జోకోవిచ్ ' బంగారు' కల నిజమాయెగా...!
ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం అంటే మాటలా మరి. ప్రపంచ టెన్నిస్ నే జయించిన జోకోవిచ్ ఒలింపిక్స్ విజేతగా నిలవడానికి 20 సంవత్సరాలపాటు పోరాడాల్సి వచ్చింది.
ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం అంటే మాటలా మరి. ప్రపంచ టెన్నిస్ నే జయించిన జోకోవిచ్ ఒలింపిక్స్ విజేతగా నిలవడానికి 20 సంవత్సరాలపాటు పోరాడాల్సి వచ్చింది.
ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడానికి వయసు ఏమాత్రం అడ్డు కాదని ప్రపంచ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ చాటి చెప్పాడు. తన కెరియర్ చరమాంకంలో..అదీ ఐదవ ప్రయత్నంలో, 37 సంవత్సరాల లేటు వయసులో స్వర్ణపతకం సాధించడం ద్వారా తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొన్నాడు.
2008 నుంచి ఒలింపిక్స్ వేట...
గ్రాండ్ స్లామ్ కింగ్, ప్రపంచ టెన్నిస్ సాటిలేని మేటిఆటగాడు 37 ఏళ్ల లేటు వయసులో తన బంగారు కలను సాకారం చేసుకొన్నాడు. పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల స్వర్ణపతకం సాధించడం ద్వారా తన జీవితలక్ష్యాన్ని సాధించగలిగాడు.
2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ స్వర్ణపతకం సాధించడానికి జోకోవిచ్ చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. గత 16 సంవత్సరాల కాలంలో జరిగిన బీజింగ్, లండన్, రియో, టోక్యో క్రీడల్లో పాల్గొన్నా సఫలం కాలేకపోయిన జోకోవిచ్ తన టెన్నిస్ జీవితం ముగింపు దశలో..మోకాలికి శస్త్ర్రచికిత్స చేయించుకొని మరీ ఆఖరి ప్రయత్నంగా పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగాడు.
తొలిరౌండ్ నుంచి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటూ గోల్డ్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టాడు. స్వర్ణ పతకం పోరులో స్పానిష్ యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ ను హోరాహోరీ పోరులో 7-6, 7-6తో కంగు తినిపించడం ద్వారా విజేతగా నిలిచాడు. తన చిరకాల స్వప్నాన్ని ఆఖరి ప్రయత్నంలో నెరవేర్చుకొన్నాడు.
37 ఏళ్ల వయసులో ' గోల్డెన్ స్లామ్' ...
రాయల్ గేమ్ టె్న్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, రెండు కెరియర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన జోకోవిచ్ అంతిమలక్ష్యం ' గోల్డెన్ స్లామ్' ను సైతం పూర్తి చేయగలిగాడు. అంతేకాదు..ఒలింపిక్స్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత పెద్దవయసులో స్వర్ణవిజేతగా నిలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ప్రతి ఏటా జరిగే నాలుగు గ్రాండ్ స్లామ్ ( వింబుల్డన్, ఫ్రెంచ్,అమెరికన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) టైటిల్స్ తో పాటు ఒలింపిక్స్ స్వర్ణపతకం సైతం సాధించగలిగితే గోల్డెన్ స్లామ్ సాధించినట్లుగా పరిగణిస్తారు.
ఈ ఘనతను ఇప్పటి వరకూ జోకోవిచ్ తో సహా ఐదుగురు మాత్రమే సాధించగలిగారు. టెన్నిస్ గోల్డెన్ స్లామ్ సాధించిన తొలి మహిళ ( 1988) ఘనతను జర్మన్ టెన్నిస్ గ్రేట్ స్టెఫీ గ్రాఫ్, తొలి పురుషుడి ( 1999 ) రికార్డును ఆండ్రీ అగాసీ సాధించాడు.
అత్యంత చిన్నవయసులో గోల్డెన్ స్లామ్ సాధించిన ఘనతను స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ( 2010 ) దక్కించుకొన్నాడు. కేవలం 24 ఏళ్ల చిరుప్రాయంలోనే నడాల్ అరుదైన ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు.
అమెరికన్ నల్లకలువ సెరెనా విలియమ్స్ 2012 లండన్ ఒలింపిక్స్ బంగారు పతకంతో గోల్డెన్ స్లామ్ పూర్తి చేయగలిగింది.
గ్రాండ్ స్లామ్ నుంచి ఒలింపిక్స్ వరకూ..
ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు వరకూ ప్రపంచ టెన్నిస్ లో జోకోవిచ్ సాధించని టైటిల్, నెలకొల్పని రికార్డు అంటూ ఏమీలేదు. జోకో సాధించిన మొత్తం 24 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలలో 10 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్, 7 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్, 7 ఏటీపీ ఫైనల్స్, 8 సంవత్సరాంతపు నంబర్ వన్ టైటిల్స్, 2 కెరియర్ గోల్డెన్ మాస్టర్స్ ఉన్నాయి. ఓ డేవిస్ కప్ ట్రోఫీతో పాటు ఒలింపిక్స్ బంగారు పతకం, 428 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడి ర్యాంకు సాధించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచాడు. ఆటుపోట్లు ఎదురైనా ..మొండి పట్టుదలతో టెన్నిస్ గోల్డెన్ స్లామ్ శిఖరాన్ని అధిరోహించగలిగాడు.
నిరంతర సాధన, అంకితభావం, సాధించితీరాలన్న పట్టుదల ఉంటే వయసు మీద పడుతున్నా ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించగలమనడానికి జోకోవిచ్ ను మించిన నిదర్శనం మరొకటిలేదు.