Telugu Global
Sports

అశ్విన్..మరోసారి బౌలర్ నంబర్ వన్!

భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ లో నిలిచాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా ఈ ఘనత సాధించాడు.

అశ్విన్..మరోసారి బౌలర్ నంబర్ వన్!
X

భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ లో నిలిచాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా ఈ ఘనత సాధించాడు.

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ 37 సంవత్సరాల వయసులో బౌలర్ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. ఇప్పటి వరకూ టాప్ ర్యాంక్ లో ఉన్న మరో భారత బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను అశ్విన్ అధిగమించాడు.

ఇంగ్లండ్ తో భారత్, న్యూజిలాండ్ తో ఆస్ట్ర్రేలియాజట్ల టెస్ట్ లీగ్ సిరీస్ ముగిసిన అనంతరం బ్యాటింగ్, బౌలింగ్, టీమ్, ఆల్ రౌండర్ ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది.

2015 తరువాత మరోసారి..

టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం అశ్విన్ కు ఇదే మొదటిసారికాదు. గత పుష్కరకాలంగా భారత టెస్టుజట్టుకు అసాధారణ సేవలు అందిస్తున్న అశ్విన్.కొద్దిరోజుల క్రితమే 100 టెస్టుల మైలురాయిని చేరడంతో పాటు..500 వికెట్ల రికార్డును సైతం సాధించాడు.

2015 డిసెంబర్ లో తొలిసారిగా నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ సాధించిన అశ్విన్ మరోసారి అదే ఘనతను అందుకోడానికి తొమిదేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది.

స్వదేశీగడ్డపై ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టెస్టు లీగ్ సిరీస్ ఆఖరిమ్యాచ్ లో అశ్విన్ 9 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు.

ధర్మశాల వేదికగా ముగిసిన ఆఖరిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో 51 పరుగులిచ్చి 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 77 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

15 స్థానాలు మెరుగైన కుల్దీప్..

భారత మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 15 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని కెరియర్ లో అత్యుత్తమంగా 16వ ర్యాంక్ సాధించగలిగాడు. ఇంగ్లండ్ తో ఆఖరి టెస్టు తొలిఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు పడగొట్టిన కుల్దీప్..అత్యంత వేగంగా 50 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

6వ ర్యాంకులో రోహిత్ శర్మ...

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ లో రెండు శతకాలతో సహా 400కు పైగా పరుగులు సాధించడం ద్వారా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదుస్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగు పరచుకోగలిగాడు. 11వ ర్యాంక్ నుంచి 6వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ 11 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగు పరచుకొని 20వ ర్యాంక్ సాధించాడు. శుభ్ మన్ కెరియర్ లో ఇదే అత్యు్త్తమ టెస్టు బ్యాటర్ ర్యాంకు కావడం విశేషం.

ప్లేయర్ ఆఫ్ ది టెస్టు సిరీస్ విజేత యశస్వీ జైశ్వాల్ రెండుస్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని 8వ ర్యాంక్ లో నిలిచాడు. మొదటి 10 మంది అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్ల జాబితాలో 22 సంవత్సరాల యశస్వీ తొలిసారిగా నిలువగలిగాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో యశస్వీ 712 పరుగులు సాధించడం ద్వారా భారత ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ సరసన నిలువగలిగాడు.

యశస్వి తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 9 టెస్టుల్లో ఓ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు బాదడం ద్వారా 740 రేటింగ్ పాయింట్లు సంపాదించాడు. 147 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు డాన్ బ్రాడ్మన్ ( 752), మైక్ హస్సీ ( 741 పాయింట్లు) మాత్రమే సాధించగా..ఇప్పుడు వారి సరసన యశస్వీ చోటు సంపాదించాడు.

టెస్టు టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్, ఆస్ట్ర్రేలియా మొదటి రెండుస్థానాలలో కొనసాగుతున్నాయి.

First Published:  14 March 2024 10:45 AM IST
Next Story