Telugu Global
Sports

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో భారత్ సరికొత్త చరిత్ర!

2024- పారిస్ ఒలింపిక్స్ నాలుగోరోజున భారత్ మరో కాంస్య పతకం సాధించింది. పిస్టల్ షూటింగ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారతజోడీ మను బాకర్- సరబ్ జోత్ సింగ్ కాంస్యం సాధించడం ద్వారా భారత్ పతకాల సంఖ్యను రెండుకు పెంచారు.

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో భారత్ సరికొత్త చరిత్ర!
X

పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్లు చరిత్ర సృష్టించారు. మూడురోజుల్లో రెండో కాంస్యపతకంతో సరికొత్త రికార్డు నెలకొల్పారు.

2024- పారిస్ ఒలింపిక్స్ నాలుగోరోజున భారత్ మరో కాంస్య పతకం సాధించింది. పిస్టల్ షూటింగ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారతజోడీ మను బాకర్- సరబ్ జోత్ సింగ్ కాంస్యం సాధించడం ద్వారా భారత్ పతకాల సంఖ్యను రెండుకు పెంచారు.

కొరియా జోడీ పై 16-10తో గెలుపు...

ఏర్ పిస్టల్ 10 మీటర్ల మిక్సిడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం రౌండ్లో అడుగుపెట్టిన మను-సరబ్ జోత్ సింగ్ జోడీ ప్రత్యర్థి కొరియాజంట లీ వాన్ హో- ఏ జిన్ లను 16-10 పాయింట్లతో చిత్తు చేయడం ద్వారా పతకం సాధించగలిగారు.

ఒలింపిక్స్ షూటింగ్ చరిత్రలో భారత షూటర్లు మూడురోజుల వ్యవధిలో రెండు కాంస్య పతకాలు సాధించడం ఇదే మొదటిసారి.

మను బాకర్ 'డబుల్' రికార్డు..

ఏర్ పిస్టల్ మహిళల షూటింగ్ లో భారత సంచలనం, 22 ఏళ్ల మను బాకర్ ఓ అరుదైన ఘనత సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత తొలి , ఏకైక మహిళ, అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది.

పారిస్ ఒలింపిక్స్ రెండోరోజు పోటీలలో మహిళల 10 మీటర్ల ఏర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకంతో బోణీ కొట్టిన మను బాకర్...మిక్సిడ్ టీమ్ విభాగంలో సైతం కాంస్య పతకంతో అరుదైన రికార్డు నెలకొల్పగలిగింది.

మల్లీశ్వరి నుంచి మను బాకర్ వరకూ...

12 దశాబ్దాల భారత ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి మహిళ ఘనతను కరణం మల్లీశ్వరి సాధిస్తే..రెండు వేర్వేరు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మహిళగా మరో తెలుగుతేజం పీవీ సింధు నిలిచింది.

అయితే..ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత తొలి మహిళగా మను బాకర్ రికార్డుల్లో చోటు సంపాదించడమే కాదు..తనకు తానే సాటిగా నిలిచింది. 25 మీటర్ల విభాగంలో సైతం మరో రెండు పతకాల కోసం మను బాకర్ పోటీపడాల్సి ఉంది.

బ్యాడ్మింటన్ డబుల్స్ క్వార్టర్స్ లో భారతజోడీ...

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి అలవోకగా చేరుకొన్నారు. ఒలింపిక్స్ చరిత్రలో క్వార్టర్స్ చేరిన భారత తొలి బ్యాడ్మింటన్ జంటగా నిలిచారు.

గ్రూపు లీగ్ రెండోరౌండ్లో భారత జోడీతో తలపడాల్సిన జర్మన్ జంట మార్క్- మార్విన్ గాయంతో ఉపసంహరించుకోడంతో క్వార్టర్స్ లో చోటు ఖాయం చేసుకోగలిగారు. గ్రూపు తొలిరౌండ్ పోరులో ఫ్రెంచ్ జోడీ లూకాస్- రోనాన్ లాబోర్ లను చిత్తు చేసిన సాత్విక్- చిరాగ్..తమ ఆఖరి గ్రూపు పోటీలీ ఇండోనీసియాకు చెందిన మహ్మద్ రియాన్- ఫజర్ అల్ఫాన్ లతో పోటీపడాల్సి ఉంది.

సాత్విక్- చిరాగ్ 3వ ర్యాంక్ లో ఉంటే..ఇండోనీషియాజోడీ 7వ ర్యాంక్ లో ఉన్నారు.

పురుషుల సింగిల్స్ లో భారత యువఆటగాడు లక్ష్యసేన్ తొలివిజయం నమోదు చేశాడు. వాస్తవానికి తన తొలిరౌండ్ గేమ్ లో గ్వాటెమాల ఆటగాడిపై నెగ్గినా..నిర్వాహక సంఘం..ఆ విజయాన్ని సాంకేతిక కారణాలతో రికార్డుల నుంచి తొలగించింది.

గ్రూప్ రెండోరౌండ్ మ్యాచ్ లో బెల్జియం ఆటగాడు జూలియన్ క్యారజ్జీని లక్ష్యసేన్ 21-19, 21-14 పాయింట్లతో కేవలం 43 నిముషాలలోనే చిత్తు చేయగలిగాడు. తన ఆఖరి గ్రూప్ లీగ్ పోటీలో ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడు, ఇండోనీషియా స్టార్ జోనాథన్ క్రిస్టీతో లక్ష్యసేన్ తలపడాల్సి ఉంది. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ చేరాలంటే లక్ష్య తన ఆఖరి రౌండ్ మ్యాచ్ నెగ్గి తీరాల్సి ఉంది.

టీటీ మహిళల సింగిల్స్ లో మనీకా సంచలనం..

టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ కు భారత స్టార్ ప్లేయర్ మనీకా బాత్రా చేరుకొంది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా నిలిచింది. గ్రూపులీగ్ పోరులో ఫ్రాన్స్ కు చెందిన భారత సంతతి ప్లేయర్, 18వ ర్యాంకర్ ప్రతీకా పవాడేను 4-0తో మనీకా చిత్తు చేసింది.

29 ఏళ్ల మనీకా 11-9, 11-6, 11-9, 11-7తో విజేతగా నిలిచింది. గత ఒలింపిక్స్ లో ఆఖరి 32 రౌండ్లో ఓటమి పొందిన మనీకా ప్రస్తుత ఒలింపిక్స్ లో ఆఖరి -16 ( ప్రీ-క్వార్టర్స్ ) చేరుకోడం విశేషం.

పురుషుల హాకీలో భారత్ గ్రేట్ ఎస్కేప్....

పురుషుల హాకీ గ్రూప్ - బీ లీగ్ రెండోరౌండ్ పోరులో భారత్ ఓటమి అంచుల నుంచి బయటపడి 1-1తో మాజీ చాంపియన్ అర్జెంటీనాను నిలువరించగలిగింది. తన తొలిపోరులో

న్యూజిలాండ్ పై ఆఖరి నిముషం గోలుతో 3-2తో నెగ్గిన భారత్..కీలక రెండోరౌండ్ మ్యాచ్ లో సైతం అర్జెంటీనాపై ఆట ముగిసే క్షణాలలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించడంతో 1-1తో డ్రాగా ముగించడం ద్వారా పాయింట్లు పంచుకోగలిగింది.

తన మూడోరౌండ్ పోరులో ఐర్లాండ్ తో భారత్ పోటీపడాల్సి ఉంది. ఆఖరి రెండురౌండ్లలో డిఫెడింగ్ చాంపియన్ బెల్జియం, ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాలతో భారత్ తలపడనుంది.

పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్స్ సెమీస్ లో బల్రాజ్ పన్వర్, బాక్సింగ్ లో అమిత్ పంగల్, జాస్మిన్ లాంబోరియా, ప్రీతి పన్వర్ నాలుగోరోజు పోటీలలో పోటీకి దిగనున్నారు.

First Published:  30 July 2024 9:56 AM GMT
Next Story