Telugu Global
Sports

భారత షూటర్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన యువషూటర్ మను బాకర్ మరో పతకంతో పాటు అరుదైన రికార్డుకు గురిపెట్టింది.

భారత షూటర్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..
X

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన యువషూటర్ మను బాకర్ మరో పతకంతో పాటు అరుదైన రికార్డుకు గురిపెట్టింది.

ఫ్రెంచ్ రాజధాని పారిస్ నగరం వేదికగా ప్రారంభమైన 2024 ఒలింపిక్స్ క్రీడల తొలిరోజునే భారత్ కు పతకం అందించిన మహిళా షూటర్ మను బాకర్ టీమ్ విభాగంలో సైతం మరో పతకం అందించాలన్న పట్టుదలతో ఉంది.

12 ఏళ్ల తర్వాత షూటింగ్ లో మరో పతకం...

ఒలింపిక్స్ షూటింగ్ లో చివరిసారిగా 2012 గేమ్స్ లో పతకం నెగ్గిన భారత్ మరో పతకం కోసం 2024 పారిస్ ఒలింపిక్స్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది. 10 మీటర్ల ఏర్ పిస్టల్ షూటింగ్ లో వివిధ దేశాలకు చెందిన ప్రపంచ మేటి తొమ్మిది మంది షూటర్లతో పోటీకి దిగిన 22 సంవత్సరాల మను బాకర్ మూడోస్థానంలో నిలవడం ద్వారా కాంస్య పతకం సాధించింది.

హర్యానాలోని జజ్జర్ కు చెందిన మను బాకర్ గత ఒలింపిక్స్ లో..పిస్టల్ మొరాయించడంతో పతకం సాధించలేకపోయింది. అయితే..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం 221.7 పాయింట్లతో కంచు మోత మోగించింది.

కొరియన్ షూటర్ల జోడీ జిన్ ఏ వో 243.2 పాయింట్లతో స్వర్ణ, కిమ్ ఏజీ 241.3 పాయింట్లతో మొదటి రెండుస్థానాలలో నిలిచారు.

భారత తొలి మహిళా షూటర్ గా రికార్డు...

12 దశాబ్దాల ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ క్రీడలో పతకం సాధించిన భారత తొలి మహిళగా మను చరిత్ర సృష్టించింది. 2024 ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన అథ్లెట్ గౌరవాన్ని సైతం మను దక్కించుకోగలిగింది.

మిక్సిడ్ టీమ్ విభాగంలో సరబ్ జోత్ సింగ్ తో జంటగా పతకం వేటకు దిగుతోంది. ఆగస్టు 2న ప్రారంభం కానున్న 25 మీటర్ల వ్యక్తిగత, టీమ్ విభాగాలలో సైతం మను పోటీకి దిగనుంది. మిగిలిన మూడు విభాగాలలో ఒక్క పతకం సాధించినా...ఒకే ఒలింపిక్స్ లో రెండుపతకాలు సాధించిన భారత తొలి అథ్లెట్ గా మను సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టగలుగుతుంది.

25 మీటర్ల విభాగంలో మను ఏదో ఒకపతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తొలిసారిగా మహిళల ఏర్ రైఫిల్ ఫైనల్లో రమిత..

మహిళల 10 మీటర్ల ఏర్ రైఫిల్ ఫైనల్స్ తొలిసారిగా చేరిన భారత యువషూటర్ రమిత జిందాల్ మెడల్ రౌండ్లో మాత్రం విఫలమయ్యింది. క్వాలిఫైయింగ్ రౌండ్లలో 5వ ర్యాంక్ సాధించడం ద్వారా రమిత ఫైనల్స్ చేరుకోగలిగింది. రమిత మొత్తం 631.5 పాయింట్లు సాధించింది. ఫైనల్లో రమిత అదేస్థాయి ప్రతిభ కనబరచలేకపోయింది.

మూడో పతకం కోసం సింధువేట..

తన కెరియర్ లో చివరిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొంటున్న తెలుగుతేజం పీవీ సింధు మూడో పతకం కోసం వేట ప్రారంభించనుంది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించిన సింధు ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ లో మాత్రమే పోటీకి దిగుతోంది.

పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ వరుసగా రెండో విజయానికి తహతహలాడుతున్నాడు. తొలిరౌండ్లో గ్వాటెమాలా ఆటగాడిని చిత్తు చేసిన లక్ష్య రెండో రౌండ్లో బెల్జియం ఆటగాడితో తలపడనున్నాడు.

పురుషుల హాకీ గ్రూప్ - బీ రెండోరౌండ్ పోరులో అర్జెంటీనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

అగ్రస్థానంలో జపాన్..22వ స్థానంలో భారత్..

పారిస్ ఒలింపిక్స్ మొదటి రెండురోజుల పోటీలు ముగిసే నాటికి అత్యధిక పతకాలతో జపాన్, కొరియా, ఆస్ట్ర్రేలియా, ఫ్రాన్స్, అమెరికా మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నాయి.

జపాన్ 4 స్వర్ణ, 2 రజత 1 కాంస్యాలతో సహా మొత్తం 7 పతకాలు సాధించింది. కొరియా 4 స్వర్ణ, 2 రజత, 1 కాంస్యతో రెండు, ఆస్ట్ర్రేలియా 4 స్వర్ణ, 2 రజత పతకాలతో మూడు స్థానాలలో నిలిచాయి.

అమెరికా 3 స్వర్ణాలతో సహా 12 పతకాలు, ఆతిథ్య ప్రాన్స్ 3 స్వర్ణ, 3 రజత, 2 కాంస్యాలతో నాలుగు, ఐదుస్థానాలలో నిలిచాయి. భారత్ ఒకే ఒక్క కాంస్య పతకంతో పతకాల పట్టిక 22వ స్థానంలో ఉంది.

First Published:  29 July 2024 10:15 AM GMT
Next Story