Telugu Global
Sports

క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కి గుడ్‌బై

ప్రస్తుతం తన ముందు కొత్త జీవితం ఉందని, జీవితంలో ముందుకెళ్లాలంటే పేజీలు తిప్పక త‌ప్ప‌దని శిఖర్‌ ధావర్‌ చెప్పారు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానని తెలిపారు.

క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కి గుడ్‌బై
X

టీమ్‌ ఇండియా సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ నుంచి తాను రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. శనివారం ఉదయం సోషల్‌ మీడియాలో ఈ మేరకు ఓ ఉద్వేగభరిత వీడియో పోస్ట్‌ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే.. దేశం కోసం ఆడాలనేది తన కల అని, అదృష్టవశాత్తూ ఆ అవకాశం తనకు లభించిందని తెలిపారు. ఈ ప్రయాణంలో తన కుటుంబం, చిన్ననాటి కోచ్‌లు, తన జట్టు అండగా నిలిచారని వివరించారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు. క్రికెట్‌ వల్ల తనకు ఒక కొత్త కుటుంబం, పేరు, ఎంతో ప్రేమాభిమానాలు లభించాయని వివరించారు.

ప్రస్తుతం తన ముందు కొత్త జీవితం ఉందని, జీవితంలో ముందుకెళ్లాలంటే పేజీలు తిప్పక త‌ప్ప‌దని శిఖర్‌ ధావర్‌ చెప్పారు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానని తెలిపారు. నా దేశం కోసం నేనెంతో ఆడా..! ఇకపై మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు.. అందుకు బాధపడాల్సిన అవసరం లేదని నా మనసుకు చెబుతున్నా.. అని ఆ వీడియోలో వివరించారు.

టీమిండియా తరపున క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడిన ధావన్‌, ధనాధన్‌ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. తన కెరీర్లో ఇప్పటివరకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధావన్‌.. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315, టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు శిఖర్‌ ధావన్‌ ఖాతాలో ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. మొహాలీలో టెస్టుల్లో అరంగేట్రంలోనే ఆస్ట్రేలియాపై 185 పరుగులతో అదరగొట్టి.. టెస్టుల్లో తొలి మ్యాచ్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబయి, పంజాబ్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన శిఖర్‌ ధావన్‌.. ఢిల్లీ, పంజాబ్‌ జట్లకు కెప్టెన్‌గా కూడా చేశాడు. మొత్తంగా 222 మ్యాచ్‌లు ఆడి 6,769 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 51 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది పంజాబ్‌ తరపున ఆడినప్పటికీ ఫిట్‌నెస్‌ సమస్య కారణంగా 5 మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. ఫామ్‌లో లేకపోవడం, యువ ఆటగాళ్ల పోటీ పెరగడంతో గత రెండేళ్లుగా టీమిండియాకు దూరమయ్యాడు. శిఖర్‌ ధావన్‌ నిర్ణయం మాత్రం ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది.

First Published:  24 Aug 2024 6:48 AM GMT
Next Story