Telugu Global
Sports

యూరో కప్ లో ముగిసిన రొనాల్డో శకం!

యూరోపియన్ కప్ ఫుట్ బాల్ లో రెండు దశాబ్దాల క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్ లోనే పోర్చుగీసు టైటిల్ వేటకు తెరపడింది...

యూరో కప్ లో ముగిసిన రొనాల్డో శకం!
X

యూరోపియన్ కప్ ఫుట్ బాల్ లో రెండు దశాబ్దాల క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్ లోనే పోర్చుగీసు టైటిల్ వేటకు తెరపడింది...

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, పోర్చుగల్ ఎవర్ గ్రీన్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 20 సంవత్సరాల యూరోపియన్ కప్ ప్రస్థానం ముగిసింది. 2024 యూరోకప్ క్వార్టర్ ఫైనల్లో

ప్రపంచ మాజీ చాంపియన్ ఫ్రాన్స్ తో జరిగిన పోరులో పెనాల్టీ షూటౌట్ ఓటమితో పోర్చుగల్ నిష్క్ర్రమణ, రొనాల్డో యూరో టైటిల్ వేట ముగిసిపోయాయి.

ఆరు యూరోకప్ టోర్నీలు...14 గోల్స్, ఓ టైటిల్...

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫుట్ బాల్ టోర్నీగా పేరుపొందిన యూరోకప్ లో 20 సంవత్సరాల క్రితం టీనేజర్ గా అరంగేట్రం చేసిన 39 సంవత్సరాల క్రిస్టియానో రొనాల్డో..

తన కెరియర్ లో ప్రస్తుత టోర్నీనే చివరిదంటూ ప్రకటించాడు. పోర్చుగల్ జట్టును మరోసారి విజేతగా నిలిపి వీడ్కోలు పలకాలని భావించాడు. అయితే..రొనాల్డో భావించినట్లుగా జరుగలేదు.

సెమీఫైనల్లో చోటు కోసం ప్రపంచ మాజీ చాంపియన్ ఫ్రాన్స్ తో జరిగిన పోరులో పోర్చుగల్ కు పరాజయం తప్పలేదు. ఆట నిర్ణితసమయంతో పాటు..అదనపు సమయంలోనూ ఏ జట్టు గోలు చేయలేకపోడంతో స్కోరు 0-0గా మిగిలింది. దీంతో విజేత ను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ పాటించారు.

పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ 5 పెనాల్టీలను గోల్సుగా మలచుకోగా..పోర్చుగల్ మూడు పెనాల్టీల ద్వారానే గోల్స్ సాధించగలిగింది. క్వార్టర్ ఫైనల్లోనే తనజట్టు ఓటమితో రొనాల్డో నిశ్చేష్టుడు కాగా..వెటరన్ డిఫెండర్ పోపే కన్నీరు మున్నీరయ్యాడు.

18 సంవత్సరాల చిన్నవయసులో తన తొలి యూరోకప్ టో్ర్నీ ఆడిన క్రిస్టియానో రొనాల్డో గత రెండు దశాబ్దాల కాలంలో వరుసగా ఐదుటోర్నీలలో పాల్గొని 14 గోల్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

2004, 2008, 2012, 2016, 2020, 2024 టోర్నీలలో పాల్గొన్న రొనాల్డో పేరుతోనూ అత్యధిక యూరోమ్యాచ్ లు ఆడిన ఆటగాడి రికార్డు నమోదయ్యింది.

అంతేకాదు..రొనాల్డో నాయకత్వంలోనే పోర్చుగల్ జట్టు 2016 యూరోకప్ ఫైనల్లో ఫ్రాన్స్ పై సంచలన విజయం సాధించడం ద్వారా విజేతగా నిలువగలిగింది. యూరోకప్ టోర్నీల నుంచి రొనాల్డో నిష్క్ర్రమించినా..2026 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ వరకూ తన కెరియర్ ను కొనసాగించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియా లీగ్ లో అల్ -నాజర్ క్లబ్ కు భారీ కాంట్రాక్టు పై రొనాల్డో ఆడుతూ నాయకత్వం వహిస్తున్నాడు.

పోర్చుగల్ పై 5-3గోల్స్ తో నెగ్గిన ఫ్రాన్స్ జట్టు ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో స్పెయిన్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

జర్మనీకి స్పెయిన్ కిక్...

స్టుట్ గార్ట్ వేదికగా జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జర్మనీకి ప్రపంచ మాజీ చాంపియన్ స్పెయిన్ షాకిచ్చింది. 2-1 తో విజేతగా నిలిచింది. ఆట నిర్ణితసమయం 90 నిముషాలలో రెండుజట్లూ చెరో గోలుతో 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో విజేతను నిర్ణయించడానికి ఆటను..30 నిముషాల అదనపు సమయానికి పొడిగించారు.

ఎక్స్ట్ ట్రాటైమ్ ఆటలో సబ్ స్టిట్యూట్ గా వచ్చిన మైకేల్ మెరీనో సాధించిన సూపర్ గోలుతో స్పెయిన్ విజేతగా నిలువగలిగింది

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో ఫ్రాన్స్ తో స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్ ఫైనల్లోనే జర్మనీ ఓటమితో స్టార్ మిడ్ ఫీల్డర్ టోనీ క్రూజ్ కెరియర్ సైతం ముగిసినట్లయ్యింది. 2014లో చివరిసారిగా యూరోకప్ నెగ్గిన జర్మనీకి మూడుసార్లు విజేతగా నిలిచిన రికార్డు ఉంది.

సెమీస్ బెర్త్ ల కోసం జరిగే మిగిలిన రెండు క్వార్టర్ ఫైనల్స్ లో స్విట్జర్లాండ్ తో ఇంగ్లండ్, నెదర్లాండ్స్ తో టర్కీజట్లు తలపడనున్నాయి.

First Published:  6 July 2024 3:24 PM IST
Next Story