగుల లక్ష్యాలను కాపాడుకోడంలో రాజస్థాన్ రాయల్స్ విఫలమయ్యింది.

ప్రస్తుత మ్యాచ్ లో సైతం 197 పరుగుల లక్ష్యాన్ని రక్షించుకోడంలో రాజస్థాన్ రాయల్స్ సఫలం కాలేకపోయింది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ 22సార్లు చేజింగ్ కు దిగి 16 విజయాలు, 6 పరాజయాల రికార్డుతో ఉంది.

190కి పైగా పరుగుల లక్ష్యాలను గుజరాత్ టైటాన్స్ విజయవంతంగా అధిగమించడం ఇది నాలుగోసారి. 2022లో పంజాబ్ కింగ్స్ పైన 190, సన్ రైజర్స్ పైన 196, 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైన 198, రాజస్థాన్ రాయల్స్ పైన 197 పరుగుల లక్ష్యాలను గుజరాత్ టైటాన్స్ చేజ్ చేయగలిగింది.

First Published:  11 April 2024 2:17 PM IST
Next Story