Telugu Global
Sports

మృత్యుంజయుడి 100వ ఐపీఎల్ మ్యాచ్!

గతేడాది జరిగిన ఓ తీవ్రరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భారత, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.

మృత్యుంజయుడి 100వ ఐపీఎల్ మ్యాచ్!
X

భారత క్రికెట్ మృత్యుంజయుడు రిషభ్ పంత్ 2024 సీజన్ ఐపీఎల్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ తొలి ప్లేయర్ గా నిలిచాడు.

గతేడాది జరిగిన ఓ తీవ్రరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భారత, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.

కారుప్రమాదంలో రెండు మోకాళ్లు విరిగినా...పలు రకాల శస్త్రచికిత్సలు చేయించుకొని, ఫిట్ నెస్ కోసం కఠోరసాధన చేయడం ద్వారా కేవలం 15 మాసాల వ్యవధిలోనే ఐపీఎల్ పునరాగమనం చేసిన రిషభ్..ప్రస్తుత 2024 సీజన్ ఐపీఎల్ లో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పగ్గాలు అందుకొన్నాడు. అంతేకాదు..10 జట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్..రెండోరౌండ్ మ్యాచ్ ఆడటం ద్వారా చరిత్ర సృష్టించాడు.

2016- 2024 వరకూ...

2016 సీజన్ నుంచి ఐపీఎల్ లో ఢిల్లీ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రిషభ్ పంత్ కారుప్రమాదంతో గత 15మాసాలుగా క్రికెట్ కు దూరమయ్యాడు. 2024 ఐపీఎల్ ద్వారా పునరాగమనం చేశాడు.

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరు ద్వారా రిషభ్ పంత్ ..వంద మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు.

రిషభ్ కు ముందు అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లలో అమిత్ మిశ్రా ( 99 ), శ్రేయస్ అయ్యర్ ( 87 ), డేవిడ్ వార్నర్ ( 82 ), వీరేంద్ర సెహ్వాగ్ ( 79 ) మాత్రమే ఉన్నారు.

తన వందో మ్యాచ్ లో రిషభ్ వికెట్ కీపర్ గా ఓ క్యాచ్ అందుకోడం తో పాటు...స్పెషలిస్ట్ బ్యాటర్ గా 26 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 28 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగాడు.

వైద్యరంగంలో మహాద్భుతం రిషభ్!

కారు ప్రమాదంలో శరీరం నుజ్జునుజ్జయినా..నుదుటి భాగం నుంచి రెండు కాళ్ల వరకూ పలురకాలు శస్త్రచికిత్సలు చేయించుకొన్న రిషభ్ పంత్ తిరిగి క్రికెట్ ఫీల్డ్ లో అడుగుపెడతాడని వైద్యనిపుణులతో సహా ఏ ఒక్కరూ అనుకోలేదు. అయితే కేవలం 14మాసాల విరామంలోనే రిషభ్ పంత్ పూర్తిగా కోలుకొని తిరిగి ఐపీఎల్ పునరాగమనం చేయటాన్ని వైద్యరంగంలో మహాద్భుతంగా భావిస్తున్నారు.

2022 డిసెంబర్ 22న ఢిల్లీ-ముస్సోరీ జాతీయరహదారిలో జరిగిన ఓ ఘోరరోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ నడుపుతున్న కారు నుజ్జునుజ్జయింది. రిషభ్ రెండు మోకాళ్లు, పక్కటెముకలు విరిగాయి. చావుబతుకుల నడుమ కొట్టిమిట్టాడుతున్న రిషభ్ ను కారునుంచి బయటకు తీసి డెహ్రాడూన్, ముంబై ఆస్పత్రుల్లో చికిత్స అందించారు.ఉత్తరాఖండ్ లో తన స్నేహితులతో కలసి వేడుకలు చేసుకొని ..డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తున్నసమయంలో రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ కారు ప్రమాదంలో చిక్కుకొంది.

అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును రిషభ్ పంత్ స్వయంగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. డెహ్రాడూన్- ఢిల్లీ జాతీయ రహదారిలో.. తెల్లవారుజామున వేగంగా వస్తున్న ఆ కారు డివైడర్ ను బలంగా ఢీ కొట్టి మూడుసార్లు పల్టీలు కొట్టడంతో మంటలు చెలరేగాయి. రోడ్డుకు అటువైపుగా వెళుతున్న హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ ప్రమాదాన్ని చూసి...మంటలు రేగుతున్న కారు అద్దాలు పగుల కొట్టి రిషభ్ పంత్ ను కాపాడి రూర్కీ ఆస్పత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు.

ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పంత్ కు చికిత్స అందిస్తూ వచ్చారు. కోకిలాబెన్ సీనియర్ వైద్యుడు డాక్టర్ దిన్ షా పర్డీవాలా పర్యవేక్షించారు. పంత్ కుడికాలి నరం తెగిపోడంతో ముందుగా శస్త్రచికిత్స నిర్వహించారు.

9 మాసాలు అనుకొంటే....

రిషభ్ పంత్ పూర్తిగా కోలుకోడానికి కనీసం 9 మాసాల సమయం పడుతుందని తొలుత డాక్టర్లు భావించినా..పూర్తిగా కోలుకొని క్రికెట్ ఫీల్డ్ లో తిరిగి అడుగుపెట్టడానికి 14 మాసాలా సమయం పట్టింది. భారత క్రికెటర్లకు బీసీసీఐ కల్పించిన మెడికల్ ఇన్సూరెన్సు పథకం కింద పంత్ కు చికిత్స నిర్వహించారు.

26 సంవత్సరాల రిషభ్ పంత్ క్రికెటర్ గా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ కాంట్రాక్టు, ఎండార్స్ మెంట్ల ద్వారా ఇప్పటికే 100 కోట్ల రూపాయల వరకూ ఆర్జించాడు. ఖరీదైన, అత్యంత భద్రతతో కూడిన మెర్సిడెస్ కారులో ప్రయాణించిన కారణంగానే రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడినట్లు చెబుతున్నారు.

First Published:  29 March 2024 3:53 PM IST
Next Story