ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో రోహన్ బొపన్న జోడీ!
భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్నను ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ఊరిస్తోంది. తొలిసారి రోహన్ జోడీ ఫైనల్స్ కు అర్హత సాధించగలిగారు.
భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్నను ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ఊరిస్తోంది. తొలిసారి రోహన్ జోడీ ఫైనల్స్ కు అర్హత సాధించగలిగారు.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పురుషుల డబుల్స్ లో రికార్డుల మోత మోగిస్తున్న భారత వెటరన్ స్టార్ ప్లేయర్ రోహన్ బొపన్న..2024 తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ కు గెలుపు దూరంలో నిలిచాడు.
ఆస్ట్ర్రేలియాకే చెందిన మాథ్యూ ఇబెడెన్ తో జంటగా టైటిల్ వేటకు దిగిన రోహన్ సెమీఫైనల్స్ విజయం సాధించగలిగాడు.
17వ ప్రయత్నంలో ఫైనల్స్ కు....
38 సంవత్సరాల రోహన్ బొపన్న వివిధ ఆటగాళ్లు భాగస్వాములుగా గత 17 పర్యాయాలుగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో పాల్గొంటూ వస్తున్నాడు. అయితే..రిటైర్మెంట్ దశలో కానీ ఫైనల్స్ కు చేరుకోడంతో పాటు..ట్రోఫీకి గెలుపు దూరంలో నిలువగలిగాడు.
గత సీజన్ ఆఖరిగ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చేరడంతో పాటు రన్నరప్ ట్రోఫీ అందుకొన్న రోహన్- మాథ్యూ జోడీ 2024 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టోర్నీలో సైతం అదేజోరు కొనసాగించగలిగారు.
హోరాహోరీ పోరులో గెలుపు...
మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జోడీ రోహన్- మాథ్యూ 6-3, 3-6, 7-6తో జాంగ్- థామస్ మాచాక్ జోడీని అధిగమించగలిగారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మూడుసెట్ల పోరులో రోహన్ జోడీ తొలిసెట్ ను 6-3తో అలవోకగా నెగ్గి రెండోసెట్లో పైచేయి సాధించినా..ప్రత్యర్థుల పోరాటంతో 3-6తో సెట్ ను చేజార్చుకొన్నారు.
నిర్ణయాత్మక మూడోసెట్ సైతం పట్టుగా సాగింది. చివరకు రోహన్ జోడీ టై బ్రే్క ద్వారా 7-6తో సెట్ ను 2-1తో విజయాన్ని కైవసం చేసుకోడం ద్వారా తొలిసారిగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగలిగారు.
ప్రస్తుత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్లో ఆస్ట్ర్రేలియా జోడీ జేమ్స్ డక్ వర్త్- మార్క్ పోల్ మాన్స్ పై 7-6, 4-6, 7-6తో నెగ్గిన రోహన్ జోడీ రెండోరౌండ్లో జాన్ మిల్ మాన్- ఎడ్వర్డ్ వింటర్ జోడీని వరుస సెట్లలో చిత్తు చేయడం ద్వారా ప్రీ- క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టారు.
మూడోరౌండ్లో వెస్లీ కూల్ హాఫ్- నికోలా మెక్టిచ్ జోడీని 7-6, 7-6తోనూ, క్వార్టర్ ఫైనల్లో మాక్సిమో గోంజాలేజ్- యాండెర్స్ మోల్టినీను ఓడించడం ద్వారా సెమీస్ కు చేరుకోగలిగారు.
రోహన్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ డబుల్స్ విజేతగా నిలిస్తే అది సరికొత్త చరిత్రే అవుతుంది. 38 సంవత్సరాల లేటు వయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించడంతో పాటు..టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్ గా ఓ అరుదైన రికార్డు నెలకొల్పగలుగుతాడు.
కోకో గాఫ్ అవుట్- సెమీస్ లో జోకోవిచ్...
మహిళల సింగిల్స్ లో హాట్ ఫేవరెట్ కోకో గాఫ్ పోటీ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. చైనా ప్లేయర్ జెంగ్ వీ తొలిసారిగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ కు అర్హత సంపాదించింది.
పురుషుల సింగిల్స్ లో రెండోసీడ్ కార్లోస్ అల్ కరాజ్ పోటీ క్వార్టర్స్ దశలోనే ముగిసింది. టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, మాజీ చాంపియన్ డేనిల్ మెద్వదేవ్ సెమీస్ పోరుకు సిద్ధమయ్యారు.