Telugu Global
Sports

వింబుల్డన్ ఫైనల్లో కొండతో కూన ఢీ!

137వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది.టెన్నిస్ శిఖరం జోకోవిచ్ ను ఓ పసికూన ఢీకోనుంది.

వింబుల్డన్ ఫైనల్లో కొండతో కూన ఢీ!
X

137వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది.టెన్నిస్ శిఖరం జోకోవిచ్ ను ఓ పసికూన ఢీకోనుంది.

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టో్ర్నీ వింబుల్డన్ టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. లండన్ లోని ఆల్ -ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టు వేదికగా జరిగే ఫైనల్లో ఏడుసార్లు విజేత, రెండో సీడ్ నొవాక్ జోకోవిచ్ తో స్పానిష్ కుర్రాడు కార్లోస్ అల్ కరాజ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు జోకో గురి....

గత 137 సంవత్సరాలుగా నిత్యనూతనంగా ఉంటూ వస్తున్న వింబుల్డన్ గ్రాస్ కోర్ట్ టెన్నిస్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాలని సెర్బియన్ సూపర్ స్టార్ నొవాక్ జోకోవిచ్ తహతహలాడుతున్నాడు.

రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్, రాఫెల్ నడాల్ గాయాలతో వెనుకబడిపోడంతో...ఇప్పుడు 37 సంవత్సరాల జోకోవిచ్ మాత్రమే ప్రపంచ పురుషుల టెన్నిస్ కు పెద్దదిక్కుగా నిలిచాడు.

తన కెరియర్ లో ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా 7 వింబుల్డన్ ట్రోఫీలు నెగ్గిన జోకోవిచ్ రికార్డుస్థాయిలో 37వ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరాడు. అంతేకాదు..పదోసారి వింబుల్డన్ ఫైనల్స్ కు అర్హత సంపాదించాడు.

సెమీస్ లో వరుస సెట్ల విజయం...

ఇటాలియన్ ఆటగాడు లోరెంజో ముసెట్టీతో జరిగిన తొలిసెమీఫైనల్లో జోకోవిచ్ వరుస సెట్ల విజయం నమోదు చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో జోకోవిచ్ 6-4, 7-6, 6-4తో విజేతగా నిలిచాడు.

25వ సీడ్ ముసెట్టీ తన కంటే 23 స్థానాల పైనున్న జోకోవిచ్ కు సరిజోడీ కాలేకపోయాడు. తొలిసెట్ ను 4-6తో చేజార్చుకొన్న ముసెట్టి..రెండోసెట్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చాడు. చివరకు 6-7తో సెట్ ను చేజార్చుకొన్నాడు. ఆఖరి సెట్ ను జోకోవిచ్ 6-4తో నెగ్గడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టాడు.

ఇప్పటి వరకూ వింబుల్డన్, యూఎస్ , ఫ్రెంచ్ ఓపెన్, అమెరికన్ ఓపెన్లలో 24 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జోకో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా ఆరో వింబుల్డన్ టైటిల్ తో డబుల్ హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

జోకోవిచ్ కు అల్ కరాజ్ గండం...

రెండోసెమీఫైనల్లో స్పానిష్ పోట్లగిత్త, యంగ్ గన్, 3వ ర్యాంకర్ కార్లోస్ అల్ కరాజ్ నాలుగుసెట్ల విజయం సాధించాడు. 5వ సీడ్ డేనియల్ మెద్వదేవ్ ను 6-7, 6-3, 6-4, 6-4తో అధిగమించి తన కెరియర్ లో రెండోసారి వింబుల్డన్ ఫైనల్స్ కు అర్హత సాధించాడు.

2024 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జోరుతో ఉన్న 21 సంవత్సరాల అల్ కరాజ్..టైటిల్ పోరులో అపారఅనుభవం కలిగిన జోకోవిచ్ ను కంగు తినిపించగలనన్న ధీమాతో ఉన్నాడు.

మరోవైపు..తన అనుభవానికి పట్టుదలను జోడించి వరుసగా 6వ వింబుల్డన్ టైటిల్ నెగ్గడం ద్వారా ఫెదరర్ పేరుతో ఉన్న ఎనిమిది టైటిల్స్ రికార్డును సమయం చేయాలని, ఇప్పటి వరకూ మరే ఆటగాడు సాధించని రీతిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గాలని జోకోవిచ్ భావిస్తున్నాడు.

ఆదివారం జరిగే టైటిల్ సమరంలో 2వ సీడ్ జోకోవిచ్ ను 3వ సీడ్ అల్ కరాజ్ ఢీ కోనున్నాడు. పురుషుల టెన్నిస్ శిఖరం జోకోవిచ్ తో..ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న పసికూన అల్ కరాజ్ తలపడటం..ఎంత ఆసక్తిగా సాగుతుందో మరి.

First Published:  13 July 2024 7:06 PM IST
Next Story