Telugu Global
Sports

భారత ఒలింపిక్ బృందంలో అసలు కంటే కొసరే ఎక్కువ!

2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 113 మంది అథ్లెట్ల వివరాలను భారత ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది. భారత బృందంలో అథ్లెట్లను మించి అధికారులు, సహాయక సిబ్బంది ఉండడటం విశేషం.

భారత ఒలింపిక్ బృందంలో అసలు కంటే కొసరే ఎక్కువ!
X

2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 113 మంది అథ్లెట్ల వివరాలను భారత ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది. భారత బృందంలో అథ్లెట్లను మించి అధికారులు, సహాయక సిబ్బంది ఉండడటం విశేషం.

పారిస్ వేదికగా జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే 2024 ఒలింపిక్స్ లో భారత్ 113 మంది అథ్లెట్లు, 140 మంది అధికారులు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పాల్గోనుంది. భారత బృందం వివరాలను జాతీయ ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది.

టోక్యో, రియో గేమ్స్ కంటే తక్కువ...

2016 రియో ఒలింపిక్స్ లో 117 మంది అథ్లెట్లతో పాల్గొన్న భారత్..2022 టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం 122 మంది సభ్యుల అతిపెద్ద బృందంతో బరిలో నిలిచింది. అంతేకాదు..

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఓ స్వర్ణంతో సహా ఏడు పతకాలు సాధించింది. ఇందులో రెండు రజత, 4 కాంస్యాలు సైతం ఉన్నాయి.

ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం భారత అథ్లెట్ల బృందం సంఖ్య 122 నుంచి 113కు తగ్గిపోయింది. వివిధ క్రీడాంశాలలో పాల్గొనటానికి కేవలం 113 మంది అథ్లెట్లు మాత్రమే అర్హత సంపాదించగలిగారు.

2016, 2022 ఒలింపిక్స్ తో పోల్చిచూస్తే 2024 ఒలింపిక్స్ లో తక్కువమంది సభ్యుల బృందంతోనే భారత్ తన అదృష్టం పరీక్షించుకోబోతోంది.

సంయుక్త పతాకధారులుగా తెలుగుజోడీ...

ఒలింపిక్స్ ప్రారంభవేడుకల్లో పాల్గొనే భారత బృందానికి తెలుగుజోడీ ఆచంట శరత్ కమల్, పీవీ సింధు సంయుక్త పతాకధారులుగా వ్యవహరిస్తారు. 41 సంవత్సరాల భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ కు ఇది ఆరవ ఒలింపిక్స్ కాగా...పీవీ సింధుకు మూడో ఒలింపిక్స్ మాత్రమే.

66 మంది పురుషులు, 47 మంది మహిళలు..

పారిస్ గేమ్స్ లో పాల్గొనే 113 మంది సభ్యుల భారత అథ్లెట్ల బృందంలో 66 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో 30 మంది సభ్యులు, షూటింగ్ లో 21 మంది సభ్యులజట్లతో భారత్ పతకాలవేటకు దిగుతోంది.

గత ఒలింపిక్స్ హాకీ పురుషుల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత్ 16 మంది సభ్యుల జట్టుతో పోటీకి దిగుతోంది. భారత జట్టుకు పెనాల్టీకార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు.

విలువిద్యలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులతో కూడిన జట్టు పతకాలవేటకు దిగుతుంటే..బ్యాడ్మింటన్లో 7, బాక్సింగ్ లో 6, గోల్ఫ్ లో 4గురు సభ్యుల జట్లతో పోటీకి దిగుతున్నారు.

అశ్వక్రీడలో పాల్గొనటానికి ఒక్కరు మాత్రమే అర్హత సాధించగలిగారు. జూడో, రోయింగ్ క్రీడల్లో ఒక్కొక్కరు బరిలో నిలువనున్నారు. సెయిలింగ్, ఈత అంశాలలో ఇద్దరు చొప్పున, టెన్నిస్ లో ముగ్గురు, వెయిట్ లిఫ్టింగ్ లో ఒక్కరు, కుస్తీలో ఆరుగురు మాత్రమే భారత్ తరపున పాల్గొనబోతున్నారు.

భారత్ ఖచ్చితంగా పతకాలు సాధించే అంశాలలో పురుషుల జావలిన్ త్రో, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్, హాకీ, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్ అంశాలు మాత్రమే ఉన్నాయి.

ఒలింపిక్స్ లో మొత్తం 32 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తుంటే..భారత అథ్లెట్లు మాత్రం 14 క్రీడల్లో మాత్రమే పాల్గొనటానికి అర్హత సాధించగలిగారు.

113 అథ్లెట్లకు 140మంది సహాయక సిబ్బంది...

ఒలింపిక్స్ లో 113 అథ్లెట్లు భారత్ తరపున బరిలో నిలుస్తుంటే..వారికి సహాయకులుగా 140 మంది సిబ్బంది పారిస్ బయలు దేరుతున్నారు. వీరిలో జట్టు మేనేజర్లు, వివిధ క్రీడల్లో శిక్షకులు, భారత ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులు, వైద్యులు, ఫిజియోలు, వంట సిబ్బంది సైతం ఉన్నారు.

సహాయక సిబ్బందిలో 67 మందికి మాత్రమే ఒలింపిక్స్ విలేజ్ లో ఉండేందుకు అనుమతి లభించింది. మిగిలిన వారంతా పారిస్ నగరంలోని హోటెల్ లో బస చేయనున్నారు.

భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ బృందానికి 18 మందితో సహాయక బృందం ఉండగా..ఆరుగురు వస్తాదులతో కూడిన కుస్తీ జట్టుకు 18 మంది సహాయకుల బృందం ఉండటం విశేషం.

ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం ' టాప్ ' పథకం కింద భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

నజరానాగా 7 కోట్ల రూపాయలు..

2024 ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు తొలిసారిగా రెండంకెల సంఖ్యలో పతకాలు సాధించే అవకాశం ఉందని, పతకవిజేతలకు నజరానాగా 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లు..భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు.

టీమ్ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత హాకీజట్టు సభ్యులు..స్వర్ణం సాధిస్తే 2 కోట్ల రూపాయలు నగదు బహుమతిగా అందచేయనున్నారు. రజత పతకం సాధిస్తే కోటి రూపాయలు, కాంస్యం నెగ్గితే 75 లక్షల రూపాయలు చెల్లించనున్నారు.

ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్లకు 42 లక్షల ( 50 వేల డాలర్లు ) రూపాయలు చొప్పున ఇస్తామని ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది.

రోజుకు 50 డాలర్లు.......

ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు రోజుకు 50 డాలర్లు చొప్పున దినసరి భత్యంగా అందచేయాలని భారత ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది. మొత్తం 195 మంది సభ్యుల కోసం అలవెన్సులను సిద్ధం చేసింది.

అథ్లెట్లకు 2 లక్షల రూపాయల నగదు మొత్తాన్ని, కోచింగ్ స్టాఫ్ కు లక్ష రూపాయల చొప్పున గ్రాంట్ ను తొలిసారిగా అందచేసింది. నలుగురు సభ్యుల గోల్ఫ్ బృందానికి అవసరమైన గోల్ఫ్ బ్యాగుల కోసం 4 లక్షల 40వేల రూపాయలు కేటాయించింది. అశ్వక్రీడల కోసం ప్రత్యేకంగా 9 లక్షల రూపాయలు అందుబాటులో ఉంచింది.

First Published:  17 July 2024 11:45 AM GMT
Next Story