Telugu Global
Sports

అలుపెరుగని యోధుడు ఈ స్పిన్ మాంత్రికుడు!

భారత క్రికెట్ కు గత 13 ఏళ్లుగా అరుదైన విజయాలు, అసాధారణ రికార్డులు అందిస్తూ వచ్చిన స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టుల మైలురాయికి ఓ మ్యాచ్ దూరంలో నిలిచాడు.

అలుపెరుగని యోధుడు ఈ స్పిన్ మాంత్రికుడు!
X

భారత క్రికెట్ కు గత 13 ఏళ్లుగా అరుదైన విజయాలు, అసాధారణ రికార్డులు అందిస్తూ వచ్చిన స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టుల మైలురాయికి ఓ మ్యాచ్ దూరంలో నిలిచాడు. ధర్మశాల వేదికగా జరిగే ఆఖరిటెస్టు ద్వారా టెస్టుమ్యాచ్ ల శతకం పూర్తి చేయనున్నాడు.

ప్రపంచ క్రికెట్లోకి తమిళనాడు నుంచి దూసుకొచ్చిన మేటి స్పిన్ జాదూ అశ్విన్ గత 13 సంవత్సరాలుగా ఇటు బ్యాటుతోనూ అటు బంతితోనూ ఎన్నో అరుదైన రికార్డులతో పాటు భారతజట్టుకు పలు అపురూప విజయాలు అందించాడు.

క్యారమ్ బాల్, దూస్రా అస్త్రాలుగా...

జాసూ పటేల్, ఇరాపల్లి ప్రసన్న, ఎస్ .వెంకట్రాఘవన్, హర్భజన్ సింగ్ లాంటి ఎందరో గొప్పగొప్ప ఆఫ్ స్పిన్ బౌలర్లను అందించిన భారత స్పిన్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఘనత 37 సంవత్సరాల అశ్విన్ కు మాత్రమే దక్కుతుంది. సాంప్రదాయ ఆఫ్-బ్రేక్ లతో క్యారమ్ బాల్, దూస్రా, టాప్ స్పిన్నర్ లాంటి విలక్షణ అస్త్ర్రాలను మిళతం చేస్తూ ప్రపంచ మేటి బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఘనుడు అశ్విన్. భారత్ కు కేవలం తన ఆల్ రౌండ్ ప్రతిభతోనే గొప్పగొప్ప విజయాలు అందించిన మొనగాడు.

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2011లో తన టెస్టు కెరియర్ ప్రారంభించిన అశ్విన్ గత 13 సంవత్సరాల కాలంలో భారత నంబర్ వన్ స్పిన్నర్ గా నిలుస్తూ వచ్చాడు.

ప్రస్తుత సిరీస్ లోని నాలుగో టెస్టు వరకూ ఆడిన 99 మ్యాచ్ ల్లో అశ్విన్ 507 వికెట్లు పడగొట్టడం ద్వారా అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత టెస్ట్ రెండో బౌలర్ గా ఇప్పటికే అనీల్ కుంబ్లే (610 వికెట్ల ) తర్వాతి స్థానంలో నిలిచాడు. రాంచీటెస్టు రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ కు 35సార్లు ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం ఉంది.

99 టెస్టుల్లో 507 వికెట్లు....

అశ్విన్ ధర్మశాల వేదికగా 100వ టెస్టుమ్యాచ్ ఆడుతూ గతంలో ఇదే ఘనత సాధించిన మరో 13 మంది భారత దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు. శత టెస్టులు ఆడిన భారత 14వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

సాంప్రదాయ టెస్టు చరిత్రలో అత్యధికంగా 200 టెస్టులు ఆడిన ప్రపంచ రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది. 163 టెస్టులతో రాహుల్ ద్రావిడ్, 134 టెస్టులతో వీవీఎస్ లక్ష్మణ్, 132 టెస్టులతో అనీల్ కుంబ్లే, 131 టెస్టులతో కపిల్ దేవ్ మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.

125 టెస్టులతో సునీల్ గవాస్కర్, 116 టెస్టులతో దిలీప్ వెంగ్ సర్కార్, 113 టెస్టులతో సౌరవ్ గంగూలీ, 105 టెస్టులతో ఇశాంత్ శర్మ, 103 టెస్టులతో హర్భజన్ సింగ్, 103 టెస్టులతో చతేశ్వర్ పూజారా, 103 టెస్టులతో వీరేంద్ర సెహ్వాగ్ వందటెస్టుల క్లబ్ లో చేరిన భారత క్రికెటర్లుగా ఉన్నారు.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 'డబుల్' రికార్డు..

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 100 వికెట్లు , 1000 పరుగులు సాధించిన భారత ఏకైక బౌలర్ గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. తన కెరియర్ లో 200 మందికి పైగా ఎడమచేతి వాటం బ్యాటర్లను పడగొట్టిన ఘనత సైతం అశ్విన్ కు ఉంది.

వందోటెస్టు ఆడే సమయానికే ముత్తయ్య మురళీధరన్ 584 వికెట్లు పడగొడితే, అశ్విన్ 507 వికెట్లతో 51.3 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. అశ్విన్ సాధించిన మొత్తం 507 వికెట్లలో 214 మందిని క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారాను, 113 మందిని ఎల్బీడబ్లుగాను పడగొట్టాడు. 74 మందిని డకౌట్లుగా అవుట్ చేసిన రికార్డు సైతం అశ్విన్ కు మాత్రమే సొంతం. కొత్తబంతితో భారత బౌలింగ్ ను ప్రారంభించిన సమయంలో అశ్విన్ 44 టెస్టుల్లో 170 వికెట్లు సాధించాడు.

స్వదేశంలో ఎదురులేని అశ్విన్...

స్వదేశంలో ఆడిన టెస్టు సిరీస్ ల్లో అశ్విన్ విశ్వరూపమే ప్రదర్శించాడు. భారతగడ్డపై ఆడిన 59 టెస్టుల్లో 44 విజయాలు అందించాడు. భారత్ కేవలం ఆరు పరాజయాలు మాత్రమే చవిచూసింది.

విదేశీగడ్డపై భారత్ సాధించిన 23 టెస్టు విజయాలలోనూ అశ్విన్ తనవంతు పాత్ర నిర్వర్తించాడు. భారత్ సాధించిన 58 విజయాలలో అశ్విన్ 354 వికెట్లు పడగొట్టాడు. ప్రతి 43 బంతులకూ ఓ వికెట్ చొప్పున సాధించడం విశేషం. 2012-13 తర్వాత నుంచి స్వదేశంలో భారత్ ఆడిన 20 సిరీస్ ల్లో అశ్విన్ పాల్గొనడం ద్వారా అశ్విన్ 30.41 సగటుతో 3.95 ఎకానమీ నమోదు చేశాడు.

అశ్విన్ తన 13 సంవత్సరాల టెస్ట్ కెరియర్ లో ఏడాదికి 50కి పైగా వికెట్లు నాలుగు క్యాలెండర్ సంవత్సరాలలో సాధించాడు. 2015లో 62, 2016లో 72 వికెట్లు, 2017లో 56 వికెట్లు, 2021లో 54 వికెట్లు సాధించిన రికార్డు అశ్విన్ కు మాత్రమే సొంతం.

టెస్టు క్రికెట్లో 5 వికెట్లు పడగొట్టడం తో పాటు సెంచరీలను మూడుసార్లు నమోదు చేసిన భారత ఏకైక ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మాత్రమే. తొమ్మిదిసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొన్నాడు.

టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500 వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ అశ్విన్ మాత్రమే. ధర్మశాల వేదికగా జరిగే ప్రస్తుత సిరీస్ ఆఖరి టెస్టు ద్వారా వంద టెస్టుల రికార్డు చేరనున్న అశ్విన్ చెలరేగిపోవాలని, తన నూరవ టెస్టును చిరస్మరణీయంగా మిగుల్చుకోవాలని కోరుకొందాం..

First Published:  6 March 2024 10:37 AM IST
Next Story