Telugu Global
Sports

రాజకోట టెస్ట్ నుంచి అర్థంతరంగా వైదొలిగిన అశ్విన్!

పరుగుల మోతతో సాగుతున్న రాజకోట టెస్ట్ రెండోరోజు ఆట నుంచి భారత తురుపుముక్క అశ్విన్ అర్థంతరంగా వైదొలిగాడు. ఇంగ్లండ్ 2 వికెట్లకు 207 పరుగుల స్కోరుతో భారత్ కు దీటుగా బదులిచ్చింది.

రాజకోట టెస్ట్ నుంచి అర్థంతరంగా వైదొలిగిన అశ్విన్!
X

పరుగుల మోతతో సాగుతున్న రాజకోట టెస్ట్ రెండోరోజు ఆట నుంచి భారత తురుపుముక్క అశ్విన్ అర్థంతరంగా వైదొలిగాడు. ఇంగ్లండ్ 2 వికెట్లకు 207 పరుగుల స్కోరుతో భారత్ కు దీటుగా బదులిచ్చింది.

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ లోని మూడోటెస్టు రెండోరోజుఆటలో భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. భారత తొలిఇన్నింగ్స్ స్కోరు 445 పరుగులకు సమాధానంగా ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 207 పరుగులతో దీటుగా సమాధానం చెప్పింది.

భారత్ కు కోలుకోలేని దెబ్బ....

టెస్టు చరిత్రలో 500 వికెట్ల మైలురాయిని చేరిన 9వ బౌలర్ గా, భారత రెండో స్పిన్ ఆల్ రౌండర్ గా చరిత్ర సృష్టించిన 37 సంవత్సరాల అశ్విన్ ఆనందం ఎంతో సేపు నిలువలేదు.

తన తల్లి ప్రాణాపాయంలో ఉందని తెలిసి..టెస్టు జట్టు నుంచి అర్ధంతరంగా ఉపసంహరించుకొన్నాడు. మృత్యువుతో పోరాడుతున్న తన తల్లి చెంతనే ఉండటానికి రాజకోట నుంచి చెన్నైకి హుటాహుటిన బయలు దేరి వెళ్లాడు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 7 ఓవర్లలో 37 పరుగులిచ్చి ఓపెనర్ క్రాలే ను పడగొట్టం ద్వారా 500 వికెట్ల రికార్డు సాధించిన భారత రెండో స్పిన్నర్ గా రికార్డుల్లో చేరాడు.

నాన్నకే 500 వికెట్ల రికార్డు అంకితం...

గత 13 సంవత్సరాలుగా తన టెస్టు క్రికెట్ ప్రయాణం వెనుక నాన్న ప్రేరణ, నిరంతరం స్ఫూర్తి ఉన్నాయని, 500 వికెట్ల ఈ ఘనతను ఆయనకే అంకితమిస్తున్నానని రెండోరోజు ఆట అనంతరం అశ్విన్ ప్రకటించాడు.

'బజ్ బాల్' ( బాదుడే బాదుడు ) వ్యూహంతో ఇంగ్లండ్ ఎదురుదాడి మొదలు పెట్టిందని, రాజకోట పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంలా ఉందని, తాము మూడోరోజు ఆటలో జాగ్రత్తగా బౌల్ చేయాల్సి ఉందని, వికెట్ల కోసం ఓపికగా వేచిచూడాల్సిందేనని అశ్విన్ చెప్పాడు.

అయితే..తన తల్లి తీవ్రఅనారోగ్యం వార్త తెలిసి బోర్డు అనుమతితో అశ్విన్ జట్టునుంచి ఉపసంహరించుకోడంతో..భారత బౌలింగ్ వెన్నెముక విరిగినట్లయ్యింది. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్ల నుంచి భారత బౌలింగ్ బలం నాలుగుకు పడిపోయింది.

ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే భారతజట్టు మిగిలిన మూడోరోజులఆటలో పోరాటం చేయాల్సి ఉంది. అశ్విన్ 98 టెస్టుల కెరియర్ లో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

డుకెట్ సుడిగాలి శతకం...

అంతకుముందు భారత్ ను 445 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్..డాషింగ్ ఓపెనర్ క్రాలే వికెట్ ను 15 పరుగులకే నష్టపోయినా..మరో ఓపెనర్ బెన్ డుకెట్ సునామీ బ్యాటింగ్ తో కేవలం 35 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 207 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది. భారత స్కోరును అధిగమించాలంటే ఈరోజు జరిగే మూడోరోజు ఆటలో మరో 238 పరుగులు చేస్తే చాలు. డుకెట్ 133 పరుగులు, జో రూట్ 9 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో ఉన్నారు.

డుకెట్ కేవలం 88 బంతుల్లోనే సుడిగాలి శతకం బాదడం ద్వారా ఇంగ్లండ్ పరుగుల వేటను టాప్ గేర్ కు తీసుకువెళ్లాడు. కేవలం 118 బంతుల్లోనే 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు.

' టీ' తర్వాతి సెషన్ లోనే సెంచరీ రికార్డు..

రాజకోట టెస్టుమ్యాచ్ ఆఖరి సెషన్ ( తేనీటి విరామం తరువాత ) లోనే సుడిగాలి శతకం బాదిన విదేశీ క్రికెటర్ గా డుకెట్ రికార్డు నెలకొల్పాడు. 2007 సిరీస్ లో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ పై మాట్ ప్రయర్ 121 పరుగులు, 1936 ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో భారత్ పై వాలీ హామండ్ 118 పరుగుల స్కోర్లను టీ-తర్వాతి సెషనల్ సాధించగా..ఇప్పుడు భారతగడ్డపై బెన్ డుకెట్ 114 పరుగులతో నిలిచాడు.

భారత బౌలర్లలో అశ్విన్, సిరాజ్ మాత్రమే చెరో వికెట్ పడగొట్టగలిగారు. ఈ రోజు జరిగే మూడోరోజు ఆట లంచ్ విరామానికి ముందే రెండు లేదా మూడు ఇంగ్లండ్ వికెట్లు పడగొట్టగలిగితేనే భారత్ మ్యాచ్ ను అదుపు చేయగలుగుతుంది. అశ్విన్ లేకపోడంతో భారత బౌలింగ్ బలహీన పడిపోడం ఆందోళన కలిగించే విషయం.

First Published:  17 Feb 2024 8:45 AM IST
Next Story