సర్పరాజ్ ఖాన్ కల నిజమాయోగా!
భారత టెస్టుజట్టులో చోటు సంపాదించాలన్న ముంబై యువబ్యాటర్ సర్పరాజ్ ఖాన్ మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది.
భారత టెస్టుజట్టులో చోటు సంపాదించాలన్న ముంబై యువబ్యాటర్ సర్పరాజ్ ఖాన్ మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాటర్ ను సెలెక్షన్ కమిటీ ఎట్టకేలకు కరుణించింది.
క్రికెట్టే విచిత్రమైన ఆట అంటే..భారత క్రికెట్ మూడుమక్కల ఆటను మరిపించే ఆట. 16 మంది సభ్యులకు మాత్రమే చోటుండే భారతజట్టులో చోటు కోసం దేశవ్యాప్తంగా వందకు పైగా అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లు పోటీపడుతూ ఉంటారు. ప్రతిభ ఉన్నంత మాత్రాన భారతజట్టులో తేలికగా చోటు దక్కుతుందని భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు.
శుభ్ మన్ గిల్ లాంటి ఒక్కరిద్దరు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఎదురుచూపులు లేకుండానే జట్టులో చోటు దక్కినా....అంతే ప్రతిభ కలిగిన రజత్ పాటిదార్, సర్పరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్లు అలుపెరుగని రీతిలో పోరాడుతూ తమవంతు కోసం ఎక్కడలేని ఓర్పుతో ఎదురుచూడక తప్పదు.
దేశవాళీ క్రికెట్లో గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తూ టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీల వెంట సెంచరీలు బాదిన ముంబై బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ ను భారత సెలెక్టర్లు పక్కన పెడుతు వస్తున్నారు. అదేమంటే..భారీకాయమంటూ సాకు చెబుతూ వస్తున్నారు.
మూడేళ్లుగా ఎదురుచూపులు.....
దేశవాళీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ల్లో గత మూడేళ్ల కాలంలో అత్యంత నిలకడగా రాణించిన అతికొద్దిమంది బ్యాటర్లలో సర్పరాజ్ ఖాన్ కు ప్రత్యేక స్థానమే ఉంది. ఇండియా-ఏ జట్టు తరపున సైతం సర్పరాజ్ ఖాన్ సెంచరీల మోత మోగిస్తూ మ్యాచ్ విన్నర్ గా నిలిచినా...భారత టెస్టు జట్టులో చోటు కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తూ వచ్చాడు.
గతేడాదే భారతజట్టులో సర్పరాజ్ ఖాన్ కు చోటు ఖాయమని అందరూ భావించారు. అయితే ..ఆస్ట్ర్రేలియా, వెస్టిండీస్ సిరీస్ లతో పాటు దక్షిణాఫ్రికా టూర్ కు ఎంపిక చేసిన భారతజట్లలో సైతం చోటు లేకుండా పోయింది.
ఇంగ్లండ్ తో ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటిరెండుటెస్టులకు ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో సైతం సర్పరాజ్ కు చోటు దక్కలేదు. అయితే..హైదరాబాద్ టెస్టులో భారత్ 28 పరుగుల పరాజయం, రాహుల్, జడేజా లాంటి కీలక బ్యాటర్లు గాయాలతో అందుబాటులో లేకపోడంతో...గత్యంతరం లేని స్థితిలో సెలెక్టర్లు సర్పరాజ్ ఖాన్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది.
విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ఇంగ్లండ్ తో జరిగే కీలక రెండోటెస్టులో పాల్గొనే భారతజట్టులో సర్పరాజ్ ఖాన్ కు చోటు దక్కింది. వ్యక్తిగతంగా సర్పరాజ్ ఖాన్ మాత్రమే కాదు...దేశంలోని లక్షలాదిమంది అభిమానులు సైతం సర్పరాజ్ ను సెలెక్టర్లు కరుణించినందుకు ఊపిరిపీల్చుకోగలిగారు.
ఇంగ్లండ్ లయన్స్ పై సెంచరీతో...
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు ఓ వైపు ఇంగ్లండ్ తో తొలిటెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో సర్పరాజ్ ఖాన్ ఇండియా-ఏ జట్టులో సభ్యుడిగా ఇంగ్లండ్ లయన్స్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగురోజుల అనధికారిక టెస్టులో పాల్గొని 18 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 160 బంతుల్లో 161 పరుగుల స్కోరు సాధించడం ద్వారా విశాఖ టెస్టులో పాల్గొనే భారతజట్టులోకి దూసుకురాగలిగాడు.
22 ఏళ్ల వయసు నుంచే దేశవాళీ రంజీక్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ గా గుర్తింపు సంపాదించాడు. 2019, 2020, 2021, 2022 సీజన్లలో సగటున 900 పరుగులు చొ్ప్పున సాధిస్తూ వచ్చాడు. అంతేకాదు...2023 సీజన్లో మూడుశతకాలు బాదాడు.
26 సంవత్సరాల సర్పరాజ్ ఖాన్ కు దేశవాళీ మ్యాచ్ లతో సహా ఇప్పటి వరకూ ఆడిన 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 3వేల 912 పరుగులు సాధించిన రికార్డు ఉంది.
14 సెంచరీలు, 70.48 స్ట్ర్రయిక్ రేటుతో పాటు 69.85 సగటు సాధించిన ఘనత సైతం ఉంది.
2020 రంజీ సీజన్లో ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఉత్తరప్రదేశ్ తో జరిగిన పోరులో ముంబై తరపున సాధించిన 301 పరుగుల నాటౌట్ స్కోరే సర్పరాజ్ ఖాన్ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది.
ఇంగ్లండ్ తో విశాఖ వేదికగా జరిగే రెండోటెస్టు తుదిజట్టులో సర్పరాజ్ ఖాన్ కు చోటు దక్కితే పూర్తిస్థాయిలో రాణించడం ద్వారా ఆలస్యంగానైనా అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. విశాఖ టెస్టు భారతజట్టుకు మాత్రమే కాదు..సర్పరాజ్ ఖాన్ కు సైతం డూ ఆర్ డై అనడంలో ఏమాత్రం సందేహం లేదు.