Telugu Global
Sports

పూజారాకు ' నో ' ...భారతటెస్టు జట్టులో రజత్ పాటిదార్!

ఇంగ్లండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే భారతజట్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ కు చోటు దక్కింది.

పూజారాకు  నో  ...భారతటెస్టు జట్టులో రజత్ పాటిదార్!
X

ఇంగ్లండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే భారతజట్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ కు చోటు దక్కింది. వెటరన్ చతేశ్వర్ పూజారాను సెలెక్టర్లు మరోసారి పక్కన పెట్టారు...

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో గురువారం హైదరాబాద్ లో ప్రారంభమయ్యే ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం కావడంతో...ఆ స్థానంలో అనుభవం కలిగిన చతేశ్వర్ పూజారాను కాకుండా..యువఆటగాడు రజత్ పాటిదార్ కు బీసీసీఐ ఎంపిక సంఘం చోటు కల్పించింది.

యువత వైపే ఎంపిక సంఘం మొగ్గు!

ఇంగ్లండ్ లాంటి పవర్ ఫుల్ జట్టుతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల కీలక సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు విరాట్ కొహ్లీ లాంటి ప్రపంచ మేటి బ్యాటర్ అందుబాటులో లేకపోడంతో ..ఆ స్థానాన్ని మరో అనుభవజ్ఞుడైన బ్యాటర్ తో భర్తీ చేయడం మామూలుగా జరిగే విషయం. అయితే..దానికి భిన్నంగా టెస్టు మ్యాచ్ అనుభవం ఏమాత్రం లేని, దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న యువబ్యాటర్ రజత్ పాటిదార్ కు చోటు కల్పించడం ద్వారా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్ మెంట్ గొప్పసాహసమే చేసింది.

ఓ వైపు భారత టెస్టు జట్టులో పునరాగమనం కోసం చతేశ్వర్ పూజారా, అజంక్యా రహానే లాంటి సీనియర్ స్టార్లు తహతహలాడుతుంటే..బీసీసీఐ మాత్రం యువఆటగాళ్లను ప్రోత్సహించడం వైపే మొగ్గుచూపుతోంది.

పాపం! పూజారా, సర్ ఫ్రాజ్ ఖాన్....

దేశవాళీ రంజీ క్రికెట్లో గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తూ టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తూ...భారత టెస్టుజట్టులో చోటు కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న ముంబై మిడిలార్డర్ బ్యాటర్ సర్ ఫ్రాజ్ ఖాన్ కు మరోసారి నిరాశే ఎదురయ్యింది.

అంతే కాదు..103 టెస్టులు, 19 శతకాల అపారఅనుభవం కలిగిన 34 సంవత్సరాల చతేశ్వర్ పూజారాను సైతం సెలెక్టర్లు నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఓ డబుల్ సెంచరీతో సహా మంచిస్కోర్లు సాధిస్తూ వచ్చిన పూజారాను..విరాట్ కొహ్లీ స్థానంలో తీసుకోడం ఖాయమనే అందరూ అనుకొన్నారు. అయితే..సెలెక్టర్లు మాత్రం రజత్ పాటిదార్ వైపు మొగ్గుచూపారు.

ఎవరీ రజత్ పాటిదార్...?

దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ కు, ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ఆడుతూ నిలకడగా రాణిస్తూ వస్తున్న 30 సంవత్సరాల రజత్ పాటిదార్ కష్టానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది.

ఇంగ్లండ్ తో జరిగిన రెండు సన్నాహక మ్యాచ్ ల్లో రజత్ పాటిదార్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించడం ద్వారా భారత టెస్టుజట్టులో తన చోటును ఖాయం చేసుకోగలిగాడు.

హైదరాబాద్, విశాఖపట్నం వేదికలుగా ఇంగ్లండ్ తో జరిగే మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే 16 మంది సభ్యుల భారతజట్టులో రజత్ పాటిదార్ కు చోటు కల్పించారు.

ఇప్పటికే వన్డేలలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన రజత్ ఇండియా-ఏ జట్టు సభ్యుడిగానూ పలు కీలక ఇన్నింగ్స్ ఆడటం ద్వారా సత్తా చాటుకొన్నాడు.

టెస్టు సిరీస్ కు సన్నాహకంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండురోజుల సన్నాహక మ్యాచ్ తో పాటు..అనధికారిక టెస్టులో సైతం రజత్ సెంచరీలు బాదాడు.

ఇండియా-ఏ జట్టులో సభ్యుడిగా ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన అనధికారిక టెస్టులో 111 పరుగులు, మరో మ్యాచ్ లో 158 బంతుల్లో 151 పరుగులు సాధించాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన రజత్ పాటిదార్ 4వేల పరుగులతో 45.97 సగటు నమోదు చేశాడు.

ఇంగ్లండ్ తో జరిగే మొదటి రెండుటెస్టుల్లో అవకాశం దొరికితే రజత్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు రానున్నాడు.

రెండోడౌన్లో రాహుల్ కు చాన్స్....

భారతటెస్టు జట్టులో కీలక రెండో డౌన్ స్థానంలో ఆడే విరాట్ కొహ్లీ అందుబాటులో లేకపోడంతో..ఆ స్థానంలో కెఎల్ రాహుల్ ఆడనున్నాడు. రోహిత్ శర్మతో కలసి యశస్వి జైశ్వాల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. వన్ డౌన్ లో శుభ్ మన్ గిల్, రెండో రౌండ్లో రాహుల్, మూడో డౌన్లో శ్రేయస్ అయ్యర్ లేదా రజత్ పాటిదార్, నాలుగో డౌన్లో రవీంద్ర జడేజా, ఆ తరువాత భరత్, అశ్విన్ బ్యాటింగ్ కు దిగనున్నారు.

భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల కూర్పుతో పోటీకి దిగనుంది. సిరీస్ లోని తొలిటెస్టు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జనవరి 25 నుంచి ఐదురోజులపాటు జరుగనుంది.

First Published:  24 Jan 2024 2:22 PM GMT
Next Story