Telugu Global
Sports

నిబద్దతకు నిలువుటద్దం రాహుల్ ద్రావిడ్!

భారత క్రికెట్ మాజీ శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తన వ్యక్తిత్వాన్ని ఎవరెస్టు ఎత్తుకు పెంచుకొన్నాడు. నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచాడు.

నిబద్దతకు నిలువుటద్దం రాహుల్ ద్రావిడ్!
X

భారత క్రికెట్ మాజీ శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తన వ్యక్తిత్వాన్ని ఎవరెస్టు ఎత్తుకు పెంచుకొన్నాడు. నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచాడు.

క్రికెటర్ గా..భారత మాజీ కెప్టెన్ గా, ప్రధాన శిక్షకుడుగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన రాహుల్ ద్రావిడ్ వ్యక్తిత్వం ఉన్నతశిఖరాలను తాకింది. నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, ముక్కుసూటి తత్వంతో తనకుతానే సాటిగా నిలిచిన రాహుల్ ద్రావిడ్ వ్యక్తిత్వానికి ఫిదా కాని ఆటగాళ్లు, అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

రాహుల్ ను అభిమానించడమే కాదు..ఆరాదించే వారు కోకొల్లలు.

చీఫ్ కోచ్ గా తనకు తానే సాటి...

2021 లో రవి శాస్త్ర్రి నుంచి భారత జట్టు ప్రధాన శిక్షకుడి పగ్గాలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్ గత మూడేళ్లకాలంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టును ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్స్ చేర్చగలిగాడు. అంతేకాదు..ఐసీసీ టెస్టు లీగ్, ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలలో రన్నరప్ స్థానాలు అందించడమే కాదు..ఇటీవలే ముగిసిన ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ ను ఏకంగా విశ్వవిజేతగా నిలిపాడు.

రోహిత్ శర్మ కెప్టెన్ గా, రాహుల్ ప్రధాన శిక్షకుడుగా భారత్ 13 సంవత్సరాల విరామం తరువాత ఓ ఐసీసీ ట్రోఫీని, 17 సంవత్సరాల తరువాత టీ-20 ప్రపంచకప్ ను అందుకోగలిగింది.

సహశిక్షకుల కోసం.....

టీ-20 ప్రపంచకప్ గెలుచుకొన్న భారతజట్టుకు బీసీసీఐ 125 కోట్ల రూపాయలను నజరానాగా ప్రకటించింది. భారత జట్టులోని మొదటి 15 మంది ఆటగాళ్లకు 5 కోట్ల రూపాయలు చొప్పున, రిజర్వ్ ఆటగాళ్లకు కోటి రూపాయలు చొప్పున, ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ కు 5 కోట్లు, సహాయ శిక్షకులు ముగ్గురికి 2.5 కోట్లు రూపాయలు, ఇతర సహాయక సిబ్బందికి కోటి రూపాయలు చొప్పున బీసీసీఐ అందచేయాలని నిర్ణయించింది.

అయితే...జట్టు విజయంలో తనతో సమానంగా పాటుపడిన సహాయక సిబ్బంది అందరికీ సమానంగా బీసీసీఐ నజరానా అందాలని, తానొక్కడే ఐదుకోట్ల రూపాయలు తీసుకోడం ఏమాత్రం సబబు కాదంటూ ద్రావిడ్ ప్రకటించాడు. తన 5 కోట్ల రూపాయల్లో సగం ( 2 కోట్ల 50 లక్షల) మొత్తాన్ని మిగిలిన సిబ్బందికి సమంగా పంచాలని సూచించాడు. సహాయ శిక్షకులు, సహాయక సిబ్బంది అందరమూ సమానమేనని..తానేమీ గొప్పకాదంటూ ద్రావిడ్ స్పష్టం చేయడం ద్వారా తన గొప్పమనసుని మరోసారి చాటుకొన్నాడు.

సహాయక సిబ్బందికి ప్రకటించిన మొత్తాన్ని తనకు లభించిన బోనస్ లోని సగంతో కలిపి అందరికీ సమంగా పంచాలని ద్రావిడ్ సూచించాడు. మరోవైపు బీసీసీఐ సైతం ద్రావిడ్ సెంటిమెంట్ ను తాము గౌరవిస్తున్నామంటూ బదులిచ్చింది.

బ్యాటింగ్ , బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు 2.5 కోట్ల చొప్పున, తనకు మాత్రం 5 కోట్ల రూపాయలు బోనస్ గా ఇవ్వడం సమర్ధనీయం కాదని, నలుగురు శిక్షకులకూ సమానంగా ఒకే మొత్తం అందాలని ద్రావిడ్ పట్టు బట్టాడు.

ఇదే మొదటిసారి కాదు....

జట్టుకు లభించిన నజరానా అందరికి సమంగా పంచాలని, జట్టు ప్రపంచ చాంపియన్ గా నిలవడానికి అందరూ సమానంగా కష్టపడినప్పుడు ఫలాలను సైతం అందరూ సమంగా పంచుకోవాలన్నది రాహుల్ ద్రావిడ్ సిద్ధాతం.

2018 జూనియర్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారతజట్టు ప్రపంచ టైటిల్ సాధించిన సమయంలో రాహుల్ ద్రావిడ్ శిక్షకుడిగా ఉన్నాడు. అప్పట్లో ద్రావిడ్ కు 50 లక్షలు, ఇతర సహాయక శిక్షకులకు 20 లక్షల రూపాయల చొప్పున బీసీసీఐ బోనస్ గా ప్రకటించింది. అయితే..ద్రావిడ్ మాత్రం తానొక్కడే 50 లక్షలు తీసుకొని, మిగిలిన వారికి 20 లక్షల చొప్పున ఇవ్వటానికి ససేమిరా అన్నాడు. దీంతో బీసీసీఐ దిగివచ్చి..శిక్షణ బృందంలోని సభ్యులందరికీ తలో 25 లక్షల రూపాయల చొప్పన అందచేసింది. వాస్తవానికి 50 లక్షలు అందుకోవాల్సిన ద్రావిడ్ 25 లక్షలతో సంబరపడిపోయాడు.

సీనియర్ ప్రపంచకప్ నెగ్గడంతో తనకు లభించిన 5 కోట్ల రూపాయల బోనస్ లో సగభాగాన్ని మిగిలిన ముగ్గురు ( విక్రమ్ రాథోడ్, పరస్ మాంబ్రే, సునీల్ ) సహాయ శిక్షకులకు పంచాలని నిర్ణయంచడం రాహుల్ నిబద్ధతకు నిదర్శనం.

తమకు దక్కితేచాలు..మిగిలినవారు ఏమైపోతేనేం అనుకొనే మనుషులున్న ఈ రోజుల్లో రాహుల్ ద్రావిడ్ లాంటి వ్యక్తులను చూడటగలగడం నిజంగా అదృష్టమే మరి.

.

First Published:  10 July 2024 5:09 PM IST
Next Story