Telugu Global
Sports

ఇప్పుడీ పిల్లాడే కింగ్‌

అండర్‌-13 పోటీల్లో భాగంగా ఆనంద్‌ చేతుల మీదుగా గుకేశ్‌ ఐదేళ్ల కిందట అందుకున్న బహుమతిని షేర్‌ చేసిన విశ్వనాథన్‌ ఆనంద్‌

ఇప్పుడీ పిల్లాడే కింగ్‌
X

చరిత్రను తిరగరాస్తూ డి గుకేశ్‌ సంచలన ప్రదర్శనతో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్లకే ఈ ఘనతను సాధించి చెస్‌లో అరుదైన ప్రతిభను సొంతం చేసుకున్నాడు. చివరి రౌండ్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో డింగ్‌ లిరెన్‌పై గుకేశ్‌ విజయం సాధించాడు. ఇప్పటికే తనకు విషెస్‌ను తెలియజేసిన చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ సోషల్‌ మీడియాలో మరో పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. గుకేశ్‌ చిన్ననాటి ఫొటోను ఆనంద్‌ షేర్‌ చేశాడు. 'ఇప్పుడీ పిల్లాడే కింగ్‌' అంటూ క్యాప్షన్‌ జోడించాడు. అండర్‌-13 పోటీల్లో భాగంగా ఆనంద్‌ చేతుల మీదుగా గుకేశ్‌ ఐదేళ్ల కిందట ఛాంపియన్‌ బహుమతిని అందుకొన్నాడు. ఆ ఫొటోనే ఆనంద్‌ తాజాగా షేర్‌ చేశాడు.

సుమారు 40 ఏళ్ల కిందట కాస్పరోవ్‌ నమోదు చేసిన రికార్డును భారత యువ చెస్‌ ప్లేయర్‌ గుకేశ్‌ బద్దలు కొట్టాడు. అప్పటివరకు ఉన్న రికార్డు 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు. కానీ గుకేశ్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులోనే నిలిచాడు. డింగ్‌ లిరెన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 7.5 పాయింట్లను సాధించి గుకేశ్‌ విజేతగా నిలిచాడు. 13 రౌండ్ల వరకూ పాయింట్ల పరంగా సమంగా నిలిచారు. అయితే చివరి రౌండ్‌లో అద్భుత విజయంతతో గుకేశ్‌ ఛాంపియన్‌గా మారిపోయాడు. ఈ రౌండ్‌లోనూ చివరివరకూ ఇద్దరూ తీవ్రంగా తలపడ్డారు. కానీ ఆఖర్లో లిరెన్‌ చేసిన పొరపాటు గుకేశ్‌కు కలిసి వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దూకుడు ప్రదర్శించిన భారత యువ చెస్‌ ప్లేయర్‌ ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. చివరికి లిరెన్‌ ఓటమిని అంగీకరించక తప్పలేదు.

First Published:  13 Dec 2024 11:54 AM IST
Next Story