Telugu Global
Sports

సంజు శాంసన్‌ ఐదు సిక్స్‌ల వెనుక

దీనికంతటికి కారణం డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణంతో పాటు నాయకత్వం ఇచ్చిన స్వేచ్ఛ అన్న శాంసన్‌

సంజు శాంసన్‌ ఐదు సిక్స్‌ల వెనుక
X

ఉప్పల్‌ వేదికగా టీమిండియా బ్యాటర్‌ సంజు శాంసన్‌ బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. గత కొన్ని మ్యాచుల్లో పెద్దగా ఆడని అతను బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో ఏకంగా సెంచరీ సాధించాడు. సంజు నుంచి భారీ ఇన్సింగ్స్‌ రావడంపై ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన సంజు తన ఆటతీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోని ప్రతి క్రికెటర్‌ తన ఆనందం కోసం ఎనర్జీ ఇచ్చాడన్న సంజూ తాను కొట్టిన ఐదు సిక్స్‌ల వెనుక స్టోరీని వెల్లడించాడు.

సెంచరీ తర్వాత ఇచ్చిన విక్టరీ పంచ్‌కు పెద్ద స్టోరీనే ఉన్నది. ఇప్పుడే చెప్పలేను. అయితే ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లో కొట్టడం బాగుంది అన్నాడు. గత ఏడాది నుంచి భారీ షాట్లు కొట్టడానికి తీవ్రంగా శ్రమించాను. నా మెంటార్‌కోసం ఈ ఫీట్‌ చేశాను. గతంలో ఓ సందర్భంలో నువ్వు ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లో కొట్టాలి. దాని కోసం నేను వేచి చూస్తున్నానని అన్నాడు. ఆ ఫీట్‌ కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు సాధ్యమైందన్నాడు. శాంసన్‌కు మాజీ క్రికెటర్‌ బిజు జార్జ్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఉప్పల్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్‌ నాతో పాటు జట్టులోని ప్రతి ఒక్కరిలో జోష్‌ నింపింది. ఇలాంటి వాతావరణం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండటం బాగుంది. గతంలో చాలా విఫలమయ్యాను. ఆ సమయంలో చాలా నిరుత్సాహంగా ఉండేది. ప్రతీసారి ఆ ఆలోచనలు మనసులోకి వస్తాయి. చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో వాటిని ఎలా డీల్‌ చేయాలో తెలుసు. నా మనసును నియంత్రణలో ఉంచుకోగలను. దానికోసం నిత్యం శ్రమించేవాడిని. ట్రైనింగ్‌ టైమ్‌లోనూ అదనంగా ప్రాక్టీస్‌ చేసేవాడిని అని తెలిపాడు.

దేశం కోసం ఆడేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో సత్తా ఏమిటో చూపించాలనే లక్ష్యంతో ఆడుతాం. ఒక్కోబాల్‌ను నిశితంగా గమనించి ఆడాను. నా శైలిలో ప్రతి షాట్‌ కొట్టాను. దీనికంతటికి కారణం డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణంతో పాటు నాయకత్వం ఇచ్చిన స్వేచ్ఛ అన్నాడు. 'నీ టాలెంట్‌ ఏమిటో అందరికీ తెలుసు. ప్రతి విషయంలో నీకు మద్దతుగా ఉంటాం' ఇది మేనేజ్‌మెంట్‌ నుంచి నాకు వచ్చిన మద్దతు. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపెట్టారు. గత సిరీస్‌లో రెండు మ్యాచుల్లో డకౌట్‌ అయ్యాను. తర్వాత కేరళకు వెళ్లిపోయాను. ఆ టైంలో ఏం కాలేదంటూ మద్దతుగా నిలిచారు. నా కోచ్‌, కెప్టెన్‌ ముఖాల్లో నవ్వులు తెప్పించడానికి ఏం చేయాలో ఆలోచించాను. ఇప్పుడు ఈ సెంచరీతో వాళ్లు సంతోషపడ్డారని సంజు శాంసన్‌ అన్నాడు.

First Published:  13 Oct 2024 12:26 PM IST
Next Story