Telugu Global
Sports

వినూత్నంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం!

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ వినూత్నంగా ప్రారంభమయ్యాయి. రెండువారాలపాటు సాగే ఈ క్రీడల పండుగలో 205 దేశాల అథ్లెట్లు పాల్గొంటున్నారు.

వినూత్నంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం!
X

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ వినూత్నంగా ప్రారంభమయ్యాయి. రెండువారాలపాటు సాగే ఈ క్రీడల పండుగలో 205 దేశాల అథ్లెట్లు పాల్గొంటున్నారు.

ప్రపంచ ప్యాషన్ల నగరం పారిస్ వేదికగా 33వ వేసవి ఒలింపిక్స్ వినూత్నంగా..అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పారిస్ నగరానికి తలమానికంగా నిలిచే ఈఫిల్ టవర్ సాక్షిగా.. రాజధాని నగరం నడిబొడ్డునే ఉన్న సీన్ నదిలో 90 పడవల్లో వివిధ దేశాల అథ్లెట్లు కవాతు చేయడంతో మూడుగంటల ఈ ప్రారంభవేడుకలకు తెరలేచింది.

స్టేడియంలో కాదు..నదీజలాలలో కవాతు...

1896 ప్రారంభ ఒలింపిక్స్ నుంచి 2020 టోక్యో క్రీడల వరకూ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల కవాతును కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన భారీ స్టేడియాలలోనే నిర్వహిస్తూ వచ్చారు.

అయితే..ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి..పారిస్ క్రీడల నిర్వహాక సంఘం ఓ వినూత్న ఆలోచనతో..సీన్ నదీ జలాలలో..90 నౌకలతో కవాతు వేడుకలను నిర్వహించింది.

జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ 16రోజులపాటు సాగే పారిస్ ఒలింపిక్స్ ను వినూత్నంగా నిర్వహించనున్నారు. సీన్ నదిలో 6 కిలోమీటర్ల దూరం పడవల పరేడ్ తో ప్రారంభవేడుకలు నిర్వహించారు.

ప్రారంభవేడుకల కవాతులో పాల్గొనే ఒక్కోజట్టుకు ఒక్కో నౌకను కేటాయించారు. బోట్ల కవాతు సీన్ నదీ తీరంలోని ఆస్టర్ లిడ్జ్ వంతెన వద్ద మొదలై..రెండు ద్వీపాలను చుట్టి 6 కిలోమీటర్ల ప్రయాణం తరువాత ..ట్రోకాడెరో తీరంలో ముగిసింది.

భద్రత కారణాల దృష్ట్యా ప్రారంభ వేడుకలను సెయింట్ డెన్నిస్ లోని స్టేడియం ఫ్రాన్స్ లో కాకుండా సీన్ నదీతీరంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు గతంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రోన్ ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించారు.

90 నౌకలు...6వేలమంది అథ్లెట్లతో...

పారిస్ నగరం మధ్యనుంచి ప్రవహించే సీన్ నది వేదికగా 90 నౌకలతో ప్రారంభవేడుకల కవాతు ప్రారంభమయ్యింది. మొత్తం 6 కిలోమీటర్ల దూరం సాగిన ఈ కవాతులో 90 దేశాలకు చెందిన అథ్లెట్లు 90 నౌకలు అధిరోహించి..తమ తమ జాతీయ పతకాలు ఊపుతూ..కేరింతలు కొడుతూ..సందడి సందడి చేస్తూ పాల్గొన్నారు.

సీన్ నది తీరం ఇరువైపుల నుంచి 3 లక్షల మంది, సమీపంలోని ఎత్తైన భవనాలు , ప్రాంతాల పైనుంచి మరో 2 లక్షలమంది అథ్లెట్ల కవాతును వీక్షించారు.

ఈ క్రీడల్లో మొత్తం 10, 500 మంది అథ్లెట్లు పోటీపడుతుండగా..ప్రారంభవేడుకల్లో మాత్రం 205 దేశాలకు చెందిన 6800 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొనగలిగారు.

ఆరుకిలోమీటర్ల నౌకాయాన కవాతు ట్రొకాడెరో వద్ద ముగిసిన వెంటనే ..చెంతనే ఉన్న ఈఫిల్ టవర్ మైదానంలో సాంస్క్రృతిక కార్యక్రమాలు, జ్యోతిప్రజ్వలన ముగిసిన తరువాత క్రీడలు ప్రారంభమైనట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు.

వేడుకల్లో 78 మంది భారత అథ్లెట్లు...

ఈ క్రీడలలో మొత్తం 117 మంది అథ్లెట్లతో పోటీకి దిగుతున్న భారత్...ప్రారంభవేడుకలకు మాత్రం 78 మంది అథ్లెట్ల బృందానికి అనుమతి ఇచ్చింది. మొత్తం 16 క్రీడలకు చెందిన అథ్లెట్లను ప్రారంభవేడుకల కవాతు బృందంలో చేర్చింది.

తెలుగుతేజాలు ఆచంట శరత్ కమల్, పీవీ సింధు..భారత బృందానికి పతాకధారులుగా వ్యవహరించారు. జాతీయ పతాకంలోని త్రివర్ణాలతో డిజైన్ చేసిన ప్రత్యేక దుస్తులు ధరించిన భారత అథ్లెట్ల బృందం ప్రారంభవేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మురిసిపోతున్న శరత్, సింధు...

వినూత్నంగా నిర్వహించిన పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలలో భారత్ కు పతాకధారులుగా వ్యవహరించే అదృష్టం తమకు మాత్రమే దక్కడంతో తెలుగు అథ్లెట్ల జోడీ పీవీ సింధు, ఆచంట శరత్ కమల్ మురిసిపోతున్నారు. క్రీడాకారులుగా ఇది తమకు లభించిన గొప్పవరమంటూ మురిసిపోయారు.

తన క్రీడాజీవితంలో మూడో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న సింధు ..గత రెండు ఒలింపిక్స్ లోనూ పతకాలు సాధించగలిగింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత, 2022 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు నెగ్గిన సింధు..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో సైతం ఏదో ఒక పతకం సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాలన్న పట్టుదలతో ఉంది.

మరోవైపు...టేబుల్ టెన్నిస్ లో భారత దిగ్గజ ఆటగాడు ఆచంట శరత్ కమల్ కు ఇది 5వ ఒలింపిక్స్ కావడం విశేషం.

2004 నుంచి విడవకుండా ఒలింపిక్స్ లో పాల్గొంటూ వచ్చిన 41 సంవత్సరాల శరత్ కమల్ జీవితంలో ఇవే చివరి ఒలింపిక్స్ కానున్నాయి. అదృష్టం కలసి వస్తే టీమ్ లేదా మిక్సిడ్ డబుల్స్, లేదా సింగిల్స్ లో ఏదో ఒక పతకం సాధించగలనని ఆశిస్తున్నాడు.

గత ఒలింపిక్స్ లో సాధించిన 7 పతకాల రికార్డును ప్రస్తుత గేమ్స్ లో అధిగమించాలన్న లక్ష్యంతో భారత బృందం పోటీకి దిగుతోంది.

First Published:  27 July 2024 9:53 AM GMT
Next Story