Telugu Global
Sports

అరాచకీయమే గెలిచింది- ఒలింపిక్ మాజీ మెడలిస్ట్ ఆందోళన!

భారత మహిళావస్తాదులు ఏడుగురిని లైంగికం వేధించిన వ్యక్తి కుటుంబానికే బీజెపీ టికెట్ కేటాయించడం పట్ల రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆందోళన వ్యక్తం చేసింది.

అరాచకీయమే గెలిచింది- ఒలింపిక్ మాజీ మెడలిస్ట్ ఆందోళన!
X

భారత మహిళావస్తాదులు ఏడుగురిని లైంగికం వేధించిన వ్యక్తి కుటుంబానికే బీజెపీ టికెట్ కేటాయించడం పట్ల రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆందోళన వ్యక్తం చేసింది.

భారత కుస్తీ సమాఖ్యను గత ఏడాది కాలంగా కదిపికుదిపిన మహిళా వస్తాదుల లైంగిక వేధింపుల వివాదం జవాబులేని ప్రశ్నగా, ధర్మంపై అధర్మం సాధించిన విజయంగా నిలిచింది.

ఏడుగురు భారత మహిళావస్తాదులను లైంగికంగా వేధించారంటూ తీవ్రఆరోపణలు ఎదుర్కొన్న బీజెపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఏ విధమైన శిక్ష పడకుండా తప్పించుకోడం, తన జేబులో బొమ్మలాంటి వ్యక్తినే కుస్తీ సమాఖ్య అధ్యక్షుడుగా ఎంపిక చేసుకోగలగడం, తనకు బదులుగా తన కుమారుడు కరణ్ సింగ్ కు కేసరిగంజ్ లోక్ సభ టికెట్ ఇప్పించుకోడం ఇప్పుడు దేశంలో, ప్రధానంగా భారత క్రీడారంగంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

బ్రిజ్ భూషణ్ కు కమలనాథుల అండ...

భారత కుస్తీ సమాఖ్యలో తన కీచక కార్యకలాపాలను కొనసాగిస్తూ అరాచకం సృష్టించిన బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ సింగ్ కు పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని కేసరిగంజ్ పార్లమెంటరీ నియోజకవర్గ సీటును బీజెపీ అధిష్టానం కేటాయించడం పట్ల భారత మాజీ వస్తాదు, రియో ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ తీవ్రఆందోళన వ్యక్తం చేసింది.

బ్రిజ్ భూషణ్ చేతిలో తమకు జరిగిన అన్యాయం పై రోడ్లెక్కి, కోర్టు మెట్లెక్కినా తాము కోరుకున్న న్యాయం జరుగలేదని, తప్పు చేసినవారిని శిక్షించడం కోసం విచారణ సంఘం ఏర్పాటు చేసి తూతూమంత్రంగా విచారణ ముగించారని సాక్షి సోషల్ మీడియా ద్వారా వాపోయింది.

భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఎలాంటి విచారణ, శిక్ష ఎదుర్కొనకుండా..దర్జాగా తిరుగుతూ తన కుమారుడికి కేసరిగంజ్ సీటు కేటాయింపు చేసుకోడం..భారత ఆడబిడ్డల పరాజయంగా అభివర్ణించింది.

ఆడబిడ్డలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

ఈ దేశానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిన ఆడబిడ్డలను లైంగికంగా వేధించిన వారిని శిక్షించకుండా..లోక్ సభ టికెట్ కేటాయిస్తారా? ఇదెక్కడి న్యాయం? ఈ దేశ ఆడబిడ్డలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ బీజెపీ పెద్దలని సాక్షి మాలిక్ నిలదీసింది.

బ్రిజ్ భూషణ్ కుమారుడికి సీటు కేటాయించడం అంటే ..ఈ దేశ ఆడబిడ్డల గౌరవాన్ని మంటగలిపినట్లేనని, ఇది ధర్మంపై అధర్మం విజయం సాధించడం లాంటిదంటూ సాక్షి ఆందోళన వ్యక్తం చేసింది.

నైతిక విలువలు లేని రాజకీయవ్యవస్థ ఇది...

మనదేశంలో రాజకీయవ్యవస్థ నైతికంగా పతనమయ్యిందనటానికి కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడి కుటుంబానికే ఎంపీ టికెట్ కేటాయించడం నిదర్శనమని, రాజకీయ ప్రయోజనాల ముందు అన్నీ దిగదుడుపేనని తేలిపోయిందని వాపోయింది. తాము సంవత్సరాల తరబడి సాధన చేస్తూ, స్వేదం చిందిస్తూ దేశానికి ప్రపంచ పోటీలలో పతకాలు సాధించి పెడితే చివరకు లైంగిక వేధింపులు మిగిలాయని, అన్యాయం జరిగిందని మొరపెట్టుకొంటే..అధికారంలో ఉన్నవారు ..దోషులకు అండగా నిలిచారని, పైగా వారిని ఎంపీ సీట్లతో సత్కరిస్తున్నారంటూ సాక్షి మండి పడింది.

తమ క్రీడాజీవితాలను పణంగా పెట్టి న్యాయం కోసం రోడ్లెక్కామని, చివరకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించామని..ఈ రోజు వరకూ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయలేదంటూ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేసింది.

తప్పు చేసిన వ్యక్తిని కాపాడుతూ..ఆ కుటుంబానికే సీటును కేటాయించడం చూస్తే మన రాజకీయనాయకత్వం అంత బలహీనంగా ఉందా అంటూ ఆశ్చర్యం వక్యం చేసింది.

ఆ ఒక్క వ్యక్తీ, కుటుంబమూ లేకపోతే తిరిగి రాజకీయ అధికారం దక్కదని బయపడుతున్నారా అంటూ నిలదీసింది.

తాను, బజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ తో సహా 30 మంది రెజ్లర్లు రెండునెలల పాటు జరిపిన పోరాటానికి అర్థం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

భారత కుస్తీ సమాఖ్యలోని అరాచక శక్తులకు నిరసనగా తాను కుస్తీ క్రీడ నుంచి విరమించుకొంటున్నట్లు సాక్షి కొద్దిమాసాల క్రితమే ప్రకటించడం ద్వారా కలకలం రేపింది.

2016 రియో ఒలింపిక్స్ కుస్తీలో కాంస్య పతకం, ఆసియా, ఆసియాక్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ కుస్తీ పోటీలలో దేశానికి పలు పతకాలు సాధించి పెట్టిన సాక్షి క్రీడాజీవితం అర్ధంతరంగా ముగిసిపోడానికి కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, భారత ప్రభుత్వ నాన్చుడు ధోరణే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  3 May 2024 3:00 PM IST
Next Story