Telugu Global
Sports

భారత ఒలింపిక్స్ బృందంలో హర్యానా, పంజాబ్ అథ్లెట్ల హవా!

2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి 117 మంది అథ్లెట్లలోని తొలి బృందం పారిస్ ఒలింపిక్స్ విలేజ్ లో అడుగుపెట్టింది. భారతబృందంలో పంజాబ్, హర్యానా రాష్ట్ర్రాలకు చెందిన క్రీడాకారులే ఎక్కువ మంది ఉన్నారు.

భారత ఒలింపిక్స్ బృందంలో హర్యానా, పంజాబ్ అథ్లెట్ల హవా!
X

2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి 117 మంది అథ్లెట్లలోని తొలి బృందం పారిస్ ఒలింపిక్స్ విలేజ్ లో అడుగుపెట్టింది. భారతబృందంలో పంజాబ్, హర్యానా రాష్ట్ర్రాలకు చెందిన క్రీడాకారులే ఎక్కువ మంది ఉన్నారు.

జనాభా పరంగా ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత్ కేవలం 117 మంది అథ్ల్లెట్లతోనే పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగుతోంది.జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ ఈ విశ్వక్రీడాసంరంభం జరుగనుంది.

10 పతకాలు లక్ష్యంగా భారత్ పోటీ..

2020 టోక్యో ఒలింపిక్స్ లో ఓ స్వర్ణంతో సహా ఏడు పతకాలు సాధించిన భారత్ ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం రెండంకెల స్థాయిలో పతకాలు సాధించాలన్న లక్ష్యంతో అథ్లెట్లను సిద్ధం చేసింది. కనీసం 10 పతకాలు సాధించాలని భారత ఒలింపిక్స్ సంఘం భావిస్తోంది.

2024 ఒలింపిక్స్ లో మొత్తం 33 రకాల క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తుంటే భారత అథ్లెట్లు మాత్రం 16 క్రీడలకు చెందిన 69 అంశాలలో పాల్గొనటానికి అర్హత సంపాదించారు.

కేవలం 95 పతకాల కోసమే భారత అథ్లెట్లు పోటీపడాల్సి ఉంది.

చిన్నరాష్ట్ర్రాల నుంచి భారీసంఖ్యలో అథ్లెట్ల అర్హత...

140 కోట్ల జనాభా కలిగిన భారత్ లోని 30కి పైగా రాష్ట్ర్రాలకు చెందిన క్రీడాకారులు ఒలింపిక్స్ బరిలో నిలువబోతున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్ర్రాలు ఉత్తరప్రదేశ్ , బీహార్ నుంచి తక్కువ సంఖ్యలోనూ, చిన్నరాష్ట్ర్రాలు పంజాబ్, హర్యానాల నుంచి పెద్దసంఖ్యలోనూ అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.

మొత్తం 117 మంది భారత అథ్లెట్లలో 70 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారు.

దేశంలోని అతిచిన్న రాష్ట్ర్రాలలో ఒకటైన హర్యానా నుంచి అతిపెద్ద సంఖ్యలో 24మంది అథ్లెట్లు భారతజట్టులో చోటు సంపాదించగలిగారు. 19 మంది అథ్లెట్లతో పంజాబ్ రెండు, 13 మంది అథ్లెట్లతో తమిళనాడు మూడు స్థానాలలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు మాత్రమే...

ఐదుకోట్ల జనాభాతో దేశంలోని అతిపెద్ద రాష్ట్ర్రాలలో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన నలుగులు అథ్ల్టెట్లు మాత్రమే పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సాధించగలిగారు.

వీరిలో రికర్వ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర, 100 మీటర్ల హర్డల్స్ రేస్ లో తొలిసారిగా పాల్గొనబోతున్న జ్యోతి యర్రాజీ, మహిళల 400 మీటర్ల రిలేలో పాల్గొనబోతున్న జ్యోతికా శ్రీ దండి, బ్యాడ్మింట డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ ఉన్నారు.

తెలంగాణాకు చెందిన శ్రీజ ఆకుల మహిళల టేబుల్ టెన్నిస్, మహిళల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు, షూటర్ ఈషా సింగ్ పోటీకి దిగుతున్నారు.

రోహన్ 44, ధినిధి 14.....

మొత్తం 117 మంది సభ్యుల భారత బృందంలో తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న లేలేత అథ్లెట్ల నుంచి ఆరోసారి పాల్గొనబోతున్న మహాముదురు క్రీడాకారులు సైతం ఉన్నారు.

భారత అథ్లెట్ల బృందంలో అత్యంత పెద్ద వయస్కుడుగా టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న నిలిచాడు. రోహన్ 44 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ బరిలో దిగబోతున్నాడు. 2012 ఒలింపిక్స్ లో మహేశ్ భూపతితో జంటగా పురుషుల డబుల్స్ లో పోటీకి దిగి రెండోరౌండ్లో ఓటమి చవిచూశాడు.

2016 ఒలింపిక్స్ లో లియాండర్ పేస్ తో జంటగా డబుల్స్ లో పాల్గొని తొలిరౌండ్లోనే పరాజయం పొందాడు. 2022 టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన రోహన్ నాలుగేళ్ల విరామం తరువాత తిరిగి పారిస్ ఒలింపిక్స్ కు ప్రపంచ 4వ ర్యాంక్ ప్లేయర్ హోదాలో అర్హత సంపాదించగలిగాడు.

ప్రపంచ 62వ ర్యాంకర్ శ్రీరామ్ బాలాజీతో జంటగా పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ పతకం వేటకు రోహన్ దిగనున్నాడు.

మిక్సిడ్ డబుల్స్ లో సానియా మీర్జాతో జంటగా ఒలింపిక్స్ లో పాల్గొన్న రోహన్ కాంస్య పతకం పోరులో విఫలమయ్యాడు. ఇక..అత్యంత పిన్నవయస్కురాలైన అథ్లెట్ ఘనతను స్విమ్మర్ ధినిధి ధీసింగు దక్కించుకోనుంది.

ధినిధి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న భారత అతిపెద్ద, అతి చిన్న అథ్లెట్లు ఇద్దరూ కర్నాటక రాష్ట్ర్రానికి చెందినవారే కావడం విశేషం.

విశ్వవిద్యాలయ క్రీడాకారుల కోటాలో ధినిధి ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగింది. 200 మీటర్ల ఫ్రీ-స్టయిల్ విభాగంలో ధినిధి తలపడనుంది. వందేళ్లకు పైగా కలిగిన భారత ఒలింపిక్స్ చరిత్రలో రెండో పిన్నవయస్కురాలైన అథ్లెట్ గా ధినిధి రికార్డుల్లో చేరనుంది.

1952 హెల్సింకీ ఒలింపిక్స్ లో ఆరతీ సాహా కేవలం 11 సంవత్సరాల చిన్నవయసులో ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది. ఇప్పుడు ధినిధి ఆ తర్వాతి స్థానంలో నిలువనుంది.

బెంగళూరులోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ధినిధి 200 మీటర్ల ఈతలో వయసుకు మించిన ప్రతిభకనబరుస్తూ ఒలింపిక్స్ బెర్త్ సాధించగలిగింది.

2022 ఆసియా క్రీడలు, 2024 ప్రపంచ అక్వాటిక్స్ పోటీలలో పాల్గొన్న అనుభవం ధినిధికి ఉంది.

పురుషుల హాకీలో పతకం ఆశలు...

గత ఒలింపిక్స్ హాకీ పురుషుల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత్ 16 మంది సభ్యుల జట్టుతో పోటీకి దిగుతోంది. భారత జట్టుకు పెనాల్టీకార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు.

విలువిద్యలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులతో కూడిన జట్టు పతకాలవేటకు దిగుతుంటే..బ్యాడ్మింటన్లో 7, బాక్సింగ్ లో 6, గోల్ఫ్ లో 4గురు సభ్యుల జట్లతో పోటీకి దిగుతున్నారు.

అశ్వక్రీడలో పాల్గొనటానికి ఒక్కరు మాత్రమే అర్హత సాధించగలిగారు. జూడో, రోయింగ్ క్రీడల్లో ఒక్కొక్కరు బరిలో నిలువనున్నారు. సెయిలింగ్, ఈత అంశాలలో ఇద్దరు చొప్పున, టెన్నిస్ లో ముగ్గురు, వెయిట్ లిఫ్టింగ్ లో ఒక్కరు, కుస్తీలో ఆరుగురు మాత్రమే భారత్ తరపున పాల్గొనబోతున్నారు.

భారత్ ఖచ్చితంగా పతకాలు సాధించే అంశాలలో పురుషుల జావలిన్ త్రో, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్, హాకీ, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్ అంశాలు మాత్రమే ఉన్నాయి.

ఒలింపిక్స్ లో మొత్తం 32 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తుంటే..భారత అథ్లెట్లు మాత్రం 14 క్రీడల్లో మాత్రమే పాల్గొనటానికి అర్హత సాధించగలిగారు.

140మందితో సహాయక సిబ్బంది...

ఒలింపిక్స్ లో 113 అథ్లెట్లు భారత్ తరపున బరిలో నిలుస్తుంటే..వారికి సహాయకులుగా 140 మంది సిబ్బంది పారిస్ బయలు దేరుతున్నారు. వీరిలో జట్టు మేనేజర్లు, వివిధ క్రీడల్లో శిక్షకులు, భారత ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులు, వైద్యులు, ఫిజియోలు, వంట సిబ్బంది సైతం ఉన్నారు.

సహాయక సిబ్బందిలో 67 మందికి మాత్రమే ఒలింపిక్స్ విలేజ్ లో ఉండేందుకు అనుమతి లభించింది. మిగిలిన వారంతా పారిస్ నగరంలోని హోటెల్ లో బస చేయనున్నారు.

భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ బృందానికి 18 మందితో సహాయక బృందం ఉండగా..ఆరుగురు వస్తాదులతో కూడిన కుస్తీ జట్టుకు 18 మంది సహాయకుల బృందం ఉండటం విశేషం.

ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం ' టాప్ ' పథకం కింద భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

24మంది సైనికదళాల అథ్లెట్లు...

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న మొత్తం 117మంది అథ్లెట్లలో భారత రక్షణ దళాల( సర్వీసెస్ )కు చెందిన 24 మంది క్రీడాకారులున్నారు. వీరిలో 22 మంది పురుషులు కాగా..ఇద్దరు మాత్రమే మహిళా అథ్లెట్లున్నారు.

2022 టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన సుబేదార్ నీరజ్ చోప్రా సర్వీసెస్ నుంచి భారతజట్టులో చేరినవాడే. వరుసగా రెండో ఒలింపిక్స్ బంగారు పతకం కోసం నీరజ్ సమాయత్తమయ్యాడు.

హవల్దార్ జాస్మిన్ లాంబోరియా, రితికా హుడా బాక్సింగ్, కుస్తీ క్రీడల్లో పతకాల వేటకు దిగుతున్నారు. షూటింగ్, ఆర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో సైతం సర్వీసెస్ కు చెందిన పలువురు క్రీడాకారులు భారతజట్టు సభ్యులుగా పాల్గొనబోతున్నారు.

మొత్తం 117 మంది భారత అథ్లెట్లలో సగం మందికి పారిస్ క్రీడలే తొలి ఒలింపిక్స్ కావడం మరో విశేషం.

మహిళల బాక్సింగ్ లో ఏదో ఒక పతకం సాధించగల సత్తా కలిగిన నిఖత్ జరీన్ 2022, 2023 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో విజేతగా నిలిచింది. మహిళల జూనియర్ కుస్తీలో పతకం సాధించిన అంతిమ్ పంగల్ సైతం తొలిసారిగా ఒలింపిక్స్ కుస్తీలో పాల్గోనుంది.

బ్యాడ్మింటన్ యంగ్ గన్ లక్ష్యసేన్, హర్డల్స్ రన్నర్ జ్యోతి యర్రాజీ,స్టీపుల్ చేజర్ పారుల్ చౌదరి తొలిసారిగా ఒలింపిక్స్‌ లో పోటీకి దిగుతున్నారు.

First Published:  23 July 2024 10:47 AM GMT
Next Story