భారత జోడీకి థాయ్ ఓపెన్ టైటిల్!
పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహకంగా జరుగుతున్న థాయ్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి టైటిల్ గెలుపుతో అదరగొట్టారు.
పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహకంగా జరుగుతున్న థాయ్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి టైటిల్ గెలుపుతో అదరగొట్టారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో మాజీ నంబర్ వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి జోడీ తిరిగి గాడిలో పడ్డారు. మరికొద్ది వారాలలో పారిస్ వేదికగా జరుగనున్న 2024 ఒలింపిక్స్ కు సన్నాహాలను భారత జోడీ ధాటిగా ప్రారంభించారు.
గాయంతో గత రోజులుగా ఆటకు దూరమైన ఈ టాప్ సీడ్ జోడీ..బ్యాంకాక్ వేదికగా జరిగిన 2024-థాయ్ ఓపెన్ టోర్నీ డబుల్స్ లో తిరిగి విజేతలుగా నిలిచారు. ఈ సూపర్ -500 రేటింగ్ టోర్నీ తొలి రౌండ్ నుంచి టైటిల్ పోరు వరకూ తిరుగులేని విజయాలతో ట్రోఫీ కైవసం చేసుకొన్నారు.
ఫైనల్లో వరుస గేమ్ ల విజయం...
టైటిల్ పోరులో చైనా టాప్ ర్యాంక్ జోడీ చెన్ బో యాంగ్- లియు ఈని వరుస గేమ్ ల్లో చిత్తు చేశారు. ప్రత్యర్థిజోడీకి ఒక్కో గేమ్ లో 15 పాయింట్లు మాత్రమే ఇచ్చారు.
సాత్విక్- చిరాగ్ జోడీ 21-15, 21-15తో విజేతలుగా నిలిచారు.
భారత ఈ టాప్ ర్యాంక్ జోడీ కెరియర్ లో ఇది 9వ టూర్ టైటిల్ కావడం విశేషం.
ఆసియాక్రీడల స్వర్ణం తరువాత..మలేసియన్ ఓపెన్ సూపర్ -1000 టోర్నీలో రన్నరప్ గా నిలిచినా..థాయ్ ఓపెన్లో బంగారు పతకం గెలుచుకోగలిగారు.
2019లో బ్యాంకాక్ వేదికగా జరిగిన సూపర్ సిరీస్ టైటిల్ తొలిసారిగా నెగ్గిన భారత జోడీ ఐదేళ్ల విరామం తరువాత తిరిగి అదే వేదికగా మరో ట్రోఫీ సాధించగలిగారు.
ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ రెండోరౌండ్లోనే పరాజయం పాలైన సాత్విక్- చిరాగ్ జోడీ..గాయంతో ఆసియా చాంపియన్షిప్ కు దూరమయ్యారు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకం అందించాలన్న పట్టుదలతో సాత్విక్- చిరాగ్ జోడీ సన్నాహాలు మొదలు పెట్టారు. థాయ్ ఓపెన్ టైటిల్ విజయంతో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోగలిగారు.