ఆసియా బ్యాడ్మింటన్లో ముగిసిన భారత్ పోటీ!
2024-ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత షట్లర్ల పోరు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ముగిసింది. టాప్ స్టార్లు సింధు, ప్రణయ్ లకు సైతం పరాజయాలు తప్పలేదు.
2024-ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత షట్లర్ల పోరు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ముగిసింది. టాప్ స్టార్లు సింధు, ప్రణయ్ లకు సైతం పరాజయాలు తప్పలేదు.
పారిస్ ఒలింపిక్స్ కు అర్హతగా చైనాలోని నాంగ్ బో వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల, మహిళల విభాగాలలో భారత షట్లర్ల పోటీ ముగిసింది.
ఏప్రిల్ 28న ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ ప్రకటించనున్న నేపథ్యంలో జరిగిన ఈ టోర్నీలో భారత ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి 16 ర్యాంకుల్లో నిలిచినవారికి మాత్రమే పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ప్రణయ్, డబుల్స్ జోడీకి ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం...
ప్రస్తుత ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మెరుగైన తమ ర్యాంకింగ్స్ ఆధారంగా డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి తో పాటు..పురుషుల సింగిల్స్ లో 9వ ర్యాంకర్ హెచ్ ఎస్ ప్రణయ్ సైతం పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగారు.
అయితే..చైనా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో మెరుగైన ఫలితాలు సాధించి ఉంటే మరికొందరు భారత షట్లర్లకు ఒలింపిక్స్ బెర్త్ లు దక్కి ఉండేవే.
తొలిరౌండ్లో వారు...ప్రీ-క్వార్టర్స్ లో వీరు...
ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లోనే లక్ష్యసేన్, కిడాంబీ శ్రీకాంత్ పరాజయాలు పొందటం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ లకు దూరమయ్యారు.
అయితే..తొలిరౌండ్ విజయాలు సాధించిన ప్రణయ్, సింధుల పోటీ మాత్రం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ముగిసింది.
మహిళల డబుల్స్ లో అశ్వనీ పొన్నప్ప- తనీషా క్రాస్టోలు సైతం పరాజయం పొందారు.
పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో చైనీస్ తైపీ స్టార్ ప్లేయర్, 19వ ర్యాంకర్ లిన్ చున్ 21-18, 21-11తో 9వ ర్యాంకర్ ప్రణయ్ పై సంచలన విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్ లో చైనా ప్లేయర్ హాన్ యూ మూడుగేమ్ ల పోరులో 21-18, 13-21, 21-17తో సింధును కంగు తినిపించింది.
ఈ టోర్నీకి ముందు వరకూ హాన్ ప్రత్యర్థిగా సింధుకు 5-0 విజయాల రికార్డు ఉంది.
మహిళల డబుల్స్ లో తొలిరౌండ్ బై తో నేరుగా ప్రీ-క్వార్టర్స్ చేరిన అశ్వినీ- తనీషా జోడీకి 3వ సీడ్ నమీ మత్సుయామా- చిహారు షిడాల చేతిలో 17-21,12-21తో ఓటమి ఎదురయ్యింది.
2023 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో బంగారు పతకం సాధించిన భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్..ప్రస్తుత టోర్నీకి మాత్రం దూరంగా ఉన్నారు.
దీంతో భారత్ కనీసం ఒక్క పతకమూ నెగ్గకుండానే టోర్నీ నుంచి నిష్క్ర్రమించాల్సి వచ్చింది.