ఆ సంస్థతోనే నా కొత్త ప్రయాణం
సీసా స్పేసెస్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపిన సానియా మీర్జా
చిన్నారుల ఫిట్‌నెస్, చదువు కోసం వినూత్న రీతితో ఏడాది కిందట జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన సీసా స్పేసెస్‌తో కలిసి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అడుగు వేయనున్నారు. ఈ సంస్థతో కలిసి ఈ ఏడాది కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 10 లోని సీసా స్పేసెస్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ భాగస్వాములైన నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ,, స్వాతి గునుపాటితో కలిసి ఆమె మాట్లాడారు. ఇప్పుడున్న చిన్నారులంతా మొబైల్స్, ట్యాబ్స్, టీవీలకు అతుక్కుపోతున్నారని, అన్నం తినాలన్నా మొబైల్ ఉంటేనే తింటున్నారని, తల్లిగా ఈ సమస్య తనకు తెలుసన్నారు. చిన్నారులకు చదువు ఒక్కటే కాదని, మంచి వాతావరణం, ఫిట్‌నెస్, మంచి ఆహారం ఎంతో అవసరమన్నారు. ఈ అంశాల్లో సీసాతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. శ్రీజ కొణిదెల మాట్లాడుతూ.. పిల్లలను తీసుకొని రావడంతో పాటు తల్లిదండ్రులు వారితో కాసేపు సమయాన్ని గడిపేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దామన్నారు.