Telugu Global
Sports

రోహిత్ వారసత్వం కొనసాగిస్తా... ముంబై కొత్త కెప్టెన్ హార్థిక్ పాండ్యా!

ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ సరికొత్త కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ వారసత్వం కొనసాగిస్తానని ప్రకటించాడు.

రోహిత్ వారసత్వం కొనసాగిస్తా... ముంబై కొత్త కెప్టెన్ హార్థిక్ పాండ్యా!
X

ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ సరికొత్త కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ వారసత్వం కొనసాగిస్తానని ప్రకటించాడు.

ఐపీఎల్-17వ సీజన్ హంగామా ప్రారంభమయ్యింది. మార్చి 22నుంచి రెండుమాసాలపాటు కొనసాగే 2024 సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీజట్లు తమదైన శైలిలో సిద్ధమవుతున్నాయి.

రోహిత్ పోయే..హార్థిక్ వచ్చే...!

2008లో ప్రారంభమైన ఐపీఎల్ గత 16 సంవత్సరాల కాలంలో అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ గా అవతరించింది.

మొత్తం పది జట్లతో ఎనిమిదివారాలపాటు ధూమ్ ధామ్ గా సాగే ఈ లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన ముంబై ఇండియన్స్ సరికొత్త కెప్టెన్ తో తన అదృష్టం పరీక్షించుకోనుంది.

గత పది సీజన్లుగా ముంబైకి తిరుగులేని కెప్టెన్ గా సేవలు అందించిన రోహిత్ శర్మ నాయకత్వంలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో తన మనసులో మాట బయట పెట్టాడు.

ఎక్కడ నుంచి వచ్చానో తిరిగి అక్కడికే...

ఐపీఎల్ లో తన ప్రస్థానం ముంబై ఫ్రాంచైజీతో ప్రారంభమై..తిరిగి ముంబైకే చేరిందని హార్ధిక్ చెప్పాడు. గత రెండుసీజన్లు గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహించిన హార్థిక్ తనజట్టును ఓసారి విన్నర్ గాను, మరోసారి రన్నరప్ గాను నిలిపాడు.

అయితే..గత రెండుసీజన్లుగా దారుణంగా విఫలమవుతూ వచ్చిన ముంబైజట్టును గాడిలో పెట్టడం కోసం కెప్టెన్సీలో మార్పు చేయాలని ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించింది. తర్జనభర్జనల అనంతరం రోహిత్ స్థానంలో పాండ్యాకు జట్టు నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పింది.

భారతజట్టును వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో విజయపథంలో నడిపిస్తున్న రోహిత్ ను ముంబై ఫ్రాంచైజీ తప్పించడాన్ని పలువురు ప్రముఖులు, మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు.

పాండ్యా మాత్రం సొంతగూటికి చేరడం ఎంతో ఆనందంగా ఉందని, అత్యుత్తమంగా రాణించడానికి పాటుపడతామని ప్రకటించాడు.

ఓపెనర్ పాత్రకే రోహిత్ పరిమితం...

రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఫ్రాంచైజీ గత పుష్కరకాలంలో ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. అయితే..పాండ్యా బ్రదర్స్ గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలకు వలస పోడం, బుమ్రా లాంటి కీలక బౌలర్ గాయంతో అందుబాటులో లేకపోడంతో ముంబై నీరసించిపోయింది. గత రెండుసీజన్లుగా లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోతూ వచ్చింది.

ఈ పరిస్థితిని నివారించడం కోసం నాయకత్వమార్పు అనివార్యమని చీఫ్ కోచ్ మార్క్ బౌచర్ భావించారు. గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్థిక్ పాండ్యాను తిరిగి ముంబై ఫ్రాంచైజీ గూటిగా చేరేలా, కెప్టెన్సీ బాధ్యత అప్పచెప్పేలా ఓప్పించారు.

రోహిత్ శర్మ గత కొన్ని సంవత్సరాలుగా ఇటు ఓపెనర్ గాను, అటు కెప్టెన్ గాను జంటబాధ్యతలు నిర్వర్తించడం ద్వారా అలసి పోయాడని, ప్రస్తుత సీజన్ నుంచి కేవలం ఓపెనర్ గా, ఎలాంటి ఒత్తిడిలేకుండా ఆడే వాతావరణం కల్పిస్తామని ముంబై చీఫ్ కోచ్ వివరించారు.

మరోవైపు..ముంబై ఇండియన్స్ సాంప్రదాయాన్ని, ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ రోహిత్ శర్మ వారసత్వాన్ని కొనసాగించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు 26 సంవత్సరాల హార్థిక్ పాండ్యా ప్రకటించాడు.

తాను విజయాలతో పొంగిపోయి, పరాజయాలలో కృంగిపోయే మనిషిని కానని, ఆటలో, జట్టు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించడంలో మజాను ఆస్వాదిస్తానని వివరించాడు.

ముంబైజట్టు నాయకత్వం గర్వకారణం...

ఓ ఆటగాడిగా ముంబై ఫ్రాంచైజీలో తన ఐపీఎల్ కెరియర్ ప్రారంభమయ్యిందని, తిరిగి అదేజట్టుకు నాయకత్వం వహించేస్థాయికి చేరడం గర్వకారణమని హార్థిక్ పాండ్యా తెలిపాడు.

భారత కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా లాంటి ప్రపంచ మేటి ఆటగాళ్లతో పాటు..ప్రతిభావంతులైన పలువురు యువఆటగాళ్లతో కలసి ప్రస్తుత 2024 సీజన్లో పాల్గొనే అవకాశం తనకు లభించడాన్ని గొప్ప అదృష్టంగా పాండ్యా అభివర్ణించాడు.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ మాత్రమే మారాడాని..మిగిలినదంతా అలాగే ఉంటుందని పాండ్యా స్పష్టం చేశాడు. అవసరమైన సమయంలో రోహిత్ సాయం తీసుకోడానికి తాను వెనుకాడబోనని, ముంబైకి రోహిత్ గొప్పవారసత్వాన్ని అందించాడని కొనియాడాడు.

ముంబైజట్టు శిక్షకులు మలింగ, పొలాక్ లతో కలసి మరోసారి పనిచేయటానికి తాను ఎదురుచూస్తున్నానని, ముంబైకి ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన రికార్డు ఉందన్న విషయాన్ని తాను పదేపదే మననం చేసుకొంటూ ఉంటానని వివరించాడు.

బుమ్రా, రోహిత్ భీకరమైన ఫామ్ లో ఉన్నారని, అదే తమజట్టుకు బలమని తెలిపాడు. మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ప్రారంభమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనుంది.

ముంబై ఇండియన్స్ మాత్రం తన ప్రారంభమ్యాచ్ ను మార్చి 24న గతేడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.

First Published:  18 March 2024 6:01 PM IST
Next Story