Telugu Global
Sports

రోహిత్ శర్మ వ్యక్తిత్వానికి రాహుల్ ద్రావిడ్ ఫిదా!

భారత కెప్టెన్, టీ-20 ప్రపంచకప్ విజేత రోహిత్ శర్మను జట్టు ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ ఆకాశానికి ఎత్తేశాడు. రోహిత్ పై ప్రశంసల వర్షంతో పాటు.. అంతులేని వాత్సల్యం చూపాడు.

రోహిత్ శర్మ వ్యక్తిత్వానికి రాహుల్ ద్రావిడ్ ఫిదా!
X

భారత కెప్టెన్, టీ-20 ప్రపంచకప్ విజేత రోహిత్ శర్మను జట్టు ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ ఆకాశానికి ఎత్తేశాడు. రోహిత్ పై ప్రశంసల వర్షంతో పాటు.. అంతులేని వాత్సల్యం చూపాడు....

భారతజట్టుకు 13 సంవత్సరాల విరామం తరువాత తొలి ఐసీసీ ప్రపంచకప్ ను అందించిన ప్రధాన శిక్షకుడు, మాజీ కెప్టెన్, ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ కు పలువురు క్రికెటర్లతో సహా కోట్లాదిమంది అభిమానులున్నారు. ద్రావిడ్ అంటే చెప్పలేని గౌరవం చూపేవారు కోకొల్లలు. తెలివైన క్రికెటర్ గా, మృదుస్వభావిగా, వివాదరహితుడుగా పేరుపొందిన ద్రావిడ్ భారత కెప్టెన్ గా, క్రికెటర్ గా సాధించలేనిది..చీఫ్ కోచ్ గా సాధించాడు. అయితే..ఈ ఘనత అంతా కెప్టెన్ రోహిత్ శర్మ వల్లనే సాధ్యపడిందంటూ మురిసిపోతున్నారు. ఒక్కసారిగా రోహిత్ శర్మకు అభిమానిగా మారిపోయారు.

రోహిత్ మాటతోనే మనసు మార్చుకొన్నా...

మూడేళ్ల క్రితం విరాట్ కొహ్లీ నుంచి రోహిత్ శర్మ భారత కెప్టెన్సీ పగ్గాలు అందుకొంటే...జట్టు ప్రధాన శిక్షకుడు బాధ్యతల్ని రవిశాస్త్రి నుంచి రాహుల్ ద్రావిడ్ తీసుకొన్నారు.

రోహిత్- ద్రావిడ్ భాగస్వామ్యంలో గత మూడేళ్లకాలంలో భారత్ క్రికెట్ మూడు విభాగాలలోనూ ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలవడంతో పాటు..మూడు ఫార్మాట్లలోనూ ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్స్ చేరుకోగలిగింది.

ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్స్, ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్, ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ చేరిన భారతజట్టు..టెస్టులీగ్, వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ లో మాత్రం ఆస్ట్ర్రేలియా చేతిలో పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. చివరకు రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్ ఓటమి పొందడంతోనే చీఫ్ కోచ్ బాధ్యత నుంచి తప్పుకోవాలని రాహుల్ ద్రావిడ్ నిర్ణయించాడు. అయితే..రోహిత్ శర్మ మాత్రం ఫోను ద్వారా సంప్రదించి..టీ-20 ప్రపంచకప్ వరకూ ప్రధాన శిక్షకుడుగా కొనసాగాలని వేడుకొన్నాడు. రోహిత్ మాట కాదనలేక తాను చీఫ్ కోచ్ గా కొనసాగానని, ఇప్పుడు టీ-20 ప్రపంచకప్ సాధించడం తనకు అంతులేని సంతృప్తిని, గౌరవాన్ని ఇచ్చిందని, ఇదంతా కేవలం రోహిత్ సేన వల్లనే సాధ్యమయ్యిందంటూ ద్రావిడ్ భావోద్వేగానికి గురయ్యారు.

గొప్పమనసున్న మనిషి రోహిత్- ద్రావిడ్

రోహిత్ శర్మ గొప్ప ఓపెనర్ గా, భారత కెప్టెన్ గా గొప్పరికార్డులు, విజయాలు సాధించినా..తన వరకూ ఓ మనిషిగా చెప్పలేని ఇష్టమని, రోహిత్ వ్యక్తిత్వానికి తాను ముగ్దుడనయ్యానని, రోహిత్ తో కలసి పనిచేయడం తనకు లభించిన గొప్ప అదృష్టమంటూ ద్రావిడ్ మురిసిపోయాడు.

రోహిత్ తనను ఎంతో మర్యాదగా చూసుకొన్నాడని, తన పట్ల ఎంతో గౌరవం, శ్రద్దచూపాడని, భారతజట్టు కెప్టెన్ గా, ఓపెనర్ గా ఎంతో బాధ్యతతో వ్యవహరించాడని, సహఆటగాళ్లను ప్రేమతో చూసుకొంటూ ఆదరించాడంటూ కొనియాడారు. రోహిత్ కలసి పనిచేసిన ఈ మూడేళ్లకాలాన్ని తాను జీవితకాలం గుర్తుంచుకొంటానని, క్రికెటర్లకు సాధించిన విజయాలు, రికార్డుల కంటే అనుభవాలు, అనుభూతులు ప్రధానమని హితవు పలికారు.

రోహిత్ సేనకు ద్రావిడ్ హ్యాట్సాఫ్...

ప్రపంచకప్ కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులకూ పేరు పేరునా ద్రావిడ్ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. జట్టులోని ప్రతిఆటగాడూ అమూల్యమేనని, తమవంతు బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారని, గత కొద్దిమాసాలుగా ఎన్నో త్యాగాలు చేసి..ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసుకొన్నారు. ప్రపంచకప్ ఫైనల్లో మొదటి ఆరు ఓవర్లలోనే మూడు టాపార్డర్ వికెట్లు నష్టపోయినా..తరువాతి బ్యాటర్లు పోరాడిన తీరు అసమానమంటూ ప్రశంసించారు.

కరీబియన్ ద్వీపాలు వేదికగానే 2007లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలోనే భారత్ పోటీకి దిగి తొలిరౌండ్లోనే ఓటమి చవిచూసింది.

అయితే..అదే కరీబియన్ ద్వీపాలు వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ లో మాత్రం జట్టు ప్రధాన శిక్షకుడిగా భారత్ ను ప్రపంచ చాంపియన్ గా ద్రావిడ్ నిలపడం ఓ గొప్పఘనతగా మిగిలిపోతుంది.

ఓడిన చోటే లేచి నిలబడి నెగ్గాలని, పోగొట్టుకొన్న చోటే వెతుక్కోవాలనటానికి ద్రావిడ్ ను మించిన నిదర్శనం మరొకటి ఉండదు.

2021 సెప్టెంబర్ 21న భారత చీఫ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్ 2024 జూన్ 29 వరకూ కొనసాగి..ఓ ఐసీసీ ప్రపంచకప్, రెండు రన్నరప్ ట్రోఫీలు అందించగలిగారు.

అత్యంత విజయవంతమైన ' మేడిన్ ఇండియా' క్రికెట్ శిక్షకుల్లో ఒకడిగా ద్రావిడ్ మిగిలిపోతారు.

First Published:  4 July 2024 4:00 AM GMT
Next Story