Telugu Global
Sports

జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రాకు రజతం

మొత్తం 12 మంది పాల్గొన్న ఈ ఫైనల్లో ప్రతీ ఒక్క క్రీడాకారుడికి ఆరు అవకాశాలు ఇస్తారు. అయితే ఈసారి నీరజ్‌ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు.

జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రాకు రజతం
X

భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా పారిస్‌ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో రెండో స్థానంలో నిలిచి దేశానికి ఈ ఒలింపిక్స్ లో తొలి సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. ట్రాక్‌ అండ్ ఫీల్డ్‌ విభాగంలో గత ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించిన నీరజ్‌చోప్రా.. ఈసారి మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌ తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. పాక్‌ అథ్లెట్‌ నదీమ్‌ అర్షద్‌ 92.97 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. గ్రెనడా అథ్లెట్‌ పీటర్స్‌ అండర్సన్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

మొత్తం 12 మంది పాల్గొన్న ఈ ఫైనల్లో ప్రతీ ఒక్క క్రీడాకారుడికి ఆరు అవకాశాలు ఇస్తారు. అయితే ఈసారి నీరజ్‌ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు. మిగతా అన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. పాక్‌ ఆటగాడు అర్షద్‌ కూడా మొదటిసారి ఫెయిల్ అయ్యాడు కానీ, రెండవసారి 92.97 మీటర్లు విసిరాడు. మొత్తం 2 సార్లు 90 మీటర్ల కంటే ఎక్కువగా ఈటెను విసిరాడు. బంగారు పతకాన్ని సాధించాడు. నీరజ్ కూడా దాదాపు 90 మీటర్లు విసిరాడు. నిజానికి ఇది నీరజ్ కెరియర్ లో బెస్ట్ త్రో అనే చెప్పవ‌చ్చు. మొత్తానికి ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటివరకు మొత్తం ఐదు పతకాలు సాధించింది. వీటిలో తొలి సిల్వర్‌ మెడల్‌ నీరజ్‌ది కాగా మిగతావన్నీ కాంస్య పతకాలే. భారత్ కు షూటింగ్‌లో మూడు పతకాలు రాగా, హకీలో కూడా ఒక పతకం వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ విజేత అయిన నీరజ్‌ ఈ సారి కూడా బంగారు పతకాన్ని సాధిస్తాడని యావత్ భారత దేశం ఆశలు పెట్టుకుంది. అయితే వరుస ఫౌల్స్ నీరజ్ కొంప ముంచాయని చెప్పచ్చు. కానీ వరుసగా రెండు ఒలింపిక్స్‌ పోటీల్లో రెండు పతకాలు అందుకున్న అథ్లెట్‌గా నీరజ్‌ రికార్డు సృష్టించాడు.

First Published:  9 Aug 2024 2:39 AM GMT
Next Story