Telugu Global
Sports

ఐపీఎల్ లో సంజు శాంసన్ అరుదైన రికార్డు!

ఐపీఎల్-2024 సీజన్ ను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఓ అరుదైన రికార్డుతో ప్రారంభించాడు.

ఐపీఎల్ లో సంజు శాంసన్ అరుదైన రికార్డు!
X

ఐపీఎల్-2024 సీజన్ ను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఓ అరుదైన రికార్డుతో ప్రారంభించాడు. ప్రారంభమ్యాచ్ లోనే మెరుపు హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు....

భారతక్రికెట్ వేసవి వినోదం, బీసీసీఐ వేలకోట్ల వ్యాపారం, విఖ్యాత క్రికెటర్ల 'బంగారుబాతు' ఐపీఎల్ సరికొత్త సీజన్ ను మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అద్దిరిపోయే రికార్డుతో మొదలు పెట్టాడు.

హోంగ్రౌండ్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెలరేగిపోయాడు.

52 బంతుల్లో 82 నాటౌట్....

ఓపెనర్ జోస్ బట్లర్ 11 పరుగుల స్కోరుకే వెనుదిరిగడంతో క్రీజులోకి వచ్చిన సంజు నిలదొక్కుకొని ఆడి 52 బంతుల్లో 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకొన్నాడు. ఐపీఎల్ గత ఐదు సీజన్లుగా తన తొలిమ్యాచ్ ను హాఫ్ సెంచరీ స్కోర్లతో ప్రారంభించడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

2020 సీజన్లో తన ప్రారంభమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా 32 బంతుల్లో 74 పరుగులు, 2021 సీజన్ ప్రారంభమ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిగా 119 పరుగులు, 2022 సీజన్ ప్రారంభమ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై 55 పరుగులు, 2023 సీజన్ ప్రారంభమ్యాచ్ లో సైతం హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రత్యర్థిగానే హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా సంజు అరుదైన రికార్డు నెలకొల్పగలిగాడు. వరుసగా ఐదుసీజన్ల ప్రారంభమ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్ ఘనతను సంజు సొంతం చేసుకోగలిగాడు.

టీ-20 ప్రపంచకప్ రేస్ లో.....

కరీబియన్ ద్వీపాలు, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో మరి కొద్దిమాసాలలో జరుగనున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు వికెట్ కీపర్ స్థానం కోసం 29 సంవత్సరాల సంజు మరో నలుగురితో కలసి పోటీపడుతున్నాడు.

రిషభ్ పంత్, ధృవ్ జురెల్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, జితేశ్ శర్మలతో కలసి సంజు పోటీపడుతున్నాడు. ప్రారంభమ్యాచ్ లోనే 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా సెలెక్టర్లకు సంకేతాలు పంపాడు.

మిడిల్ ఓవర్లలో భారీషాట్లతో విరుచుకుపడిన సంజు శాంసన్ ఆటతీరును క్రికెట్ విశ్లేషకులు, భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా కొనియాడారు.

First Published:  25 March 2024 4:07 PM IST
Next Story