Telugu Global
Sports

బీసీసీఐ, ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన షమీ.. ఎందుకంటే?

ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటా.. జట్టులోకి వస్తానని మహ్మద్‌ షమీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

బీసీసీఐ, ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన షమీ.. ఎందుకంటే?
X

ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో మహ్మద్‌ షమీకి చోటు దక్కలేదు. గాయం తిరగబెట్టడంతో అతడిని పక్కనపెట్టింది. అయితే నవంబర్‌ రెండో వారంలోగా ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే అవకాశం వస్తుందని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో షమీ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. 2023 వన్డే ప్రపంచ కప్‌ తర్వాత తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల దులీప్‌ ట్రోఫీ నాటికే సిద్ధమై ప్రాక్టీస్‌ చేసినప్పటికీ .. మోకాలిలో మళ్లీ వాపు కనిపించడంతో ఇబ్బందిపడ్డాడు. దీంతో న్యూజిలాండ్‌ టెస్ట్‌ సిరీస్ కు తీసుకోలేదు. ఇప్పుడు ఆసీస్‌ పర్యటనకూ ఎంపిక కాలేదు. ఈ క్రమంలో తన ఫిట్‌నెస్‌పై బీసీసీఐ, ఫ్యాన్స్‌కు సారీ చెప్పాడు.

రోజు రోజుకూ బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాను. మ్యాచ్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు ఇంకా శ్రమిస్తాను. దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాను. క్రికెట్‌ అభిమానులకు, బీసీసీఐకి క్షమాపణలు చెబుతున్నాను. టెస్ట్‌ క్రికెట్‌ ఆడటానికి త్వరలోనే మీముందుకు వస్తాను' అని షమీ పోస్టు పెట్టాడు. నవంబర్‌ 6 నుంచి రంజీ ట్రోఫీ నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. బెంగాల్‌ తరఫున బరిలోకి దిగుతాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడీ పోస్టుతో అవన్నీ వాస్తవమేనని తేలింది. దీంతో త్వరలోనే జట్టులోకి రావాలంటూ నెటీజన్లు పోస్టులు పెడుతున్నారు.

First Published:  27 Oct 2024 2:54 PM IST
Next Story