Telugu Global
Sports

కుస్తీ సమాఖ్యలో కొత్త వివాదం, సాక్షీ మాలిక్ అస్త్రసన్యాసం!

భారత కుస్తీ సమాఖ్య లో మరో వివాదం రాజుకొంది. అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికలో వివాదాస్పద బ్రజ్ భూషణ్ అనుచరుడు ఎంపిక కావడంతో అంతర్జాతీయ రెజ్లర్లు తీవ్రనిరసన తెలుపుతూ కన్నీరుమున్నీరయ్యారు.

కుస్తీ సమాఖ్యలో కొత్త వివాదం, సాక్షీ మాలిక్ అస్త్రసన్యాసం!
X

భారత కుస్తీ సమాఖ్య లో మరో వివాదం రాజుకొంది. అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికలో వివాదాస్పద బ్రజ్ భూషణ్ అనుచరుడు ఎంపిక కావడంతో అంతర్జాతీయ రెజ్లర్లు తీవ్రనిరసన తెలుపుతూ కన్నీరుమున్నీరయ్యారు...

ఎందరో మేటి వస్తాదులను అందించిన భారత కుస్తీ సమాఖ్య మరోసారి రోడ్డున పడింది. బీజెపీ ఎంపీ, కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కొద్దిమాసాల క్రితం రాజేసిన మంట ప్రస్తుతం కాష్టంలా రగులుతూనే ఉంది.

బ్రజ్ భూషణ్ తొత్తు సంజయ్ సింగ్....

ఏడుగురు భారత మహిళా వస్తాదులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై కొద్ది మాసాల క్రితమే కుస్తీ సమాఖ్య అధ్యక్ష పదవికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ దూరంగా ఉండడంతో వివాదం సద్దుమణిగినట్లే కనిపించింది.

అధికార బీజెపీ ఎంపీ కావడంతో బ్రిజ్ భూషణ్ తీవ్రఆరోపణలు ఎదురైనా, ఎలాంటి శిక్ష లేకుండానే తూతూ విచారణతో బయటపడగలిగారు. అంతేకాదు..కుస్తీ సమాఖ్య అధ్యక్షపదవి కోసం నిర్వహించిన తాజా ఎన్నికలో తన తొత్తు సంజయ్ సింగ్ ను ఎంపిక చేసుకోడం ద్వారా అధికారాన్ని పరోక్షంగా తన చేతిలోనే ఉంచుకోగలిగారు.

ఒలింపిక్స్ సమాఖ్య నిబంధనల ప్రకారం క్రీడాసంఘాలను క్రీడాకారులు మాత్రమే నడుపుకోవాలి. రాజకీయనాయకుల ప్రమేయం ఉండకూడదు. అయితే భారత కుస్తీ సమాఖ్య మాత్రం బీజెపీకి చెందిన రాజకీయనేతల కబంధహస్తాలలో చిక్కుకుపోయింది.

బీజెపీ ఎంపీగా, కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ జంట పదవులతో అధికారం చెలాయిస్తూ, చివరకు దేశానికి పతకాలు తెచ్చిన మహిళా వస్తాదులనే లైంగికంగా వేధించడంతో తీవ్రఅలజడి రేగింది. ప్రముఖ వస్తాదులు వినేశ్ పోగట్, సాక్షీమాలిక్, బజరంగ్ పూనియాతో సహా మొత్తం 30 మంది తిరుగుబాటు చేయడంతో పాటు..ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొద్దివారాలపాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే పోలీసులు బలవంతంగా నిరసనను అణిచివేయటం, రెండువర్గాలు న్యాయస్థానం మెట్లు ఎక్కడ జరిగిపోయాయి.

తీవ్రవివాదానికి కారణమైన బ్రిజ్ భూషణ్ పై ఎలాంటి చర్యలు తీసుకోడానికి అధికార బీజెపీ ఏవిధమైన ఆసక్తి చూపకపోగా విచారణ తంతుతో నవ్వులపాలయ్యింది.

నిరసనగా కుస్తీకి సాక్షీ మాలిక్ గుడ్ బై...

అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఒత్తిడితో జాతీయ కుస్తీ సమాఖ్య కార్యవర్గానికి ఇటీవలే నిర్వహించిన ఎన్నికలలో వివాదాస్పద బ్రిజ్ భూషణ్ అధికార బలంతో తన వర్గానికి చెందిన సంజయ్ సింగ్ ను ఎన్నిక చేసుకోడం ద్వారా అధికారాన్ని పరోక్షంగా తన చేతిలోనే ఉంచుకోగలిగారు.

దీంతో..కుస్తీయోధులలో మరోసారి కలకలం రేగింది. మహిళా వస్తాదులను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ తొత్తు సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ..అంతర్జాతీయ వస్తాదు సాక్షీ మాలిక్ కుస్తీకి రాం రాం చెప్పారు. తాను కుస్తీ నుంచి అర్థంతరంగా రిటైరవుతున్నట్లు ప్రకటించారు.

మరోవైపు...అంతర్జాతీయ పతకాల విజేత బజరంగ్ పూనియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు తెలిపాడు. జాతీయ కుస్తీ సమాఖ్యకు ఓ మహిళ అధ్యక్షురాలిగా ఉంటే బాగుంటుందని తాము ఆశించామని..అయితే రాజకీయ పశుబలమే మరోసారి పైచేయి సాధించిదంటూ ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నీరుమున్నీరయ్యారు.

కుస్తీ తో రాజకీయాలా- సంజయ్ సింగ్

మరోవైపు..కుస్తీతో రాజకీయాలు చేయవద్దని కొత్తగా ఎన్నికైన కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ హెచ్చరించారు. తాను బ్రిజ్ భూషణ్ తో చనువుగా, సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఆయన చేతిలో కీలుబొమ్మన కానేకాదని స్పష్టం చేశారు.

కుస్తీపట్ల ప్రేమ, కుస్తీ క్రీడలో కొనసాగాలనుకొనేవారు ప్రాక్టీసుకు రావాలని, వద్దు రాజకీయం చేయాలని భావించేవారు రాజకీయం చేసుకోవచ్చునని ప్రకటించారు.

గత 12 సంవత్సరాలుగా తాను కుస్తీ సమాఖ్యతో ఉన్నానని, బ్రిజ్ భూషణ్ తో తాను సన్నిహితంగా ఉండటం నేరమా అని సంజయ్ సింగ్ ప్రశ్నించారు.

అయితే..ఈ తాజా వివాదంపై తాను మాట్లాడటానికి ఏమీలేదంటూ కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు దులుపుకొన్నారు.

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు బంగారుపతకం, ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిపెట్టిన 31 సంవత్సరాల సాక్షీ మాలిక్ మాత్రం సంజయ్ సింగ్ ఎన్నికతో తీవ్రనిరాశకు గురయ్యారు. తాను ఇక కుస్తీ క్రీడలో కొనసాగేదే లేదని, అర్థంతరంగా తన కెరియర్ ను ముగిస్తున్నట్లు ప్రకటించి కలకలం రేపారు.

First Published:  24 Dec 2023 3:30 AM GMT
Next Story