Telugu Global
Sports

ఒలింపిక్స్ జావలిన్ త్రో ఫైనల్లో భారత బల్లెంవీరుడు!

పారిస్ ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రో ఫైనల్స్ కు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అలవోకగా చేరుకొన్నాడు. మహిళల కుస్తీ క్వార్టర్ ఫైనల్స్ కు వినేశ్ పోగట్ చేరుకొంది.

ఒలింపిక్స్ జావలిన్ త్రో ఫైనల్లో భారత బల్లెంవీరుడు!
X

పారిస్ ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రో ఫైనల్స్ కు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అలవోకగా చేరుకొన్నాడు. మహిళల కుస్తీ క్వార్టర్ ఫైనల్స్ కు వినేశ్ పోగట్ చేరుకొంది.

2024- ఒలింపిక్స్ 11వ రోజు పోటీలలో భారత అథ్లెట్లు మెరుగైన ఫలితాలు సాధించారు. అథ్లెటిక్స్, కుస్తీ అంశాలలో అంచనాలకు మించి రాణించారు. పురుషుల జావలిన్ త్రోలో భారత్ కు గత ఒలింపిక్స్ లో బంగారు పతకం అందించిన బల్లెంవీరుడు నీరజ్ చోప్రా..వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరాడు.

పారిస్ ఒలింపిక్స్ ప్రధాన స్టేడియం వేదికగా జరిగిన జావలిన్ త్రో గ్రూప్-బి క్వాలిఫైయింగ్ రౌండ్లో నీరజ్ 89.34మీటర్ల దూరం బల్లెం విసరడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగు పెట్టాడు.

గ్రూపు -బీ టాపర్ గా నీరజ్...

జావలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్లలో పాల్గొన్న వివిధ దేశాల అథ్లెట్లను రెండు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహించారు. భారత్ తరపున బరిలో నిలిచిన ఇద్దరిలో కిశోర్ కుమార్ జెనా గ్రూప్- ఏ నుంచి పోటీకి దిగి ఫైనల్స్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. జెనా 80.21 మీటర్ల తో ఒలింపిక్స్ నుంచి నిష్క్ర్రమించాడు.

మెడల్ రౌండ్ కు అర్హతగా 84 మీటర్లుగా లక్ష్యాన్ని నిర్ణయించారు. గ్రూప్- బీ నుంచి పోటీకి దిగిన నీరజ్ తొలి ప్రయత్నంలోనే అర్హతకు నిర్దేశించిన లక్ష్యం కంటే 5.34 మీటర్ల దూరం ఎక్కువగా విసరడం ద్వారా ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకోగలిగాడు. ప్రస్తుత సీజన్లో నీరజ్ సాధించిన అత్యుత్తమ రికార్డు ఇదే కావటం విశేషం.

కామన్వెల్త్ గేమ్స్ విజేత, పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 86.59 మీటర్ల రికార్డుతో మెడల్ రౌండ్లో అడుగుపెట్టాడు.

ఒక్కో గ్రూపు నుంచి 16 మంది తలపడగా..మొదటి ఆరుస్థానాలలో నిలిచిన 12 మంది స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఫైనల్ రౌండ్లో పోటీపడనున్నారు.

జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ స్టార్ యాకుబ్ వాడ్లిచ్, కెన్యాకు చెందిన జూలియస్ యోగో, పీటర్స్ నుంచి నీరజ్ చోప్రాకు గట్టి పోటీ ఎదురుకానుంది.

కుస్తీ క్వార్టర్ ఫైనల్స్ లో వినేశ్ పోగట్...

మహిళల ఫ్రీ-స్టయిల్ కుస్తీ 50 కిలోల విభాగంలో ఏదో ఒక పతకం సాధించగల సత్తా కలిగిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్..తొలిరౌండ్లోనే రెండుసార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ పై సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

హాట్ ఫేవరెట్ యూ సుసాకీతో జరిగిన పోరు మరో రెండు నిముషాలలో ముగుస్తుందనగా 0-2 పాయింట్లతో వెనుకబడిన వినేశ్..ఆఖరి రెండు నిముషాలలోనే ప్రత్యర్థిపై విరుచుకుపడి 3-2 పాయింట్లతో విజేతగా నిలిచింది.

50 కిలోల విభాగంలో తిరుగులేని చాంపియన్ గా ఉన్న సుసాకీ గతంలో మూడుసార్లు మాత్రమే పరాజయాలు పొందగా...వినేశ్ చేతిలో ఎదురైన ఓటమితో..మొత్తం నాలుగుసార్లు ఓటమి పొందినట్లయ్యింది.

ఈరోజు జరిగే టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలో చైనాతో భారత్ తలపడనుంది. హాకీ పురుషుల సెమీఫైనల్లో సైతం జర్మనీతో హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

పతకాలపట్టిక 60వ స్థానంలో భారత్....

ఒలింపిక్స్ 11వ రోజు పోటీల నాటికి పతకాల పట్టిక మొదటి రెండుస్థానాలలో అమెరికా, చైనా నిలిచాయి. చెరో 21 బంగారు పతకాలతో సమఉజ్జీలుగా ఉన్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్ర్రేలియా చెరో 13 స్వర్ణాలతో మూడు, నాలుగు స్థానాలలోనూ, 12 బంగారు పతకాలతో గ్రేట్ బ్రిటన్ 5వ స్థానాలోనూ కొనసాగుతున్నాయి. షూటింగ్ లో సాధించిన మూడు కాంస్య పతకాలతో భారత్ పతకాల పట్టిక 60వ స్థానానికి పడిపోయింది.

కుస్తీ, హాకీ, జావలిన్ త్రో అంశాలలో మాత్రమే భారత్ పతకాలు సాధించే అవకాశం ఉంది.

First Published:  6 Aug 2024 12:13 PM GMT
Next Story