Telugu Global
Sports

కర్నాటక కుర్రోడి జోరు...యువరాజ్ 24 ఏళ్ళ రికార్డు బద్ధలు!

భారత దేశవాళీ క్రికెట్లోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న 24 ఏళ్ళ రికార్డు ఎట్టకేలకు బద్దలయ్యింది.

కర్నాటక కుర్రోడి జోరు...యువరాజ్ 24 ఏళ్ళ రికార్డు బద్ధలు!
X

భారత దేశవాళీ క్రికెట్లోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న 24 ఏళ్ళ రికార్డు ఎట్టకేలకు బద్దలయ్యింది.

క్రికెట్లో రికార్డులు సర్వసాధారణమే. అయితే..అసాధారణ, అపురూపమైన రికార్డులు మాత్రం ఎప్పుడో కాని నమోదు కావు. ఊహలకు అందని అలాంటి గొప్ప రికార్డును కర్నాటక కుర్రోడు, 18 సంవత్సరాల ప్రకార్ చతుర్వేది నెలకొల్పాడు.

636 బంతుల్లో 404 పరుగుల నాటౌట్....

2024సీజన్ అండర్ -19 క్రికెట్ టోర్నీలో భాగంగా ముంబైతో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్ లో కర్నాటక ఓపెనర్, 18 సంవత్సరాల ప్రకార్ చతుర్వేదీ ఏకంగా 404 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా సంచలనం సృష్టించాడు.

శివమొగ్గ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా...ఓ అనూహ్యమైన రికార్డుకు చిరునామాగా మాత్రం మిగిలింది. ముంబై తొలిఇన్నింగ్స్ స్కోరు 380 పరుగులకు సమాధానంగా కర్నాటక 223 ఓవర్లలో 8 వికెట్లకు 890 పరుగుల స్కోరుతో డిక్లేర్ చేసింది.

కర్నాటక ఓపెనర్ గా క్రీజులోకి అడుగుపెట్టిన ప్రకార్ ఎనలేని ఏకాగ్రతకు నైపుణ్యాన్ని జోడించి ఆడి 636 బంతులు ఎదుర్కొని అజేయంగా నిలిచాడు. 46 ఫోర్లు, 3 సిక్సర్ షాట్లతో 404 పరుగుల స్కోరుతో నాటౌట్ గా మిగిలాడు.

1999లో యువరాజ్, 2024లో ప్రకార్....

1999 కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్ లో భాగంగా ధోనీ సభ్యుడిగా ఉన్న బీహార్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ తరపున యువరాజ్ సింగ్ 358 పరుగులతో సాధించిన స్కోరే ఇప్పటి వరకూ టోర్నీ ఫైనల్లో అత్యధిక స్కోరుగా ఉంటూ వచ్చింది. గత 24 ఏళ్లుగా యువరాజ్ సింగ్ పేరుతో ఉంటూ వచ్చిన అరుదైన ఆ రికార్డును ప్రకారం 404 పరుగుల నాటౌట్ స్కోరుతో తెరమరుగు చేశాడు.

భారత అండర్ -19 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డు మహారాష్ట్ర్ర ఆటగాడు విజయ్ జోల్ పేరుతో ఉంది. 2011-12 కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్ లో భాగంగా అసోం పై విజయ్ జోల్ 451 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. అదే ఇప్పటి వరకూ అత్యధికస్కోరు రికార్డుగా ఉంది.

ప్రకార్ తో కలసి కీలక భాగస్వామ్యం నమోదు చేసిన హర్షిల్ ధమానీ 179 పరుగులతో రెండో అత్యధిక స్కోరు సాధించిన కర్నాటక బ్యాటర్ గా నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ ఆల్ టైమ్ గ్రేట్ బ్రియన్ లారా సాధించిన 400 పరుగుల ప్రపంచ రికార్డును భారత దేశవాళీ క్రికెట్లో ప్రకార్ చతుర్వేదీ సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 404 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం అంటే మాటలా మరి. అదీ 18 సంవత్సరాల వయసులో ఈ ఘనత సాధించడం అపూర్వమే.

First Published:  16 Jan 2024 10:05 AM IST
Next Story