'మిస్టర్ కూల్'తో మాట్లాడిన ప్రతిసారి కొత్త విషయం నేర్చుకుంటా
ఎంఎస్ ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదన్నలఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పేర్కొనక్కరలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిస్టర్ కూల్ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నారు. అయినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌తో పాటు మిగతా జట్ల అభిమానులూ ధోనీని ఇష్టపడుతుంటారు. ఐపీఎల్ యజమానులు కూడా ఈ మిస్టర్ కూల్‌కు గౌరవం ఇస్తారు. దీనికి ఉదాహరణ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ధోనీపై ప్రశంసలు కురిపించారు. అతనితో మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని చెప్పాడు. తన మనవడి, ధోనీల మధ్య సంభాషణ గురించి కూడా లఖ్‌నవూ యజమాని వివరించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్ ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. అతని ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరు తన వయసులో ఉన్న వ్యక్తి తనను తాను ఎలా ఆవిష్కరించుకోగలడో తెలియజేస్తుంది. మతిశా పతిరన లాంటి యువ బౌలర్‌ను డేంజరస్ మ్యాచ్ విన్నర్‌గా తీర్చిదిద్దాడు. తన ఆటగాళ్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో అతని తెలుసు. నేను ధోనితో మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. నా మనవడికి క్రికెట్ అంటే పిచ్చి. ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మాట్లాడాను. అప్పుడు నా మనవడు కూడా నా వెంట ఉన్నాడు. వాడు ధోనీని అనేక ప్రశ్నలు అడిగాడు. 'ఇక చాలు' అని నా మనవడికి చెబితే.. ఉండండి నేను సంభాషణను ఆస్వాదిస్తున్నానని ధోనీ చెప్పాడని సంజీవ్ గోయెంకా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 ముందు ధోనీని సీఎస్కే రూ. 4 కోట్లకు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకున్న విషయం విదితమే.