Telugu Global
Sports

రెండోవన్డే లో భారత్ కు సఫారీదెబ్బ!

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి రెండుజట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి.

రెండోవన్డే లో భారత్ కు సఫారీదెబ్బ!
X

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి రెండుజట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి...

భారత్, దక్షిణాఫ్రికాజట్ల మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ రసపట్టుగా సాగుతోంది. సిరీస్ అవకాశాలను నిలుపుకోవాలంటే నెగ్గి తీరాల్సిన రెండోవన్డేలో భారత్ ను దక్షిణాఫ్రికా 8 వికెట్లతో చిత్తు చేసి 1-1తో సమఉజ్జీగా నిలిచింది.

తొలివన్డేలో 8 వికెట్లతో నెగ్గడం ద్వారా 1-0తో పైచేయి సాధించిన భారత్ రెండోవన్డేలో అదేజోరు కొనసాగించలేకపోయింది.

211 పరుగులకే కుప్పకూలిన భారత్

తన విజయాల అడ్డా సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ముగిసిన రెండోవన్డేలో ఆతిథ్య సఫారీజట్టు టాస్ నెగ్గటం నుంచి బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో స్థాయికి తగ్గట్టుగా ఆడి కీలక విజయం నమోదు చేసింది.

బౌలర్లకు అనువుగా ఉన్న వాతావరణంలో ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా దక్షిణాఫ్రికాజట్టు సగం విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ను 46.2 ఓవర్లలో 211 పరుగుల స్కోరుకే కుప్పకూల్చింది.

భారత బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ 62, కెప్టెన్ కెఎల్ రాహుల్ 56 మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఓపెనర్ రుతురాజ్ 4, వన్ డౌన్ తిలక్ వర్మ 10,

సంజు శాంసన్ 12, అరంగేట్రం హీరో రింకూ సింగ్ 18 పరుగులకే అవుటయ్యారు.

సఫారీ బౌలర్లలో నాండ్రే బర్గర్ 3 వికెట్లు, మహారాజ్, హెండ్రిక్స్ చెరో 2 వికెట్లు, మర్కరమ్,విలియమ్స్ చెరో వికెట్ పడగొట్టారు.

అరంగేట్రం మ్యాచ్ లోనే టోనీ సెంచరీ...

మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 212 పరుగులు మాత్రమే చేయాల్సిన సఫారీజట్టుకు ఓపెనింగ్ జోడీ టోనీ డి జోర్జీ-రీజా హెండ్రిక్స్ సెంచరీ భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

భారత్ బౌలింగ్ కు దిగే సమయానికి వికెట్లోని తేమ ఆరిపోడం సఫారీబ్యాటర్లకు బాగా కలసి వచ్చింది. మొదటి వికెట్ కు 27.5 ఓవర్లలో 130 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు.

వికెట్ నుంచి మద్దతు లేకపోడంతో భారత పేసర్లు మాత్రమే కాదు..స్పిన్నర్లు సైతం తేలిపోయారు. రీజా 81 బంతుల్లో 7 బౌండ్రీలతో 52,వన్ డౌన్ డ్యూసెన్ 51 బంతుల్లో 5 బౌండ్రీలతో 31 పరుగులకు అవుటైనా..యువఓపెనర్ టోనీ డీ జోర్జి రిజా 119, కెప్టెన్ మర్కరమ్ 2 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలవడంతో 42.3 ఓవర్లలోనే విజయలక్ష్యం చేరడం ద్వారా సఫారీజట్టు 8 వికెట్ల విజయం సాధించింది.

అరంగేట్రం ఓపెనర్ టోనీ 122 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో అర్షదీప్, రింకూ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.

దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానపాత్ర వహించిన టోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సఫారీవిజయాల అడ్డా సెయింట్ జార్జ్ పార్క్...

ఇదే గ్రౌండ్ వేదికగా ఆడిన నాలుగు వన్డేలలో సఫారీజట్టుకు 3 విజయాలు, ఓ పరాజయం రికార్డు ఉన్నాయి.భారత్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన 93 వన్డేలలో దక్షిణాఫ్రికా 51 విజయాలు, 39 పరాజయాల రికార్డుతో ఉంది. అయితే..ఈ రెండుజట్లు తలపడిన గత 6 వన్డేలలో భారత్ 5 విజయాలు, దక్షిణాఫ్రికా 2 విజయాల రికార్డుతో ఉన్నాయి. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా భారత్ తో తలపడిన ఆరు మ్యాచ్ ల్లో 5విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా తన ఆధిపత్యాన్ని చాటుకోగలిగింది.

సిరీస్ లోని ఆఖరి వన్డే పార్ల్ వేదికగా గురువారం జరుగనుంది.

First Published:  20 Dec 2023 11:00 AM IST
Next Story