Telugu Global
Sports

ఐపీఎల్‌ కొత్త రూల్స్‌కు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌

రిటెన్షన్‌లో ఆరుగురిని అట్టిపెట్టుకునే ఛాన్స్‌

ఐపీఎల్‌ కొత్త రూల్స్‌కు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌
X

ఐపీఎల్‌ మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తమ టీమ్‌లోని ఆరుగురు ఆటగాళ్లను నిలిపిపెట్టుకోవడానికి ఐపీఆర్‌ పాలకవర్గం తాజాగా అనుమతిచ్చింది. ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) కలిసి ఉంటుందని పేర్కొన్నది. జట్టు దగ్గర ఉండే మొత్తం రూ. 120 కోట్లు అయితే ఆ అట్టిపెట్టుకున్న ఐదుగురి కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే 2022 జరిగే మెగా వేలంలో ఆయా జట్లకు నలుగురిని మాత్రమే తమ వద్ద ఉంచుకోవడానికి అవకాశం కల్పించారు.

ఇదిలా ఉండగా.. రానున్న సీజన్‌ (2025) నుంచి లీగ్‌ మ్యాచ్‌లు ఆడటానికి ఎంపికైన ఆటగాళ్లందరికీ రూ. 7.50 లక్షల మ్యాచ్‌ ఫీజు (ప్రతి మ్యాచ్‌కు) ను అందించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. అంటే అన్ని లీగ్‌ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌కు అదనంగా రూ. 1.05 కోట్ల ఆదాయం లభిస్తుందన్న మాట. ఒక జట్టు ఈ ఫీజుల కోసం మొత్తం రూ. 12.60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వేలం పర్స్‌ రూ. 120 కోట్లకు ఇది అదనం.

ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న మొదటి ప్లేయర్‌కు వారు రూ. 18 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నాలుగు, ఐదో ఆటగాడిని కూడా అట్టిపెట్టుకుంటే వారు తిరిగి వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే ఐదుగురు ఆటగాళ్లను నిలిపిపెట్టుకుంటే వారికి రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఆర్‌టీఎం సహా వేలంలో మరో 15 మందిని కొని జట్టును తయారు చేసుకోవడం కోసం ఆ సొమ్ము మాత్రమే ఉంటుందని సీనియర్‌ బీసీసీఐ, ఐపీఎల్‌ పాలవర్గ సభ్యుడు చెప్పాడు.

మరోవైపు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను కొనసాగించాలని శనివారం జరిగిన పాలకవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి జై షా తెలిపాడు. ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌ వంటి బలమైన ఫ్రాంఛైజీలు 6-8 రిటెన్షన్లకు మొగ్గు చూపగా.. బలమైన ఆటగాళ్లు లేని ఇతర ఫ్రాంఛైజీలు అందుకు వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఐపీఎల్‌ వేలం జరిగే అవకాశం ఉన్నది.

First Published:  29 Sept 2024 8:13 AM GMT
Next Story